
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లోని పలు కాలనీలు మురికికూపాలను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు సిటీలోని డ్రైన్లన్నీ ఉప్పొంగడంతో కాలనీల్లోని ఓపెన్ ప్లాట్లలోకి నీరు భారీగా చేరింది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసాలుగా మారడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడడంతో పాటు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధ్వానంగా స్లమ్ ఏరియాలు
బల్దియా పరిధిలోని 66 డివిజన్లలో సుమారు 1,450 కాలనీలు ఉన్నాయి. ఇందులో నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ అన్నీ కలిపి 183 స్లమ్ ఏరియాలు ఉన్నాయి. నగరం మొత్తం జనాభా 11 లక్షలు కాగా సుమారు 2.5 లక్షల మంది స్లమ్ ఏరియాల్లోనే నివసిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు దోమలు, ఈగలు, పందులకు నిలయంగా మారుతున్నాయి. దీంతో స్లమ్ ఏరియాల్లో నివసించే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలోని ఏనుమాముల సమీపంలోని ఎస్సార్ నగర్, సాయిగణేశ్‌కాలనీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వరంగల్‌లోని దేశాయిపేట, పైడిపల్లి, శివనగర్, చింతల్, ఎన్‌టీఆర్ నగర్, భీమారం, గోపాలపురం, వడ్డేపల్లి, సమ్మయ్యనగర్, అంబేడ్కర్ నగర్, దీనదయాళ్ నగర్, సుర్జీత్‌నగర్ కాలనీ, రెవెన్యూ కాలనీ, గోపాలపూర్ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. స్లమ్ ఏరియాల్లోనే కాకుండా గ్రేటర్‌లో విలీనమైన 42 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫీసర్లు శానిటేషన్ పనులు సక్రమంగా చేపట్టకపోవడం వల్లే దోమలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. అప్పుడప్పుడు చెత్తాచెదారం, మురుగుకాల్వల పూడికతీత చేపడుతున్న సిబ్బంది మెయిన్ రోడ్లకే పరిమితం అవుతూ కాలనీలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మురుగు నీటితో నిండిన ఓపెన్ ప్లాట్లు
వరంగల్ నగరంలో 2.5 లక్షల ఇండ్లు ఉండగా సుమారు 2,500కు పైగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. కాలనీల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ, మురుగు కాల్వల మధ్య కనెక్టివిటీ లేకపోవడంతో వరదతో పాటు ఇండ్లలోంచి వచ్చే మురుగు నీరు ఓపెన్ ప్లాట్లలోకి చేరుతోంది. దీంతో ఆయా ప్లాట్లన్నీ దోమలు, పందులకు అడ్డాగా మారుతున్నాయి. ప్లాట్ల క్లీన్ చేసుకోవాలని వర్షాకాలానికి ముందే యజమానులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఓపెన్ ప్లాట్ల ఓనర్లకు ఈ నెలాఖరులోగా నోటీసులు ఇవ్వాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఆఫీసర్లను ఆదేశించారు. కానీ ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్లాట్లన్నీ మురుగు నీటితో నిండిపోయాయి. దీంతో ఇప్పటికిప్పుడు ప్లాట్లను క్లీన్ చేసే పరిస్థితి లేకుండా
పోయింది.
పొంచి ఉన్న డెంగీ, మలేరియా ముప్పు
నగరంలో దోమల నియంత్రణ కోసమంటూ ఫాగింగ్ మెషీన్లు, కెమికల్స్, యాంటీ మలేరియా ఆయిల్స్, వెహికల్స్‌కు డీజిల్, పెట్రోల్, సిబ్బంది వేతనాలు అన్నీ కలిపి ఏటా రూ.2 కోట్లకుపైగానే ఖర్చు చేస్తున్నారు. అయితే లెక్కల్లో తప్ప ఫీల్డ్‌లో అంత మొత్తం ఖర్చు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమల నివారణకు ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయడం, ఆయిల్ బాల్స్ వేయడం వంటివి చేయాలి. కానీ చాలా డివిజన్లలో ఆ పనులు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 6, డెంగీ 27 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు పడి, వాతావరణం మారుతున్నందున మున్ముందు మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. నగరంలో శానిటేషన్ లోపం కారణంగా రోగాలు విజృంభించే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.