సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏడేళ్ల కింద ప్రారంభమైన పలు అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ట్యాంక్ బండ్, పార్కుల ఏర్పాటుతో పాటు రోడ్ల విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులను హడావుడిగా మొదలు పెట్టి అసంపూర్తిగా వదిలేశారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండడంతో పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా గడువులోపు పనులు పూర్తి కావడం కష్టమేనని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.
2016లోనే శంకుస్థాపన
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు, పుల్లారెడ్డి చెరువుల వద్ద ట్యాంక్ బండ్ నిర్మాణం, ఎరీనా పార్క్, బోటింగ్ కోసం రూ. 60 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులకు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి కలిసి 2016లో శంకుస్థాపన చేశారు. సద్దల చెరువు వద్ద ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తి కాగా, పార్క్ నిర్మాణాన్ని మాత్రం అటకెక్కించారు. బోటింగ్ కోసం మూడు నెలల కింద ట్రయల్స్ నిర్వహించినా ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. గ్రీనరీ కోసం ఇటీవల చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక పుల్లారెడ్డి చెరువు పనులను 6 నెలల కిందే ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
నాలుగేళ్లుగా సాగుతున్న యూజీడీ
సూర్యాపేట పట్టణంలో రూ.81.46 కోట్లతో 2018లో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ముందుకు సాగడం లేదు. పట్టణంలో నాలా, అండర్ గ్రౌండ్ పైప్‌లైన్, ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు నిర్మించాల్సి ఉంది. రెండేళ్లలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పిన కాంట్రాక్ట్ సంస్థ నాలుగేండ్లు దాటినా ఇప్పటికీ 80 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. పైగా పనుల కోసం రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇప్పట్లో పూర్తి కావడం కష్టమేనని సమాచారం.
ఆగుతూ.. సాగుతున్న రోడ్డు విస్తరణ
సూర్యాపేటలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని 2014లో హామీ ఇచ్చి 2018లో పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ. 31 కోట్లతో జమ్మిగడ్డ నుంచి ఎస్‌వీ ఇంజినీరింగ్ కాలేజీ వరకు పనులు ప్రారంభించారు. అయితే తమకు పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ నుంచి ఎస్వీ కాలేజీ వరకు ఇటీవల పనులు ప్రారంభించారు. అయితే రాఘవ ప్లాజా నుంచి ఖమ్మం రోడ్డు వరకు చేపట్టిన పనులు క్వాలిటీగా లేకపోవడంతో వేసిన ఆరునెలలకే గుంతలమయంగా మారాయి. ఎంజీ రోడ్డు నుంచి బస్టాండ్ వరకు రోడ్డు పనులను నెల రోజుల క్రితం ప్రారంభించారు.
ప్రభుత్వ ఆఫీసులదీ అదే పరిస్థితి
సూర్యాపేటలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభించగా ఇందులో మెడికల్ కాలేజీ నిర్మాణం ఒక్కటే పూర్తయింది. ఎస్పీ ఆఫీస్ 90 శాతం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ 80 శాతం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కలెక్టరేట్ పనులు పూర్తయ్యేందుకు మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. నిధుల కొరతతో ఎస్పీ ఆఫీస్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోగా, ఇటీవల బిల్లులు విడుదల చేయడంతో పనులను మళ్లీ స్టార్ట్ అయ్యాయి. ఇక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తయ్యేందుకు మరో రెండు నెలలకుపైగా సమయం పట్టేలా ఉంది.