చేరికలకు లైన్ క్లియర్ .. ఎవరొచ్చినా చేర్చుకోవాలని కాంగ్రెస్​ హైకమాండ్​ ఆదేశం

  • స్థానికనేతల అభ్యంతరాలతో ఇన్నిరోజులు ఆగిన వలసలు 
  • అడ్డుకుంటే బీజేపీలోకి వెళ్తారని అనుమానం
  • పార్లమెంట్​ అభ్యర్థి ప్రకటన తర్వాత భారీగా చేరికలుండే చాన్స్​ 

ఖమ్మం, వెలుగు : జిల్లాలో కాంగ్రెస్​ పార్టీలోకి మళ్లీ వలసలు పెరగనున్నాయి. ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్​ లీడర్లు పలువురు కాంగ్రెస్​ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా, వారి మీద స్థానిక నాయకుల అభ్యంతరాల నేపథ్యంలో ముఖ్య నేతలు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు వరకు అధికారాన్ని అనుభవించిన సమయంలో  కొందరు బీఆర్ఎస్​ లీడర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని, అప్పట్లో కాంగ్రెస్​ కార్యకర్తలను వేధింపులకు గురిచేశారని, ఇబ్బందులు పెట్టారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ఇలా పలు రకాల కారణాలను చూపించి కాంగ్రెస్​లో చేర్చుకోలేదు. 

లోకల్​లీడర్ల నుంచి గ్రీన్​సిగ్నల్ లేకపోతే వారిని పార్టీకి దూరంగానే ఉంచాలని మంత్రులు కూడా పలుమార్లు కామెంట్ చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి చాలా మంది బీఆర్ఎస్​ ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్​ లోకి వెళ్లేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ హైకమాండ్​ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో వారికి లైన్​ క్లియర్​ అయింది. కాంగ్రెస్​ లోకి చేరికలను ఎవరూ అడ్డుకోవద్దని,  వారంతా బీజేపీలోకి వెళ్తే ఆ పార్టీ బలోపేతం అవుతుందంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​వార్నింగ్ ఇవ్వడంతో ఇక జిల్లా స్థాయిలో భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. 

కారు దిగి కాంగ్రెస్​లోకి..

జిల్లాలో మండల స్థాయి నాయకుల నుంచి మాజీ మంత్రి వరకు చాలా మంది కారు దిగి కాంగ్రెస్​ లో చేరేందుకు రెడీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశించిన సత్తుపల్లి టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్​ బీఆర్ఎస్​ లో చేరారు. కాంగ్రెస్​ లో సుదీర్ఘ పొలిటికల్​ కెరీర్​ ను పక్కనపెట్టి కేసీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా ఒక ఎమ్మెల్యేతో పాటు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు అడ్డుకున్నట్టు తెలుస్తోంది

సత్తుపల్లికి చెందిన మరో లీడర్​ మానవతారాయ్​ కూడా అదే సమయంలో బీఆర్ఎస్​ లో చేరారు. కాంగ్రెస్​ లో రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్నా, సత్తుపల్లి టికెట్​ విషయంలో భంగపడి పార్టీని వీడారు. ఇప్పుడాయన కూడా మనసు మార్చుకొని కాంగ్రెస్​ వైపు చూస్తున్నారని సమాచారం. వీళ్లతో పాటు 13 మంది కార్పొరేటర్లు, నలుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీసీలు, కొందరు మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు కూడా క్యూలో ఉన్నారు. డీసీసీబీ డైరెక్టర్లు, చాలా మంది మాజీ సర్పంచుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్​ ఖమ్మం లోక్​ సభ అభ్యర్థి ప్రకటన తర్వాత ఈ చేరికలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 

బీజేపీ ఆశలకు గండిపడ్డట్టే.. 

ఖమ్మం నియోజకవర్గంలో కొద్దిరోజులుగా బీజేపీ నేతలు స్థానిక బీఆర్ఎస్​ కార్పొరేటర్లను తమ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్​లోకి అవకాశం లేకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు కొందరు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు డోర్లు ఓపెన్​ చేయడంతో బీజేపీ లీడర్ల ఆశలకు గండిపడ్డట్టే కనిపిస్తోంది.