భారత దేశానికి శిరస్సులా ఉన్న జమ్మూ-కాశ్మీరు అందమైన లోయలు, ఎత్తైన చల్లని హిమాలయాలు, పండ్ల, పూల తోటలు, నిత్యం గల గల పారే నదులు, పచ్చని పర్యావరణం. వీటికి తోడు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, యాత్ర ప్రదేశాలు దేశం లోని ప్రజలని, అదే విధంగా ప్రపంచాన్ని పర్యాటకంగా ఎంతో ఆకర్షిస్తుంది. అట్లాంటి కాశ్మీర్ లో దశాబ్దాల పాటు పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం, చొరబాటుదార్లు, స్మగ్లర్ల అరాచకాల పై రోజూ వార్తలే విన్నాం. దీని వలన కశ్మీర్ లోయలో వేలాది మంది కాశ్మీర్ పండిట్లు, ప్రజలు, పోలీసులు, సైన్యం హింసకు గురవుతూనే వచ్చారు. ఇవాళ ఆ పరిస్థితిలో మార్పులను చూస్తున్నాం.
రాజకీయ పరిష్కారం
370 ఆర్టికల్ తొలగించాలంటే పాలకులు ఎంతో భయపడేవారు. దీన్ని ఆసరా చేసుకొని పాకిస్తాన్ పీఓకే తో పాటుగా కశ్మీర్ కూడా మాదే అంటూ దశాబ్దాలుగా నానా యాగీ చేస్తోంది. మరో వైపు చైనా ఆక్సయిచిన్ ను ఆక్రమించి రోడ్డు మార్గాలను నిర్మిస్తోంది. దీనికి చరమగీతం పాడుతూ మోదీ, అమిత్ షాలు 2019 ఆగస్టు 5న, 370 ఆర్టికల్ రద్దు తో కాశ్మీర్ నయా కశ్మీర్ రూపుదిద్దుకుంది. 370 ఆర్టికల్ రద్దును రాజకీయ నోట్ బందీగా విమర్శించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నాయి.ఆర్టికల్ 370 రద్దు చేసి 2023 ఆగస్టు నాటికి నాలుగేళ్లు గడిచాయి.
ఎంతోమంది జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై పలు దేశాలు రకరకాలుగా స్పందించాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది సాధించింది. ఇప్పుడు వేలాది కశ్మీర్ పండిట్లు కాశ్మీర్ కు తిరుగుముఖం పట్టారు. దీనికి కారణం కాశ్మీర్ లోయ లో శాంతి భద్రతలు ఏర్పడటమే.
ప్రగతి పథంలో కాశ్మీర్
ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల వృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించడం మూలంగా అభివృద్ధి గణనీయంగా పెరిగింది. వంతెనలు, రహదారుల నిర్మాణాలు, శాంతి భద్రతల కారణంగా జమ్మూ కాశ్మీర్ ఎంతో పురోగతి సాధించింది. నాలుగేళ్ల తర్వాత పరిస్థితి చూస్తే ఆర్టికల్ 370 రద్దు చేయడంలోని తార్కికత ఏంటో అర్థమైంది. రద్దుచేయడంలో ఉన్న హేతుబద్ధత తెలిసింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ ప్రగతి పథంలో పయనం చేస్తుంటే మోదీ ప్రభుత్వం సాధించిన అత్యంత ఘన విజయాల్లో ఒకటిగా నిలిచింది. నాలుగేళ్లలో జమ్ము కశ్మీర్ అభివృద్ధికి కేంద్రం కూడా ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.
జమ్మూ కాశ్మీర్ లో కనీస సౌకర్యాలు రోడ్లు, విద్యుత్తు, ఆసుపత్రి, ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాంటిది ఇప్పుడు ఎన్నో గ్రామాలను తారు రోడ్లతో అనుసంధానం చేశారు. రూ.58,440 కోట్లతో రహదారులు, విద్యుత్, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, వ్యవసాయం, నైపుణ్యాల అభివృద్ధి లాంటి రంగాల్లో ప్రాజెక్ట్లులు కేటాయించారు. జమ్ము కాశ్మీర్‌లో పబ్లిక్ వర్క్స్ విభాగంలో సంస్కరణలు జోరుగా సాగుతున్నాయి.
విస్తరించిన రవాణా వ్యవస్థ
చీనాబ్ నదిపై 359 మీటర్ల ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను కూడా నిర్మించారు. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ప్రతిగా గుర్తింపు పొందింది. శ్రీనగర్ నుంచి జమ్మూ మధ్య దూరం 300 కిలోమీటర్లు దూరాన్ని చేరుకునేందుకు గతంలో 14 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఆరు నుంచి ఏడు గంటల్లో చేరుకోగలుగుతున్నారు. అంతకు ముందు రోజుకు 6.54 కిలోమీటర్లుగా ఉన్న రహదారుల నిర్మాణం.. 2022-–23 నాటికి రోజుకి 20.64 కిలోమీటర్లకు రోడ్ల నిర్మాణం జరుగుతోంది.
దాంతో ఆయా ప్రాంతాలకు చేరుకోవడం సులభమైంది. వివిధ ప్రాంతాల్లో అనుసంధానం మెరుగు పడింది. కశ్మీర్ ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేయటం అధికమైంది. ఇందులో భాగంగా 111 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టారు. ఈ రాష్ట్రంలో రోడ్డు మార్గాలు 2019 లో 66% మాత్రమే ఉండగా 2023 నాటికి 78 % కు చేరుకుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద దేశంలో వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రహదారుల నిర్మాణానికి సంబంధించి టాప్ 3 రాష్ట్రాల్లో జమ్మూకాశ్మీర్ ఒకటిగా ఉంది.
సంక్షేమం, ఆరోగ్యం
దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోను అమలవుతున్నాయి. శ్రీనగర్‌లో 2023 మే నెలలో జీ 20 సదస్సు విజయవంతంగా నిర్వహించారు.1989-–99 మధ్యకాలంలో ఉగ్రవాదం బారిన పడి నష్టపోయిన వారి కోసం జమ్ము కాశ్మీర్‌లో 5,248 రెండు గదుల భవనాలు నిర్మించారు. వలస ఉద్యోగుల కోసం 880 భవనాలను నిర్మించారు. ఆరోగ్య రంగం లో భాగంగా జమ్ము కాశ్మీర్ ప్రజల ఆరోగ్య రక్షణకు యాత్ర సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం కింద నమోదు చేసుకున్న లక్షల మంది లబ్ధి పొందారు.
ఈ పథకం కింద ప్రతి కుటుంబం 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా పొందుతుంది. జమ్ము కాశ్మీర్‌లో కొత్తగా ఐదు వైద్యకళాశాలలు, 11 నర్సింగ్ కాలేజీలు, రెండు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్లు ఏర్పడ్డాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు 49 కొత్త డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటయ్యాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు.
పర్యాటక అభివృద్ధి
పెట్టుబడుల తో కశ్మీర్ ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలు లభించటం మొదలైంది. దీంతో కాశ్మీర్ లో ఆర్థిక అభివృద్ధి చోటుచేసుకుంది. గత నాలుగేళ్లలో పర్యాటకం బాగా ఊపందుకుంది. స్థానిక ప్రజల హస్తకళలు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచీ పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తున్నది. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. 2022 సంవత్సరా నికి జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పర్యాటక పరిశ్రమ కు రూ. 786 కోట్లు కేటాయించారు.
దీని మూలంగా సుమారు సంవత్సరానికి రూ.8,000 కోట్ల ఆదాయం తో రాష్ట్ర జీడీపీలో దాదాపు7%కి దోహదపడుతుంది. 2022లో జమ్ము కాశ్మీర్ జీడీపీ 22.5 మిలియన్ ఐఎన్ఆర్ లక్షలు. 2022లో సగటు వార్షిక రేటు 10.12% వృద్ధి చెందింది. 2022 జూన్ చివరి నాటికి సుమారు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల మందికి పైగా పర్యటకులు కాశ్మీర్ ను సందర్శించారు. నేడు కాశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాదం కాకుండా పర్యాటకం కనువిందు చేస్తోంది.
మహిళా సాధికారికత
గత మూడేళ్లుగా కశ్మీరీ మహిళలు, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవటమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మహిళలతో పాటుగా పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లో ఇప్పుడు వారు అంతర్జాతీయ వేదికలపై కూడా కశ్మీర్‌కు, భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జమ్ము- కాశ్మీర్‌లోని 55% గ్రామాల్లో స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. జమ్ము కాశ్మీర్ రూరల్ మిషన్ కు చెందిన హోమికి ఎంతో మంది మహిళల వర్తక వ్యాపారాలు, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నారు.
పెరిగిన శాంతి భద్రతలు
370 ఆర్టికల్ రద్దు తో జమ్మూ-కాశ్మీర్ సాధించిన అద్భుత ఫలితాలను నేడు చూడగలుగుతున్నాం. ఉగ్రవాదుల హింసాత్మక సంఘటనలు, పాక్ నుంచి చొరబాట్లు సంఖ్య కూడా బాగా తగ్గింది. ఈ ఏడాది హతమైన ఉగ్రవాదుల సంఖ్య 35 గా ఉంది. జమ్ము కాశ్మీర్ లో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయనేందుకు ఇదో నిదర్శనం. 34 ఏళ్ల తర్వాత ఇటీవలే మొహర్రం ఊరేగింపులు కూడా ప్రశాంతంగా జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు.