ఎంజీఎంలో సాలరీస్​ ప్రైవేట్‍ హాస్పిటల్స్​లో ప్రాక్టీస్

  • టైమింగ్​ పాటించే వాళ్లు 10 శాతమే 
  • పలువురు డాక్టర్లకు సొంత హాస్పిటల్స్, క్లినిక్‍లు

ఎంజీఎం హాస్పిటల్​లో వారం కింద శ్రీనివాస్‍ అనే పేషెంట్‍ను ఎలుకలు కొరకడంతో పెద్ద ఎత్తున రక్తం పోయింది. అలర్ట్​గా ఉండాల్సిన ఆర్‍ఐసీయూలోనే ఘటన జరగడంతో సీరియస్‍గా తీసుకున్న ఉన్నతాధికారులు అడిషనల్‍ కలెక్టర్‍  విచారణ అనంతరం ఇద్దరు డాక్టర్లను సస్పెండ్‍ చేశారు. సూపరింటెండెంట్‍ను బాధ్యతల నుంచి తప్పించారు. 

వరంగల్, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్‍లో పలువురు డాక్టర్లు, స్టాఫ్‍ నర్సులు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు డ్యూటీకి రావాల్సిన టైం దాటాక 2 నుంచి 3 గంటల తరువాత హాస్పిటల్‍ కు వస్తున్నారని అంటున్నారు. లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న పలువురు డాక్టర్లు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‍ హాస్పిటల్స్​లో ప్రాక్టీస్‍ చేస్తున్నారనే విమర్శలున్నాయి. చాలామంది సీనియర్‍ డాక్టర్లు కుటుంబ సభ్యుల పేరుతో హాస్పిటల్స్, క్లినిక్‍లు నడుపుతున్నారు. దీంతో సర్కార్‍ దవాఖానాకు వచ్చే వేలాది మంది పేద రోగులు సరైన ట్రీట్‍మెంట్‍  కోసం ఇబ్బందులు పడుతున్నారు. 

క్యూ కడుతున్న పేషెంట్లు
సిటీ పరిధిలోని దాదాపు అన్ని ప్రైవేట్‍ హస్పిటళ్లలో ట్రీట్మెంట్‍ అండ్‍ మెడికల్‍ దందా నడుస్తోందనే విమర్శలున్నాయి. జ్వరం కోసం వెళితే  టెస్ట్​లు, స్కానింగ్‍ల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో డైలీ వేలాది మంది పేద, సామాన్య జనాలు ఎంజీఎం ఆసుపత్రిని నమ్ముకొని తెల్లవారుజామునే ఓపీ సెంటర్‍ వద్ద క్యూ కడుతున్నారు. ఈ నెల 5న డెంటల్​ సమస్య కోసం 54 మంది, డీవీఎల్‍ 226 మంది, ఎమర్జెన్సీ 477, ఈఎన్‍టీ 165, జనరల్‍ మెడిసిన్‍ 541, జనరల్‍ సర్జరీ 233, జిరియాట్రిక్స్​ 110, న్యూరాలజీ 295, న్యూరో సర్జరీ 158, ఆర్థో 351, పీడీయాట్రిక్స్​ 103, పీడీయాట్రిక్‍ సర్జరీ 121, యూరాలజీ 149 మందితో పాటు ఇతర చికిత్సల కోసం 3,110 మంది ఎంజీఎం హస్పిటల్‍ను నమ్ముకుని వచ్చారు. ఇందులో 50 నుంచి 60 ఏండ్లు దాటినోళ్లే సగం మంది ఉన్నారు.

9 గంటలకు డ్యూటీ ఎక్కాలే
ఎంజీఎంలో వివిధ డిపార్ట్​మెంట్లకు 30 హెచ్‍వోడీలు, 200 మంది డాక్టర్లు, 200 హౌస్‍ సర్జన్లు, 400 జూనియర్‍ డాక్టర్లు (పీజీలు) ఉన్నారు. వీరేగాక హెడ్‍ నర్సులు 60 మంది వరకు ఉండగా, స్టాఫ్‍ నర్సులు 450 మంది ఉన్నారు. హెచ్‍వోడీలు, డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పకుండా క్లినికల్‍ డ్యూటీలు చేయాల్సి ఉంది. అడ్మినిస్ట్రేషన్‍ విభాగంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలి. కానీ ఇందులో 90 శాతం మంది తమకు నచ్చిన సమయాల్లో డ్యూటీలకు అటెండ్‍ అవుతున్నారు. ఇంకొందరైతే కాసేపు కనపడి డ్యూటీ సమయాల్లో బయట ప్రైవేట్‍ ప్రాక్టీస్‍ చేస్తున్నారు. ఆపరేషన్లు నిర్వహించే టైంలో మత్తు ఇంజక్షన్‍ ఇవ్వాల్సిన ఓ డాక్టర్‍ కమ్‍ డిపార్ట్​మెంట్‍ హెచ్‍వోడీకి నయీంనగర్‍లో మూడంతస్తుల హాస్పిటల్‍ ఉంది. ఇద్దరు ఎముకల డాక్టర్లు వరంగల్‍ ఎంజీ రోడ్‍లోని హాస్పిటల్‍, మరోచోట సేవల్లో ఉన్నారు. ఇక ఓ జనరల్‍ సర్జన్‍  ఓ నర్సింగ్‍ కాలేజీలో, పాథాలజిస్ట్​ హన్మకొండ బస్టాండ్‍ దగ్గర్లోని డయాగ్నోస్టిక్‍ సెంటర్​లో, ఓ ఫ్యామిలీ మెడిసిన్‍ డాక్టర్​ విజయ టాకీస్‍ దగ్గర్లోని డయాగ్నోస్టిక్‍ సెంటర్​లో, రేడియాలజిస్ట్​ ఇంకోచోట ప్రాక్టీస్‍ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఎంజీఎం బాగోగులు చూడాల్సిన ఇద్దరు అధికారులు సైతం సొంత ప్రాక్టీస్‍లో బిజీగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‍ ప్రాక్టీస్‍ చేయడంపై నిషేధం కొనసాగుతోంది. జీవో 119 (13.04.2006) ప్రకారం గవర్నమెంట్‍ డాక్టర్లతో పాటు హాస్పిటల్‍ అడ్మినిస్ట్రేషన్‍లో పని చేసే డాక్టర్లు ప్రైవేట్‍ ప్రాక్టీస్‍ చేయడానికి వీలులేదు. విధులకు డాక్టర్లు డుమ్మా కొడుతూ ప్రైవేట్​ ప్రాక్టీస్​ చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు.