- కాంట్రాక్టర్, ఏఈ, డీఈని నిలదీసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు
ఖమ్మం టౌన్, వెలుగు : క్వాలిటీ లేని డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఎందుకు కట్టారని పలువురు లబ్ధిదారులు ఆఫీసర్లను నిలదీశారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించేందుకు సోమవారం కాంట్రాక్టర్ రామారావు, ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఏఈ నానాజీ, డీఈ రాజు వచ్చారు. దీంతో ఈ నెల 16న కురిసిన తేలికపాటి వానకే డబుల్ బెడ్‌రూం ఇండ్ల టెర్రస్‌పై నీళ్లు నిలిచి
దుబ్బ పైకి తేలడంతో పాటు గుంతలు ఏర్పడ్డాయని బాధితులు ఆందోళనకు దిగారు. దుబ్బ వాడుతూ నాసిరకంగా ఇండ్లు కట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంట్రాక్టర్, ఏఈ, డీఈ కలిసి ఇండ్ల టెర్రస్, గోడల పగుళ్లు, నీటి చెమ్మ, ఫ్లోరింగ్ పగుళ్లను పరిశీలించారు. ప్రజలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకున్న ఆఫీసర్లు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.