యూనిట్ల ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు చాన్స్

  •     స్త్రీ నిధి లోన్​తోపాటు సబ్సిడీ
  •     మిగులు విద్యుత్ గ్రిడ్​కు అనుసంధానం 
  •     ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.. లేదా అమ్ముకోవచ్చు 

మంచిర్యాల, వెలుగు: కరెంటు బిల్లులు రోజురోజుకు భారం కావడంతో చాలామంది వినియోగదారులు సోలార్​పవర్​ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో సామాన్యులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి సోలార్​ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాయి. సోలార్​పవర్​ప్లాంట్​ఏర్పాటు చేసుకోవాలనుకునే స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్ర్తీనిధి పరపతి సహకార సమాఖ్య లోన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా సొంతంగా సోలార్​పవర్​ను ఉత్పత్తి చేసుకొని కరెంటు ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చు. నెట్​ మీటరింగ్​తో ఇంటి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన కరెంట్​ను గ్రిడ్​కు అనుసంధానం చేసి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. లేదంటే మిగులు విద్యుత్​ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం యూనిట్​కు రూ.4.30 చెల్లిస్తుండగా, ఈ రేట్లు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుంది.  

యూనిట్​కాస్ట్.. సబ్సిడీ

2 కిలోవాట్ల యూనిట్​కాస్ట్​ రూ.1,42,200 కాగా స్ర్తీనిధి లోన్​ రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.39 వేలు, లబ్ధిదారు వాటా రూ.3 వేలు. 3 కిలోవాట్ల యూనిట్​కు రూ. 1,92,360 కాగా లోన్​ రూ.1.25 లక్షలు, సబ్సిడీ రూ.57,360, లబ్ధిదారు వాటా రూ.10వేలు భరించాలి. లోన్​పై 11 శాతం వడ్డీ వసూలు చేస్తారు. నెలవాయిదా 2 కిలోవాట్లకు రూ.2,243, 3 కిలోవాట్లకు రూ.2,803 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఐదేండ్లలో లోన్​ మొత్తం తీరిపోతుంది. సోలార్​ ప్యానల్స్​కు 25 సంవత్సరాల వారంటీ, సోలార్​ యూనిట్​కు 5 ఏండ్ల వారంటీ ఉంటుంది. ఇందులో ఇన్వర్టర్, డీసీ బాక్స్, ఏసీ బాక్స్, నెట్​మీటర్, కేబుల్స్​ఉంటాయి. వారంటీ గడువు ముగిసిన తర్వాత ఇన్వర్టర్​ఫెయిల్​అయితే సొంతంగా కొత్తది ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అంతకుమించి ఎలాంటి నిర్వహణ ఖర్చులు ఉండవు. ఈ లెక్కన మిగతా 20 ఏండ్లు ఇంటికి అవసరమైన కరెంటును ఫ్రీగా వినియోగించుకోవడమే కాకుండా మిగులు విద్యుత్​ను ప్రభుత్వానికి అందించి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. 

జిల్లాలకు యూనిట్ల మంజూరు 

స్ర్తీనిధి ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో సుమారు 1500 యూనిట్లు మంజూరయ్యాయి. మెదక్​ జిల్లాలోని 10 మండలాల్లో 350 యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు టార్గెట్​గా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. గృహావసరాలకు 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం గల యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. 2 కిలోవాట్ల యూనిట్​ నుంచి రోజుకు 8 నుంచి 10 యూనిట్లు, 3 కిలోవాట్ల యూనిట్​ నుంచి 12 నుంచి 15 యూనిట్ల కరెంట్​ఉత్పత్తి అవుతుంది. సోలార్​ప్యానల్ బిగించడానికి ఆర్​సీసీ ఇంటికి సుమారు160 నుంచి 200 చదరపు అడుగుల స్థలం అవసరం. నెలవారీగా వినియోగించుకునే యూనిట్ల ఆధారంగా 2 లేదా 3 కిలోవాట్ల యూనిట్​ను విద్యుత్​ సంస్థ పర్మిషన్​తో టీఎస్​రెడ్​కో ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. టీఎస్​ రెడ్​కో వద్ద రిజిస్టర్​ అయిన వెండర్లు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్​ న్యూ అండ్​రెన్యువబుల్​ ఎనర్జీ ఆమోదించిన మోడల్స్​ ప్రకారం యూనిట్లను ఏర్పాటు చేస్తారు. tsredco.telangana.gov.in వెబ్​సైట్​లో లాగిన్​ అయ్యి వెండర్లను ఎంపిక చేసుకోవచ్చు.