ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? ఇముడుతాయని కాంగ్రెస్ చెబుతోంది. ఇమడవనేది కాంగ్రెస్ అనుభవం. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింథియాల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రంలో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. జ్యోతిరాదిత్య కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరి కేంద్రమంత్రి అయ్యారు. చత్తీస్ గఢ్ లో 2018లో కాకలు తీరిన టీఎస్ సింగ్ దేవ్ ను పక్కకు తప్పించి భూపేశ్ బఘెల్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య కీచులాటలు వీధికెక్కి చాలా కాలమైంది. కర్నాటకలో మాదిరి అధికార మార్పిడి ఒప్పందం ఆయా రాష్ట్రాల్లో లేదుకదా అనవచ్చు. అలాంటి ఒడంబడిక ఎంత కాలం నిలుస్తుందో సందేహమే. రాజకీయాల్లో 30 నెలలంటే చాలా సుదీర్ఘ కాలమే. కర్నాటకలో ఈ ప్రయోగం సఫలమైతే అది ముఠా తగాదాలకు పేరెన్నికగన్న కాంగ్రెస్ కు ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించదగ్గ విధానం అవుతుంది. కాంగ్రెస్సే కాదు, మిగిలిన పార్టీలు కూడా అదే బాట పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ నాయకులు అవతరించడానికి ముఠాతత్వం అనుకూలంగా ఉపయోగపడుతుంది.
సఫలమవుతున్న నమూనా
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రులకు, ఇతర మంత్రులకు కొంత గడువు నిర్ణయించి, అది పూర్తి కాగానే, కొత్తవారిని మంత్రులుగా చేయడం ద్వారా , దాదాపు అందరినీ సంతృప్తిపరుస్తూ, అసమ్మతి తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నారు. జగన్ తో సరితూగగల నాయకుడు ఆ పార్టీలో మరొకరు లేకపోవడం వేరే విషయం. తిరిగి కర్నాటక విషయానికి వస్తే, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిలో కూడా శివకుమార్ కొనసాగడానికి అనుమతించడం కూడా ఒడంబడికలో భాగమని చెబుతున్నారు. ఆ లెక్కన, ఒకే వ్యక్తి జోడు పదవులను నిర్వహించకూడదని పెట్టుకున్న నియమంపై కాంగ్రెస్ రాజీపడినట్లే లెక్క.
ముందు నుయ్యి వెనుక గొయ్యి
కాంగ్రెస్ అధిష్టానం పాలనాదక్షుడైన సిద్ధరామయ్య వైపు పూర్తిగా మొగ్గితే, ముఖ్యంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు సమీకరించిపెట్టగల సామర్థ్యమున్నశివకుమార్ను వదులుకున్నట్లు అవుతుంది. అలాగని, శివకుమార్ వైపు పూర్తిగా పగ్గాలప్పగిస్తే కర్నాటకలో పరిపాలన పేలవంగా మారవచ్చు. దాని పర్యవసానమే చెరి 30 నెలలు సీఎంగా ఒప్పందం. కానీ, వారిద్దరి మధ్య ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన పంతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం తాలూకు ఆనందం కాంగ్రెస్ నాయకుల వదనాలపై ఎక్కువ సేపు నిలువనివ్వలేదు. కర్నాటకలో తమ విజయాన్ని ముందుగానే పసిగట్టిన కాంగ్రెస్ పెద్దలు ఈ ఒప్పందం తాలూకు రూపురేఖల్ని ముందుగానే ఇద్దరికీ వివరిస్తే పరువును కాపాడుకున్నట్లు అయ్యేది. ముఠా తగాదాలతో ఆదిలోనే హంసపాదు అనే మాట వచ్చేది కాదు. ఇపుడు కూడా మల్లికార్జున ఖర్గే బుజ్జగించి, స్వయంగా సోనియా గాంధీ ఫోన్ చేసి నచ్చజెప్పబట్టే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకున్నారని చెబుతున్నారు. శివకుమార్ క్యాబినెట్ లో సిద్ధరామయ్య పనిచేస్తారో లేక తన అనుచరుడు ఎవరికైనా ఉప ముఖ్యమంత్రి పదవిని కోరతారో చూడాలి.
పంతానికి కారణం
తాను ఎప్పటికీ తోడు పెళ్లికొడుకుగానే ఉండి పోతానేమోనని శివకుమార్ భయం. ఇప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే ఒకప్పుడు ఎస్. ఎం. కృష్ణ, ధరమ్ సింగ్ లు కర్నాటకలో ముఖ్యమంత్రులవుతుంటే అలాగే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. చివరకు 2013లో కూడా ఖర్గేని ‘కేంద్రం’ లోకి తీసుకుని సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేశారు. ఒక్కలిగ వర్గానికి చెందిన తనను చూసే, ఈసారి ఒక్కలిగల్లో కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపబట్టి పార్టీకి ఎక్కువ సీట్లు లభించాయని శివకుమార్ అభిప్రాయం. కాంగ్రెస్ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యూఐతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ పార్టీనే నమ్ముకున్న వ్యక్తి శివకుమార్. పనులు సాధించి తీరగల దిట్టగా పేరు తెచ్చుకున్నారు.
సింహాసనంపై ధీమా
శాసనసభ్యుల మాటకే ప్రాధాన్యమిచ్చే పక్షంలో, ముఖ్యమంత్రి గద్దె తనదేనని సిద్ధరామయ్య మొదటి నుంచీ ధీమాతో ఉన్నారు. కురుబ వర్గానికి చెందిన సిద్ధరామయ్యకు పాలనా దక్షుడుగా పేరుంది. శాసనసభాపక్షంలో అత్యధికుల మద్దతు ఆయనకే ఉంది. పైగా, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయించడం ద్వారా జనాదరణ పొందాడు. అదే ఆయనను కర్నాటకకు 23వ ముఖ్యమంత్రిని చేసింది.
ముందుంది మొసళ్ల పండుగ
సిద్ధరామయ్య ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయన హయాంలోనే లోక్ సభ ఎన్నికలు వస్తాయి. రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో 20 స్థానాలు గెలిచి తీరుతామని కాంగ్రెస్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఒకే ఒక లోక్ సభ సభ్యుడు శివకుమార్ సోదరుడు డి.కె. సురేశ్ ఉన్నారు. జేడీఎస్నుంచి ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీ కాగా, ఇండిపెండెంట్ గా మాండ్యా నుంచి గెలిచిన సుమలతా అంబరీశ్ బీజేపీలో చేరారు. అలా ప్రస్తుతం కర్నాటక నుంచి 26 మంది బీజేపీ సభ్యులున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంకెలలో లోక్ సభ స్థానాలు గెలుచుకుంటేనే జాతీయ స్థాయిలో ప్రాధాన్యం నిలుపుకుంటుంది.
హామీలు అమలవుతాయా?
కాంగ్రెస్ ను గెలిపించడంలో చూపించిన ఐక్యతను, శ్రద్ధాసక్తులను ‘రామయ్య’, ‘శివయ్య’లు పార్టీ ఎన్నికల ప్రణాళికను అమలుజరపడంలో కూడా చూపిస్తారా? అనేది ఇప్పుడు కోటి రూకల ప్రశ్న. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం, పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.3000, డిప్లొమా హోల్డర్లకు రూ. 1500 చొప్పున భృతి, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ‘హస్తం’ లోని ఐదు వేళ్లకి ప్రతీకగా ఐదు ప్రధాన హామీలివ్వడం బాగానే ఉంది కానీ, అవి ఎంతవరకు అమలవుతాయో చూడాలి. వీటన్నింటికి నలభై వేల కోట్ల రూపాయలకు పైగానే అవసరమవుతాయని ఆర్థిక నిపుణుల మాట. కఠినమైన షరతులకు లోబడి వీటిని అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. షరతుల మిషతో ప్రయోజనాలు పొందలేకపోయిన ఓటర్లు తాము వంచనకు గురైనట్లు భావించగల అవకాశం ఉంది. వారు తమ కోపాన్ని చూపడానికి వీలుగా లోక్ సభ ఎన్నికలు కూడా ఎంతో దూరంలో లేవు.
అవినీతి రహిత పాలన?
విశృంఖల అవినీతిని అరికట్టడం, ధరలకు కళ్లెం వేయడం ప్రభుత్వం ముందున్న అత్యంత ముఖ్యమైన లక్ష్యం. ధరలకు కళ్లెం వేయడంలో రాష్ట్రం చేయగలిగింది పరిమితమే. పెట్రోలు, డీజిలు, గ్యాస్ లపై రాష్ట్ర సుంకాలను తగ్గించి కొంత ఫలితం చూపవచ్చు. అవినీతిని అరికట్టడానికి మాత్రం ఎంతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పార్టీది “40 శాతం కమీషన్ సర్కార్” గా ఆరోపించడం తేలిక. వాస్తవంలో, అవినీతి రహిత పాలన చూపడం కష్టం. కర్నాటక పాలనా ఫలితాలను రానున్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాడాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. మొత్తానికి, కర్నాటకలో ‘రామయ్య’ శివ ధనుర్భంగం అయితే చేశారు గానీ, మున్ముందు ఎదుర్కోవాల్సిన కష్టాలు చాలానే ఉన్నాయి.
- మల్లంపల్లి ధూర్జటిసీనియర్ జర్నలిస్ట్