
- ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సగానికిపైగా ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగానికే వచ్చాయి. మొత్తం 73 ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్‌కు 41, ఇంజినీరింగ్ మెయింటెనెన్స్‌కు 8, హౌసింగ్ 4, ట్యాక్స్, ఫైనాన్స్, ల్యాండ్ అక్విజేషన్, వెటర్నరీ, యూబీడీ విభాగాలకు మూడు చొప్పున, ఎలక్ట్రికల్ 2, శానిటేషన్, హెల్త్, ఎస్టేట్స్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. అటు ఆరు జోన్లలోని 91 ఫిర్యాదుల్లో కూకట్ పల్లి జోన్ లో 45, సికింద్రాబాద్ లో 16, శేరిలింగంపల్లి లో 17, చార్మినార్ లో 6, ఎల్బీనగర్ లో 7 రాగా, ఖైరతాబాద్ జోన్లో ఒక్క ఫిర్యాదు రాలేదు.
జోన్లలో కూడా అక్రమ ఇండ్ల నిర్మాణం తదితర వాటి గురించి టౌన్ ప్లానింగ్ విభాగానికే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ సంబంధించి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అలాగే ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 6 ఫిర్యాదులు రాగా, వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాలకు పంపించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, సుభద్ర దేవి, నళిని పద్మావతి, పంకజ, గీతా రాధిక, సత్యనారాయణ, అశోక్ సామ్రాట్ పాల్గొన్నారు.
హైదరాబాద్ కలెక్టర్‌కు 1,411 అర్జీలు
ప్రజావాణికి వచ్చిన అర్జీలను పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని హైదరాబాద్కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డితో కలిసి ఆయన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 1,411 దరఖాస్తులు అందగా, అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 1052, రేషన్ కార్డుల కోసం 271, పెన్షన్ 47, డీఈఓ 03, ఎస్సీ కార్పొరేషన్ 04, రెవెన్యూ 11, ఐసీడీఎస్ 4, ఇతర శాఖలకు సంబంధించినవి 19 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 67 అర్జీలను రాగా, ఇందులో రెవెన్యూ శాఖ-కు 51, ఇతర శాఖలకు 16 అందాయి. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు
పాల్గొన్నారు.