ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది! ఆఫీస్ నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటివరకు పడ్డ స్ట్రెస్ అంతా మాయమవుతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ.. ఈ జనరేషన్‌లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే బెటర్ అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు ‘ఖర్చు ఉండదు. బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అంటుంటే... మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నాం’ అంటున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ. ఇప్పుడు పిల్లలు ఉండడమంటే భరించలేని ఖర్చు! అందుకే ‘డ్యుయల్ ఇన్‌కం నో కిడ్స్’ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది కపుల్స్.
పూర్వం రోజుల్లో జంటలు ఐదారుగురు పిల్లల్ని కనేవాళ్లు. తర్వాత జనాభా బాగా పెరుగుతోందని ‘ఇద్దరు లేదా ముగ్గురికి’ పరిమితం అయ్యారు. ఆ తర్వాత ‘ఇద్దరే చాలు’ అన్నారు. కొన్నాళ్లకు ‘ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు’ అనే పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నేండ్ల నుంచి అయితే ‘వన్ ఆర్ నన్’ అంటున్నారు. అదికాస్తా ఇప్పుడు ‘ఓన్లీ నన్(పిల్లలే వద్దు)’ అయ్యింది. పలురకాల కారణాల వల్ల పిల్లలు వద్దు అనుకునేవాళ్లను ‘డింక్ కపుల్స్’ అని పిలుస్తారు. డింక్ అంటే ‘డ్యుయెల్ ఇన్‌కం నో కిడ్స్’ ఇద్దరూ సంపాదిస్తారు. కానీ.. పిల్లలు వద్దు అనేదే కాన్సెప్ట్.
రాజేష్ ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నా.. తన స్కిల్స్‌తో ఆరంకెల జీతం సంపాదిస్తున్నాడు. అదే కంపెనీలో తనతో పాటు శృతి కూడా పనిచేస్తోంది. ఇద్దరూ క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఒకరోజు రాజేష్ తన ప్రేమను... శృతికి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా రాజేష్ ప్రేమకి ఓకే చెప్పింది. కాకపోతే.. ‘‘పెళ్లయిన వెంటనే నాకు పిల్లల్ని కనడం ఇష్టంలేదు. టైం దొరికిన ప్రతిసారి లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి దేశవిదేశాలు తిరగాలని ఉంది” అని చెప్పింది. వాస్తవానికి ఆమె చెప్పినదానికి రాజేష్ కూడా కన్విన్స్ అయ్యాడు. అలా ఇద్దరూ పెళ్లి అనే బంధంతో కొత్త జీవితంలోకి ఎంటర్ అయ్యారు. ఆ తరువాత నుంచి ఇద్దరూ హ్యాపీగా ఉద్యోగానికి వెళ్తున్నారు. ఏడాదికి రెండు మూడుసార్లు ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
కుమార్ ఒక బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. రీసెంట్‌గా పెండ్లి అయ్యింది. అతని భార్య రమ ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది. పెండ్లి జరిగిన మొదటి రోజే తన భార్యను బయటికి తీసుకెళ్లి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే.. ‘‘మనకు వచ్చే జీతంతో మనం ఇద్దరమే కంఫర్ట్‌గా ఉండగలం. పిల్లలు పుడితే వాళ్లను పెంచడానికి, పోషించడానికి చాలా డబ్బు కావాలి. ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు వద్దనుకుంటే ఏ సమస్యా ఉండదు. రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల కోసం ఇప్పుడు సంపాదిస్తున్న దాంట్లో కొంత పొదుపు చేసుకుంటే సరిపోతుంది” అని చెప్పాడు. అది విన్న రమ మొదట షాకయ్యింది. కానీ ఆ తరువాత బాగా ఆలోచించి భర్త మాటకే ఓటేసింది.
1980ల నుంచే..
ఇక్కడ చెప్పుకున్న రెండు జంటల్లానే ఇప్పుడు చాలామంది కపుల్స్ డెసిషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద సిటీల్లో ఈ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ట్రెండ్ ఈ మధ్యే ఎక్కువగా కనిపిస్తున్నా.. విదేశాల్లో ఇది1980ల్లోనే మొదలైంది. అయితే గత ఐదారేండ్లుగా సోషల్ మీడియాలో ఇలాంటివాళ్లు వాళ్ల లైఫ్ స్టయిల్ గురించి పోస్ట్‌లు పెడుతుండడంతో డింక్కి బాగా పబ్లిసిటీ వచ్చింది. పైగా ఆ పోస్ట్‌లను చూసి ఇన్‌స్పైర్ అయ్యి చాలామంది డింక్‌లుగా మారుతున్నారు.
పద్దెనిమిదేండ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కొందరు మహిళలపై ఒక సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో19శాతం మంది ‘మేం డింక్‌లుగా ఉండాలి అనుకుంటున్నాం’ అని చెప్పారు. అంతేకాదు.. ఈ సర్వేలో ‘జనరేషన్ జెడ్’ డింక్ జీవితాన్ని గడిపేందుకు ఎక్కువ ఇష్టాన్ని చూపుతున్నట్టు తేలింది. జనరేషన్ జెడ్‌లో ఏకంగా 32 శాతం మంది ‘పిల్లలు వద్దు’ అనుకుంటున్నారు. మిలెన్నియల్స్లో 18 శాతం, జనరేషన్ ఎక్స్‌లో 19 శాతం, బూమర్‌లో11 శాతం మంది డింక్‌లుగా ఉన్నారు. అంటే జనరేషన్ మారే కొద్దీ డింక్ కాన్సెప్ట్‌ను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
డింక్ అంటే..
‘డ్యుయెల్ ఇన్‌కం నో కిడ్స్’ లేదా ‘డబుల్ ఇన్‌కం నో కిడ్స్’లను షార్ట్ ఫాంలో డింక్ అని పిలుస్తారు. ఈ ట్రెండ్1980ల నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇది “యప్పీ” (యంగ్ అర్బన్ ప్రొఫెషనల్ లేదా యంగ్ అప్‌వర్డ్‌లీ – మొబైల్ ప్రొఫెషనల్) అనే కల్చర్ నుంచి వచ్చింది. ఎల్.ఎం.హెచ్.సి. ఫైనాన్షియల్ థెరపిస్ట్ అజా ఎవాన్స్ ప్రకారం.. ‘‘రిలేషన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు పిల్లలు, ఆర్థిక బాధ్యతలు లేకుండా జీవించడమే డింక్ లైఫ్.’’ వీళ్లు ఖాళీ టైంని లైఫ్ పార్ట్‌నర్‌తో లేదా స్నేహితులు, కుటుంబంతో గడుపుతారు. నచ్చిన ప్లేస్‌లకి వెళ్తారు. నచ్చింది తింటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్లకు నచ్చినట్టు బతుకుతారు. వాళ్ల అభిరుచులు, ఆనందం కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. ఇలాంటి వాళ్లు మొన్నమొన్నటివరకు ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపించేవాళ్లు.
ఎందుకు ఇలా...?
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు కనొద్దు అనుకునేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలా ఎందుకు ఉంటున్నారని అడిగితే... అనేక కారణాలు చెప్తున్నారు. ‘ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో చూస్తే పిల్లల్ని పెంచడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల ఫైనాన్షియల్ ఫ్రీడం దొరకదు’ అంటున్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే.. ‘ఎక్కువ టైం లేకపోవడం వల్ల పిలలు వద్దు’ అంటున్నారు.
ఫైనాన్షియల్ ఫ్రీడం
ఒక సర్వే ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డింక్ కాన్సెప్ట్ ఫాలో అయ్యే వాళ్లలో చాలామంది. ఫైనాన్షియల్ ఫ్రీడం కోసమే పిల్లల్ని ఇష్టపడడం లేదని చెప్పారు. పిల్లలు ఉంటే వాళ్ల ఆరోగ్యం, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ కాలంలో ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయాలు పెరగడం లేదు. కాబట్టి పిల్లలు తలకు మించిన భారం అనుకుంటున్నారు. ‘పిల్లలు వద్దు’ అనుకుంటున్నవాళ్లలో దాదాపు 61 శాతం మంది మిలెన్నియల్స్ ఇదే కారణం చెప్పారు. వాళ్లు పిల్లల కంటే కెరీర్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.
అమెరికాలో బ్రూకింగ్స్ అనే సంస్థ చేసిన స్టడీ ప్రకారం.. 2015లో పుట్టిన ఒక బిడ్డను పదిహేడేండ్లు వచ్చేదాక పెంచేందుకు మూడు లక్షల డాలర్లకు పైగా ఖర్చు అవుతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు బిడ్డ కోసం అంత ఖర్చు చేయలేక పిల్లల్ని కనడం లేదు. ‘సంపాదించినదంతా పిల్లల కోసమే ఖర్చు చేస్తే.. మా పరిస్థితి ఏంటి’ అంటున్నారు.
మన దేశంలో పిల్లలకు సరైన వైద్యం చేయించలేక, చదువు చెప్పించలేక ఇబ్బందులు పడుతున్న చాలామంది తల్లిదండ్రులను చూస్తుంటాం. ఆ పరిస్థితులను చూస్తూ పెరిగినవాళ్లలో చాలామంది ‘మాకు ఆ పరిస్థితి ఎదురుకాకూడదు’ అనుకుంటున్నారు. పైగా చిన్నతనంలో వాళ్లు అనుభవించిన పేదరికం పిల్లలు అనుభవించకూడదు అనుకుంటున్నారు. అందుకే పిల్లల్ని కనకుండా వచ్చిన ఆదాయంలో కొంత దాచుకుని రిటైర్మెంట్ తర్వాత జీవితం గడిపాలి అని డిసైడ్ అవుతున్నారు.
టైం కావాలి
పిల్లల్ని కనడమంటే ఒక కొత్త బాధ్యతని భుజాన వేసుకున్నట్టే. ‘పిల్లల్ని కనగానే సరిపోదు.. ఆలనాపాలనా చూడాలి. క్రమశిక్షణగా పెంచాలి’ అంటుంటారు పెద్దవాళ్లు. పిల్లల పెంపకానికి చాలా టైం కేటాయించాలి. స్కూల్‌కి తయారుచేసి పంపడం నుంచి వాళ్లు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా చదువుతున్నారు?.. ఇలా అన్నీ చూసుకోవాలి. స్కూల్ నుంచి ఇంటికిరాగానే హోం వర్క్ చేయించడం, మరుసటి రోజు టిఫిన్ బాక్స్ కట్టి స్కూల్‌కు పంపేవరకు ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ భార్యాభర్తలు పంచుకోవాలి. అందుకు ఇద్దరికీ చాలా టైం కావాలి. చాలామంది ఇందుకు రెడీగా లేరు.
కొందరికి డబ్బు సమస్య అయితే.. మరికొందరికి డబ్బు ఉన్నా టైం లేక పిల్లల్ని కనడం లేదు. కొన్ని సెక్టార్లలో పనిచేసేవాళ్లకు ఎక్కువ జీతంతో పాటు ఎక్కువ పనిగంటలు, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అలాంటి వాళ్లు పిల్లల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. అందుకని వాళ్లు పిల్లల్ని కనేందుకు ఇష్టపడడంలేదు. పిల్లలుంటే వాళ్ల అవసరాలను తీర్చడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడానికే టైం సరిపోతుంది. అదే డింక్ కాన్సెప్ట్ ఫాలో అయితే.. ఆ టైంని టూర్స్ కు వెళ్లేందుకు, రెస్ట్ తీసుకునేందుకు వాడుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు తక్కువగా ఉంటే వ్యక్తిగతంగా క్వాలిటీ టైం ఎక్కువగా దొరుకుతుంది అంటారు డింక్స్లు. ‘మాకు పిల్లలు లేకపోవడం వల్లే ఒకరికోసం ఒకరం టైం ఇచ్చుకోగలుగుతున్నాం’ అంటున్నారు ఈ కాన్సెప్ట్ ఫాలో అయ్యేవాళ్లు.
ఎక్కడికీ కదల్లేరు
పేరెంట్స్ అయిన తరువాత టూర్లకు వెళ్లడం కాదు కదా.. ప్రి–ప్లానింగ్ లేకుండా ఇల్లు కూడా మారలేరు. ఏ పని చేయాలన్నా దాని వెనక పెద్ద ప్లానింగ్ ఉండాలి. పిల్లలు లేనివాళ్లు ఇల్లు మారాలంటే క్యాలిక్యులేషన్స్ అంతగా అవసరం ఉండవు. కానీ.. పిల్లలు ఉంటే ఇంటికి దగ్గర్లో స్కూల్, పార్క్ లాంటివి ఉండాలి. హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి. ఎక్కువగా వాహనాల రద్దీ ఉండకూడదు... ఇలా రకరకాల సౌకర్యాలు చూసుకోవాలి. అన్నీ కుదిరినా అనుకోగానే మారలేరు. ఎందుకంటే.. అప్పటికి పిల్లలు స్కూల్ అకడమిక్ ఇయర్ మధ్యలో ఉండొచ్చు. లేదంటే.. ఏదైనా కోర్సు చేస్తుండొచ్చు. డింక్‌లకు ఇలాంటి బాధలేమీ లేవు. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోవచ్చు. అదే పేరెంట్స్ అయితే టూర్లకు వెళ్లాలంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. ఖర్చు పెరిగిపోతుంది. వెళ్లే ప్లేస్‌లో వాతావరణం పిల్లలకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు కాకుండా పిల్లలకు ఎగ్జామ్స్ లేనప్పుడు, సెలవులు ఉన్నప్పుడే వెళ్లాల్సి ఉంటుంది. అదే డింక్‌లయితే.. ఆఫీస్‌లో సెలవు దొరికితే చాలు జామ్ అంటూ ట్రిప్ వేసేయొచ్చు.
కెరీర్ బాగుండాలంటే...
ఇవ్వాళరేపు దాదాపు అందరికీ కెరీర్ డెవలప్‌మెంట్‌అనేది చాలా ముఖ్యం. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే... స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటేనే బెటర్ కెరీర్ ఉంటుంది. కానీ.. పిల్లలుంటే అంత టైం ఉండదు. అదే పిల్లలు వద్దు అనుకున్న వాళ్లకైతే కెరీర్ మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ టైం ఉండడం వల్ల కెరీర్‌లో పెట్టుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించొచ్చు. వృత్తిపరమైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. అందుకే పిల్లలు లేకపోతే.. కెరీర్‌లో ఈజీగా సక్సెస్ కావొచ్చు అంటారు డింక్స్.
కుక్కల్ని పెంచుతూ..
పిల్లలు లేకపోవడాన్ని బాధాకరంగా ఎందుకు చూడాలి? నిజానికి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలి. పిల్లలు ఉండడం వల్ల వచ్చే ఆనందం కోసం వాళ్లు మరో మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకే వీళ్లలో ఎక్కువమంది పిల్లులు, కుక్కలను పెంచుకుంటారు. వాటినే పిల్లల్లా చూసుకుంటారు.
కలిసి ఉండలేకపోతే..
ఈ మధ్య కాలంలో కలిసి ఉండలేక విడిపోతున్న భార్యాభర్తల్ని ఎక్కువగా చూస్తున్నాం. అలాంటివాళ్ల పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పటికీ చాలామంది పిల్లల కోసమే లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి ఉంటున్నారు. పిల్లలు లేకుంటే ఎప్పుడో విడిపోయేవాళ్లం అనేవాళ్లు మీకూ ఎదురయ్యే ఉంటారు. డింక్‌లు పిల్లలు వద్దు అనుకోవడానికి ఇది కూడా ఒక కారణం. అనుకోని పరిస్థితుల్లో విడిపోయినా.. హాయిగా బతకొచ్చు. ఇంకొందరైతే.. కలిసి ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల్లా కాకుండా రూమ్‌మేట్స్‌లా ఉంటారు. అంటే.. ఎవరి సంపాదన వాళ్లదే. ఎవరి సేవింగ్స్ వాళ్లవే. ఇంటి ఖర్చులు ఇద్దరూ షేర్ చేసుకుంటారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే విడిపోతారు. అప్పటివరకు చేసుకున్న సేవింగ్స్‌తో ఇబ్బందిలేకుండా బతుకుతారు. ఇలాంటి కల్చర్ ఇంకా మన దగ్గర అంతగా కనిపించనప్పటికీ విదేశాల్లో బాగానే ఉంది.
ఒత్తిడి తగ్గుతుంది
పిల్లలు లేకుంటే.. ఒత్తిడి చాలావరకు తగ్గుతుందనేది డింక్‌లు చెప్తున్న మాట. పిల్లల్ని బాధ్యతగా పెంచాలంటే.. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తప్పవు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అదే.. పిల్లలు లేకుంటే చాలా రిలాక్స్‌డ్ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. పిల్లలు లేనప్పుడు అదనంగా పనిచేయాల్సిన అవసరమే లేదు. కావాల్సినంత సంపాదించుకోవచ్చు. ఇబ్బందిపడకుండా బతకొచ్చు.
పర్యావరణానికి మేలు
పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణం మనిషి. ముఖ్యంగా మన దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో ఇది ఒకటి. జనాభా పెరుగుదల వల్ల వాహనాల వినియోగంతో పాటు పారిశ్రామికీకరణ పెరుగుతాయి. దానివల్ల పర్యావరణం దెబ్బతింటోంది. గాలి, నీళ్లు, మట్టి.. అన్నీ కలుషితం అవుతాయి. అందుకే కొందరు ప్రకృతి మీద ప్రేమతో పిల్లల్ని కనడం లేదు. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2021లో చేసిన ఒక సర్వేలో18–49 మధ్య వయసు ఉన్న డింక్‌ల్లో 44 శాతం మంది పెరుగుతున్న జనాభా వాతావరణ సమస్యగా భావించి పిల్లల్ని కనలేదని చెప్పారు.
బంధాన్ని కాపాడుకునేందుకు
చాలా జంటలు వాళ్ల మధ్య సాన్నిహిత్యం, స్నేహాన్ని కాపాడుకోవడానికి పిల్లల్ని కనడం లేదంటున్నారు. తల్లిదండ్రులుగా అదనపు బాధ్యతలు లేకపోవడం వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని బంధాలను బలోపేతం చేసుకుంటున్నాం అంటున్నారు. సంప్రదాయ కుటుంబ నిర్మాణంలో పిల్లల వల్లే బంధాలు బలంగా ఉంటాయని చెప్తుంటారు. కానీ.. ఈ డింక్స్ మాత్రం పిల్లలు లేకుంటేనే బంధం బలంగా ఉంటుందని నమ్ముతున్నారు.
స్వేచ్ఛ కావాలన్నా
అలాగే స్వేచ్ఛగా బతకాలంటే పిల్లలు ఉండకూడదు అనేది కూడా డింక్ కాన్సెప్ట్ ఫాలో అవడానికి ఒక కారణం. హారిస్ ఇంటరాక్టివ్ అండ్ ఆర్చ్‌బ్రిడ్జ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. దాదాపు18 శాతం మంది యువకులు వ్యక్తిగత స్వేచ్ఛ కోసమే పిల్లల్ని కనలేదని చెప్పారు. పేరెంట్‌హుడ్‌లో స్వేచ్ఛ ఉండదని బలంగా చెప్తున్నారు వాళ్లు.
ఆడవాళ్లకు ఇబ్బంది
సరిత బాగా తెలివైనది. చిన్నప్పటినుంచి తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకునేది. అందుకే కష్టపడి చదివి బీటెక్‌లో యూనిర్సిటీ టాపర్‌గా నిలిచింది. ఆ తరువాత ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే పెండ్లి కుదిరింది. ఏడాది తిరిగేలోపే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. బిడ్డ బాగోగులు చూసుకోవడానికి ఇంటికే పరిమితమైపోయింది. పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టాక ఉద్యోగం చేద్దామంటే ఆమె స్కిల్స్‌కి తగ్గ ఉద్యోగం దొరకలేదు. పైగా పిల్లల్ని పెంచే అదనపు బాధ్యత వల్ల ఆమెకు స్కిల్స్ పెంచుకునే టైం లేకుండా పోయింది. ఇది సరిత కథ మాత్రమే కాదు.. మన దేశంలో చాలామంది అమ్మాయిల పరిస్థితి ఇదే. అందుకే ఇప్పటి జనరేషన్ పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు.
ఆరోగ్యం ముఖ్యమే...
తల్లి కావడమంటే.. చిన్న విషయమేం కాదు. నవ మాసాలు మోసి, ఆరోగ్య పరంగా ఎన్నో ఇబ్బందులను అధిగమించి పిల్లల్ని కనాలి. ప్రసవ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న తల్లులు ఎందరో. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. వాటన్నింటికీ భయపడి లేదా వాటిని భరించే ఇష్టం లేక కొందరు పిల్లల్ని వద్దు అనుకుంటున్నారు.
నష్టాలేంటి? ఎక్కువ ఖర్చు
పిల్లలు లేకపోతే.. చాలామందిలో పొదుపు చేయాలనే ఆలోచన ఉండదు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. లగ్జరీగా బతకడానికి సంపాదించిందంతా ఖర్చు చేసేస్తే.. అవసరానికి డబ్బు ఉండదు. యవ్వనంగా ఉన్నప్పుడు ఖర్చు చేయడంలో క్రమశిక్షణ లేకుంటే వయసొచ్చాక బాధపడాల్సి ఉంటుంది.
వయసొచ్చాక సమస్య
యంగ్‌గా ఉన్నప్పుడు ఎవరి అవసరమూ ఉండదు. కానీ.. ఒక వయసొచ్చాక నా అనుకునేవాళ్లు లేకపోతే.. కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తోడుండేది పిల్లలే. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. ఇప్పటికీ చాలామంది ఇంట్లో ఉండే పెద్దవాళ్ల కోసం శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ల సంరక్షణ కోసం రోజుకు కనీసం రెండున్నర గంటల కంటే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. కాబట్టి డింక్‌లు పిల్లలకు చిన్నప్పుడు అందించిన సంరక్షణకు గాను తిరిగి కృతజ్ఞత చూపించే పిల్లల వల్ల వచ్చే సంతృప్తిని అనుభవించలేరు.
భాగస్వామిని కోల్పోతే..
భార్యాభర్తలు అయినంత మాత్రాన ఇద్దరూ ఒకేసారి చనిపోరు కదా! కాబట్టి వాళ్లలో ఒకరు చనిపోతే.. మిగిలినవాళ్లు ఆ వయసులో తోడులేక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చేతిలో డబ్బు ఉండడం వల్ల అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. కానీ.. తోడునిచ్చే నీడని మాత్ర కొనుక్కోలేం. కాబట్టి పిల్లలు ఉండడమే బెటర్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
బాండింగ్ ఉండదు
లైఫ్ పార్ట్‌నర్‌తో ఏదైనా గొడవైనా, ఇంకేదైనా సమస్య వచ్చినా విడిపోతుంటారు. కానీ.. పిల్లలు ఉంటే డైవర్స్ తీసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. విడాకులు తీసుకుంటే పిల్లలు తండ్రి లేదా తల్లి ప్రేమకు దూరమవుతారు. అందుకే భార్యాభర్తల్ని కలసి ఉండేలా చేసేది పిల్లలే అంటారు పెద్దలు.
అమెరికాలో...
ఈ డింక్ కాన్సెప్ట్ వల్ల అమెరికాలో పిల్లలు లేని కుటుంబాల సంఖ్య ఏ యేటికాయేడు పెరుగుతోంది. కొన్ని స్టడీల ప్రకారం.. అమెరికాలో 2022నాటికి 43 శాతం కుటుంబాల్లో పిల్లలే లేరు. దశాబ్దం క్రితం ఇది 36 శాతంగా ఉండేది. అంటే పదేండ్లలోనే 7 శాతం మంది డింక్‌లుగా మారిపోయారు. అంతేకాదు.. మరి కొన్నేండ్లలో డింక్‌లు 50 శాతానికి చేరుకుంటారని అంచనాలు ఉన్నాయి. అమెరికాలోనే కాదు.. అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించిన తర్వాత ఒక దశలో సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుందని చెప్తున్నారు వాళ్లు. సాధారణంగా ప్రతి స్త్రీ సగటు జనన రేటు 2.1 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే జనాభా వృద్ధి రేటు తగ్గదు. కానీ.. అంతకంటే తగ్గితే సమస్యలు తప్పవని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు చాలా దేశాల్లో 2.1 కంటే తక్కువ జనన రేటు ఉంది.
జనాభా తగ్గుతోంది
1970లు, 80ల్లో ‘హమ్–దో, హమారే–దో’ అనే ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం బాగా వినిపించింది. ఎక్కువ పేదరికం ఉన్న ఆ రోజుల్లో ప్రతి మహిళకు నాలుగైదు మంది పిల్లలు ఉండేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో అధిక సంతానోత్పత్తి రేటును తగ్గించడానికి ప్రభుత్వం ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ తెచ్చింది. మన దేశంలోనే కాదు... చాలా దేశాల్లో జనాభాను తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ.. ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేయకుండానే జనాభా తగ్గుతోంది. ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నాయి. ప్రపంచ జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరగడం ఆగిపోతుందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డాటా విశ్లేషణ ఆధారంగా ప్యూ రీసెర్చ్ సెంటర్ చెప్పింది. 2050 –2100 మధ్య 90 దేశాల్లో తగ్గిపోతున్న జనాభాను చూడొచ్చనేది ఒక అంచనా. వాటిలో ఎక్కువ దేశాలు యూరప్, లాటిన్ అమెరికాలోనే ఉన్నాయి. పిల్లలు వద్దనుకునే డింక్‌లు కూడా ఈ దేశాల్లోనే ఎక్కువ. ఆఫ్రికాలో మాత్రమే కావాల్సినంత జనాభా పెరుగుదల ఉండనుంది.
దక్షిణ కొరియా ఒక ఉదాహరణ
చాలామంది పిల్లలు వద్దు అనుకోవడం వల్ల దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు క్షీణించడం మొదలైంది. అందుకే అక్కడి నాయకులు, సామాజికవేత్తలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 2023లో ఆ దేశ రిప్రొడక్టివ్ లెవల్స్ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశంలోని 51 మిలియన్ల జనాభా సగానికి తగ్గిపోతుందనే భయాలు ఉన్నాయి. ఆ భయాల వల్లే ప్రభుత్వం పిల్లల సంరక్షణ కార్యక్రమాల కోసం 270 బిలియన్ల అమెరికన్ డాలర్లు కేటాయించింది. బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులకు 1,510 డాలర్లు ఇస్తున్నారు. 2022లో 0.72గా ఉన్న దక్షిణ కొరియా జనన రేటు మరింత పడిపోతుందని అంచనా. ఆ దేశ వర్క్‌హాలిక్ కల్చర్, వృత్తిపరంగా ఎదగడానికి ఎక్కువగా పనిచేయడం కూడా అక్కడివాళ్లు డింక్‌లుగా మారడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఆ దేశ ఆడవాళ్లకు పిల్లల్ని కని, పెంచడానికి సరిపడా టైం లేదు.
మన దగ్గర
మన దేశంలో కూడా యువ జంటల్లో డింక్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. దాంతో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తోందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. ఇది వృద్ధ జనాభాకు దారి తీస్తుంది. ఇప్పుడు చైనా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరగడంతో శ్రామిక శక్తి తగ్గుతుంది. దాంతో ప్రొడక్టివిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన దగ్గర1950లో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉంది. ఇది1980లో 4.60కి, 2021లో 1.91కి తగ్గింది. అయితే.. ఇలా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు మెరుగైన శిశుసంరక్షణ లేకపోవడంతో పిల్లలు చనిపోతారనే భయంతో ఎక్కువమందిని కనేవాళ్లు. కానీ.. ఇప్పుడు శిశు మరణాలు తగ్గడంతో ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. కానీ.. కొంతమంది మాత్రం పిల్లల్ని పోషించేందుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లల్ని కనడంలేదు. అలాంటివాళ్లంతా డింక్‌లుగా మారిపోతున్నారు. ముఖ్యంగా మన దగ్గర నగరాల్లోనే ఇలాంటివాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.
యాంటీనేటలిజం
చాలామంది డింక్‌లుగా మారడానికి యాంటీనేటలిజం కూడా ఒక కారణమే. పిల్లలు కనకపోవడమే యాంటీనేటలిజం. పిల్లలు కనడం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ.. చాలామంది యాంటీనేటలిస్ట్‌లు ఈ మధ్య యువతకు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. పిల్లలు కనడం వల్ల పర్యావరణానికి, మనుషులకు కలిగే నష్టాల గురించి చెప్తుంటారు. ఒకవేళ పిల్లలు కావాలనే ఇంట్రెస్ట్ ఉంటే.. అనాథలను దత్తత తీసుకుని, వాళ్లను పెంచమని ప్రోత్సహిస్తుంటారు. వీళ్ల వల్ల కూడా డింక్‌లు పెరుగుతున్నారు.
ఎన్ని రకాలు
ఆదాయం ఉండి పిల్లలు వద్దు అనుకునేవాళ్లను సాధారణంగా డింక్‌లు అని పిలుస్తుంటారు. అయితే.. పిల్లల్ని కనకపోవడానికి గల కారణం, వాళ్ల లైఫ్ స్టైల్ బట్టి వాళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు.
డింక్‌వాడ్: భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తారు. కానీ పిల్లలు కనడానికి ఇష్టపడరు. వీళ్లు కాలక్షేపం కోసం కుక్కల్ని పెంచుకుంటారు.
డింకర్: డబుల్ ఇన్‌కం నో కిడ్స్ లైఫ్ లీడ్ చేస్తూ.. ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటారు.
సింక్ : సింగిల్ ఇన్‌కం, నో కిడ్.
డింక్వాక్: డబుల్ ఇన్‌కం, నో కిడ్స్. వీళ్లు పిల్లుల్ని పెంచుకుంటారు.
డినో: డబుల్ ఇన్‌కం నో ఆప్షన్స్ (లిమిటెడ్ లేదా ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉంటాయి.)
డింకీ: డబుల్ ఇన్‌కం, నో కిడ్స్ ఎట్ (టెంపరరీగా పిల్లలు వద్దనుకుంటారు.)
డింప్: డ్యూయల్ ఇన్‌కం, మనీ ప్రాబ్లమ్స్.
జింక్: గ్రీన్ ఇన్క్లైన్డ్, నో కిడ్స్.
సిన్బ్యాడ్: సింగిల్ ఇన్‌కం, నో బాయ్‌ఫ్రెండ్, పూర్తి నిరాశ.
వీళ్లు కూడా..
పిల్లలు పుట్టని జంటలు : కొంతమందికి కావాలనుకున్నా పిల్లలు పుట్టరు. అందుకు కారణాలు అనేకం. వీళ్లలో స్వలింగ సంపర్కులు, పిల్లలను కనలేని వాళ్లు అంటే దత్తత, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) లాంటి ప్రత్యామ్నాయాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా ఖర్చు భరించలేక వద్దనుకునేవాళ్లు ఉన్నారు.
కొత్త జంటలు : చాలామంది పెండ్లి జరిగిన కొన్నేండ్ల వరకు పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు ఈ మధ్య. ఇద్దరూ పనిచేస్తున్నా భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బు దాచుకున్నాకే పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు. వాళ్లను కూడా పిల్లల్ని కనేవరకు డింక్‌లుగానే పరిగణిస్తారు. అలాంటివాళ్లు ఈ దశలో ఇల్లు, కారు కొనడం లాంటివి చేస్తుంటారు. లేదంటే.. పెండ్లి కోసం చేసిన అప్పులు తీరుస్తుంటారు. కాబట్టి పిల్లల్ని పెంచేందుకు సిద్ధంగా ఉండరు.
కరుణాకర్ మానెగాళ్ల