రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో టీచర్లు, ఉద్యోగుల జీవితాల్లో తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. గతేడాది డిసెంబర్ 6 నుంచి నేటి వరకూ గమనిస్తే టీచర్లు, ఉద్యోగులు పడుతున్న గోసను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఉద్యోగులు, టీచర్ల కుటుంబాలు గుండెలు అవిసేలా ఏడుస్తున్న తీరు ఎంతో బాధ కలిగిస్తోంది. సగటు ఉద్యోగి పడుతున్న మనోవేదనను సర్కారు పట్టనట్టు చూస్తుంటే.. యూనియన్లు, సంఘాల లీడర్లు కూడా అండగా నిలబడటం లేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఎన్ని సంఘాలు ఉండి ఏమి లాభం అనిపిస్తోంది? సంఘాల నాయకులు మన్ను తిన్న పాముల్లా ఉండిపోతే.. ఉద్యోగులు, టీచర్ల గోస వినేటోడు ఎవడు? ఇకనైనా సంఘాల నాయకులు మేల్కోవాలి. మరింత మంది ఉద్యోగులు, టీచర్ల ఉసురు తగలక ముందే సర్కారును ప్రశ్నించాలి.
కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగులు, టీచర్ల సర్దుబాటు ఎంతో మంది జీవితాలను ఆగమాగం చేసింది. ఉద్యోగులు, టీచర్ల సమస్యల పరిష్కారం కోసమే పుట్టాయని చెప్పే 54 సంఘాలు ఈ విషయంలో ఏమీపట్టనట్లుగా ప్రవర్తిస్తున్నాయి. సర్కారు ఒంటెత్తు పోకడలను ఒకవైపు సగటు టీచర్లు ప్రశ్నిస్తుంటే.. సంఘాల నాయకులు మాత్రం గమ్మున ఉండిపోవడం చూసి ఉపాధ్యాయ లోకం సిగ్గుతో తలదించుకుంటోంది. వీళ్లా మా నాయకులు, వీరినా మేం నెత్తినపెట్టుకొని ఊరేగిందని ఆవేదన చెందుతోంది.
వ్యక్తి కోసం సంఘం, సంఘం కోసం వ్యక్తి పనిచేయాలి. కానీ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అన్నీ విరుద్ధంగా జరుగుతున్నట్టు అర్థమవుతోంది. టీచర్లే రోడ్డెక్కి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటుంటే.. సంఘ నాయకులమని చెప్పుకునే ఏ ఒక్క నాయకుడూ వారి వద్దకు వెళ్లి పలకరించ లేదు. మీకు మేం ఉన్నామని.. న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని మాట ఇచ్చిందీ లేదు. భరోసా కల్పించింది లేదు.
చోద్యం చూస్తున్న సంఘాలు..
317 జీవో తెచ్చిన కష్టాలు, నష్టాలతో ఇప్పటికే పదుల సంఖ్యలో ఉద్యోగులు, టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రస్తుతం ఉన్న ఏ సంఘం కానీ, నాయకుడు గానీ 317 జీవోను రద్దు చేయాలని గానీ, సవరణలు చేయాలని గానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగింది లేదు. డిమాండ్ చేసిందీ లేదు. తాము పుట్టి,పెరిగి, చదువుకొని.. స్థానికంగా నివసిస్తున్న ప్రాంతం స్థానికత కాకుండా పోతుంటే వారి తలిదండ్రులు, భార్య, పిల్లాపాపలను, వారసత్వంగా వచ్చిన ఆస్తులను వదిలి తనది కాని జిల్లాకు వెళ్లాల్సి వస్తుంటే అందరూ నిమ్మకు నీరెత్తినట్లు ఊరకుండిపోతున్నారు. ఇక టీచర్లు చేసేదేమీలేక బాధిత ఉపాధ్యాయులే జూనియర్స్ అని.. సీనియర్స్ అని.. స్పౌజ్ అని నాన్ స్పౌజ్ అని.. స్థానికత అని.. స్థానికత లేని టీచర్లని ఇలా వివిధ పేర్లతో రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని విడిపోయి పోరాడుతుంటే.. ప్రస్తుతం ఉన్న అన్ని సంఘాలు చోద్యం చూస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో స్థానికత అనే పదం లేదని, ఉద్యోగ నియామకాల్లో మాత్రమే స్థానికత వర్తిస్తుందని, కొత్త జిల్లాల్లో టీచర్లు, ఉద్యోగుల విభజనకు ఇది వర్తించదని ఒక సంఘం చెబుతుంటే.. లేదు లేదు ఆ సంఘం ఒప్పుకుంటేనే 317 జీవో వచ్చిందని మరో సంఘం ఆరోపిస్తూ ఒకరి మీద మరొకరు విమర్శించుకుంటున్నారు.
ఎలాగైనా ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా..
తమలో తాము తగవులాడుకోవడం మాని ఈ జీవో ద్వారా జరిగిన నష్టం ఎలా పూరిస్తారో ప్రస్తుతం సంఘ నాయకులు, టీచర్ ఎమ్మెల్సీలు ఆలోచించాలి. భార్యా భర్తలు వేరు వేరు జిల్లాలకు, కడవరకు ఉన్న ఊర్లోనే ఉండాలని కోరుకునే వారు.. వృద్ధాప్యంలో చూసుకునే వారు లేనివారు.. పెద్ద దిక్కును కోల్పోయి పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మహిళా ఫ్యామిలీల కోసం.. అన్ని సంఘాలూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎలా న్యాయం చెయ్యాలో చూడాలి. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు జోక్యం చేసుకుంటున్నారు, ఈ జీవోకు సవరణలు, రద్దు చేసినా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని ఆలోచించకుండా.. పెద్ద మనసుతో ఆలోచించి సమస్యను పరిష్కరించాలి. 15, 20 ఏండ్లపాటు ఎస్‌జీటీ, ఎల్‌పీగా విధులు నిర్వహించి, ఆలస్యంగా ప్రమోషన్ పొంది, అంతలోనే జూనియర్ పేరుతో రిటైర్ అయ్యే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరి స్థానికత ఉండి కూడా జూనియర్ పేరుతో అన్నీ వదులుకొని ఇతర జిల్లాలకు బలవంతంగా బదిలీ అయ్యే వారు కూడా చాల మందే ఉన్నారు. వాళ్లంతా ఎలాంటి సర్వీసును కోల్పోకుండా, వారి సొంత జిల్లాకు వచ్చేలా..ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అమలయ్యేలా.. శాశ్వత ప్రాతిపదికన ఒక జీవోను తీసుకువచ్చి ఆందోళన చెందుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపాలి. అన్ని సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలు ఈ దిశగా ప్రయత్నం చేయాలి.
నాయకులమని చెప్పుకుంటే చాలదు..
సంఘాల నాయకులు పట్టించుకోకపోయినా సగటు టీచర్లు మాత్రం ధైర్యం కోల్పోవడం లేదు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం కొనసాగిస్తున్నారు. రోజుకో విధంగా తన నిరసన తెలియజేస్తూ.. ఉద్యమ జ్వాలను రగిలిస్తూనే ఉన్నారు. పలానా సంఘానికి నాయకులమని చెప్పుకునే ప్రతి ఒక్క నాయకుడూ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆలోచించుకోవాలి. అసలు సంఘాలు అనేవి ఉంటేనే నాయకులుగా కొనసాగేది.. ఓ గుర్తింపు ఉండేది. ఇప్పుడు ముఖం చాటేసి రేపు ఏ ముఖం పెట్టుకొని సభ్యత్వం కోసం టీచర్ల వద్దకు వెళతారు? ఇప్పటికే కేడర్, కులం అని అనేక సంఘాలుగా విడిపోయి, ఐక్యత లేక రాజకీయ పార్టీల కంటే అధ్వానంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. చాలా సాధిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉపాధ్యాయ లోకం ముందు నాయకులుగా బిల్డప్ ఇస్తున్న వైనం తేటతెల్లమైపోయింది.
– పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, పీఆర్‌టీయు టీఎస్ లీడర్