హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి రిజల్ట్ వచ్చే దాకా అందరికి బాగా వినిపించిన పేరు వికాస్ రాజ్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయిన వికాస్ రాజ్ వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. మునుగోడు బైపోల్ లో టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసేలా ఆయన వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు ధ్వజమెత్తారు. బైపోల్ కు సంబంధించి ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.
రోడ్డు రోలర్ గుర్తు తొలగింపుపై ఈసీ సీరియస్
మునుగోడు బైపోల్ లో యుగతులసి పార్టీ తరఫున శివకుమార్ పోటీ చేశారు. మొదట్లో ఆయనకు ఈసీ రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. అయితే రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపుపై టీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డు రోలర్ తమ పార్టీ గుర్తు కారును పోలి ఉందని, ఆ గుర్తుతో తమకు నష్టం కలుగుతుందని ఈసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే రోడ్డు రోలర్ గుర్తును తొలగించాలని సీఈవో వికాస్ రాజ్ ను కోరారు. ఈ క్రమంలోనే వికాస్ రాజ్ రోడ్డు రోలర్ గుర్తును తొలగించి బేబీ వాకర్ గుర్తున కేటాయించారు. తన గుర్తు మార్పుపై శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో వికాస్ రాజ్ తీరుపై మండిపడింది. శివకుమార్ కు వెంటేనే రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఆర్వో జగన్నాథరావును బాధ్యుడిని చేస్తూ ఆర్వో విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ను నియమించారు.
ఎన్నికల కోడ్ ను అమలు చేయడంలేదంటూ సీఈవోపై విమర్శలు
డూప్లికేట్ ఓటర్లు, గుర్తుల కేటాయింపు, ఎన్నికల కోడ్ అమలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో సీఈవో వికాస్ రాజ్ వ్యవహార శైలి బాగాలేదని ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం వికాస్ రాజ్ ను తన పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర పరిధిలో సీఈవో దగ్గర పరిష్కారానికి నోచుకోవాల్సిన ఫిర్యాదులు, అప్పటికప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎన్నికల రూల్స్ పాటించేలా చూడాలంటూ వస్తున్న వినతులు తమ వరకు రావడం ఏంటని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మునుగోడులో యధేశ్చగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తుంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని సీఈవోని ప్రశ్నించింది. అందరి ఫిర్యాదులు, వినతులు పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ సూచించింది.
వెబ్ సైట్ లో ఫలితాలను అప్టేడ్ చేయడంలో నిర్లక్ష్య వైఖరి
మునుగోడు బైపోల్ కౌంటింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. మొత్తం 15 రౌండ్లలో ఫలితాలను వెల్లడించారు. ఈసీ నిబంధనల ప్రకారం రౌండ్ పూర్తి కాగానే ఫలితాలను ఈసీ అధికారికి వెబ్ సైట్ లో పొందుపరచాలి. కానీ మొదటి నాలుగు రౌండ్లు పూర్తయిన కూడా ఫలితాల వివరాలను వెబ్ సైట్ లో పొందు పరచలేదు. దీంతో సీఈవోపై వికాస్ రాజ్ బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. టీఆర్ఎస్ ను గెలిపించడానికే వికాస్ రాజ్ ఫలితాలను సైట్ లో పెట్టలేదని బండి సంజయ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఈవోకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే ఫలితాల వివరాలను సైట్ లో పెట్టారు.