- పుష్కరకాలం తర్వాత ముంపునకు గురైన హుస్నాబాద్
- కట్టు కాల్వ నీటి మల్లింపునకు ప్లాన్
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: పుష్కరకాలం తర్వాత హుస్నాబాద్ పట్టణంలోని పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇండ్లలోకి వరద నీరు చేరింది. పోతారం వైపు నుంచి వచ్చే వరద నీటిని మళ్లించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోగా మెయిన్ రోడ్డు, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా మోకాళ్లలోతు నీరు నిలిచి చెరువులా మారాయి. పట్టణంలోని శివాజీనగర్, సాయినగర్, నాగారం, హనుమకొండ రోడ్డు, మల్లెచెట్టుచౌరస్తా, హనుమాన్ నగర్, సాయినగర కాలనీ,స్నేహనగర్, వినాయకనగర్, టీచర్స్ కాలనీల్లో ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది.
కట్టు కాల్వ వరదతో సమస్య
పోతారం(ఎస్) సమీపంలోని కట్టుకాల్వ ఉప్పొంగడంతో హుస్నాబాద్ పట్టణానికి ముంపు సమస్య ఏర్పడింది. గతంలో తీగలకుంట స్థానంలో వ్యవసాయమార్కెట్ యార్డు నిర్మించడంతో పాటు కుంట పరిధిలో ఇండ్ల నిర్మాణాలు జరగడం వరద ముంపునకు కారణమైంది. ప్రతీఏటా వానకాలంలో కట్టుకాల్వ ఉప్పొంగడంతో హుస్నాబాద్ మునిగిన సంఘటనలు జరుగుతున్నా వరద మళ్లింపు చర్యలు తీసుకోలేదు.
గతంలో కట్టుకాల్వ నుంచి వచ్చే నీరు హుస్నాబాద్ పట్టణ శివార్లలోని తీగలకుంటలోకి చేరేది. అక్కడి నుంచి పటేల్ కుంట మీదుగా కొత్తచెరువులోకి నీరు వెళ్లేది. అయితే తీగలకుంట, పటేల్ కుంటల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు వెలియడంతో హుస్నాబాద్ వరద ముంపునకు గురవుతోంది.
రంగంలోకి మంత్రి పొన్నం..
హుస్నాబాద్ పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణం నుంచి వెళ్తున్న జాతీయ రహదారి పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. వేగంగా విద్యుత్ పనులు పూర్తి చేసి డ్రైనేజీ వ్యవస్థ క్రమబద్ధీకరించాలన్నారు.
పోతారం నుంచి పట్టణంలోకి వచ్చే వరద నీరు డ్రైనేజీ లోకి సక్రమంగా వెళ్లేలా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే 15 రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ ,విద్యుత్ పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు డెడ్ లైన్ విధించారు.