కాంగ్రెస్ రికార్డుల మోత..నల్గొండలో 5.5 లక్షల మెజారిటీ

కాంగ్రెస్ రికార్డుల మోత..నల్గొండలో 5.5 లక్షల మెజారిటీ
  • ఖమ్మంలో 4.5 లక్షల ఆధిక్యం
  • దేశంలో టాప్ మెజారిటీల్లో నల్గొండ, ఖమ్మం 
  • మహబూబాబాద్ లో మూడున్నర లక్షలు.. 
  • భువనగిరిలో 2 లక్షల మెజారిటీ

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రం నుంచి పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు రికార్డు స్థాయి మెజారిటీలతో గ్రాండ్ విక్టరీస్​కొట్టారు. దేశంలో టాప్ మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో మన రాష్ట్రం నుంచి పలువురు ఉన్నారు. నల్గొండ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన కుందూరు రఘువీర్ రెడ్డి మొత్తం 12,27,186 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై 5 లక్షల 60 వేల భారీ మెజారిటీతో గెలిచారు.

దేశంలోనే టాప్ 10 మెజారిటీ సాధించిన ఎంపీల లిస్ట్​లో ఈయన ఉన్నారు. నల్గొండలో నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఆ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ 5 లక్షల మెజారిటీతో గెలుస్తామని, ఇండియాలోని టాప్ 10 మెజారిటీల్లో నల్గొండ నిలుపుతామని మొదటి నుంచి చెబుతున్నారు. ఉత్తమ్ అన్నట్లుగానే 5 లక్షలకు పైగా మెజారిటీ సాధించారు.

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్​లో కాంగ్రెస్​కు 1,05,419 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఉత్తమ్ భార్య, ఎమ్మెల్యే పద్మావతి నియోజకవర్గం అయిన కోదాడ నుంచి 95,737 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలో మంత్రి ఇచ్చిన మాట నిలుపుకున్నారని ఆ జిల్లా నేతలు అంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నుంచి 53,179 మెజారిటీ వచ్చింది. 

రఘురామ్‌ రెడ్డికి 4.5 లక్షల మెజారిటీ..

ఇక ఖమ్మం కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రామసహాయం రఘురామ్ రెడ్డి 4 లక్షల 50వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఇది కూడా ఇండియా టాప్ మెజారిటీ లిస్ట్ లో ఉంది. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గాలు మధిర, ఖమ్మం, పాలేరు ఈ మూడు నియోజకవర్గాలు ఖమ్మం ఎంపీ పరిధిలోనే ఉన్నాయి.

ఈ మూడు నియోజకవర్గాల నుంచి భారీగా మెజారిటీ వచ్చింది. మహబూబాబాద్ నుంచి గెలిచిన బలరాం నాయక్ మూడున్నర లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వరంగల్ నుంచి గెలుపొందిన కడియం కావ్య రెండు లక్షలకు పైగా మెజారిటీ సాధించారు.

భువనగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా 2 లక్షల 20 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇక బీజేపీ మొత్తం 8 సీట్లు గెలవగా మల్కాజ్ గిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ 3. 87 లక్షలకు పైగా ఆధిక్యం సాధించారు. కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్​కు సుమారు 2 లక్షల 25 వేల ఓట్లు మెజారిటీ వచ్చింది. హైదరాబాద్ ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఒవైసీ 3లక్షల 30 వేల మెజారిటీతో గెలిచారు.