- హరితహారం నిర్వహిస్తుండగా ఘటన
- ఈవో ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన సిబ్బంది
- అక్కడి పోలీసులు, అధికారులు
భద్రాచలం, వెలుగు : విలీన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన గోశాలపై భూ ఆక్రమణదారులు ఆదివారం దాడి చేశారు. ఈ ఘటనలో ఆలయానికి చెందిన పలువురు ఉద్యోగులు, అర్చకులు గాయపడ్డారు. గోశాలలో ఆదివారం దేవస్థానం ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది కలిసి హరితహారం నిర్వహిస్తున్నారు. గోశాలను శుభ్రం చేసి మొక్కలు నాటుతున్నారు.
మధ్యాహ్నం ఆక్రమణదారులు గోశాలలోకి ప్రవేశించి ఉద్యోగులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో దాడి చేయగా దేవస్థానం ఈఈ రవీందర్‌రాజు చొక్కా చినిగింది. సూపరింటెండెంట్ కె.నిరంజన్‌కుమార్‌ను కిందపడేయడంతో కాలికి గాయమైంది. మరో సూపరింటెండెంట్సాయిబాబు కండ్లద్దాలు విరిగిపోయాయి. అర్చకుడు మదనగోపాలాచార్యుల మెడలోని తులసిమాల తెగిపోవడంతో పాటు ఆయన మెడకు కూడా స్వల్ప గాయమైంది. గోశాల ప్రాంగణంలో ఈ మధ్య ఆక్రమణదారులు జామాయిల్ మొక్కలను నాటడంతో తమ ప్రాంగణంలో మీరెలా మొక్కలు నాటుతారని ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సుమారు 900 ఎకరాల భూమి ఉందని, అన్నింటికీ పాస్ బుక్‌లు ఉన్నాయని ఈవో తెలిపారు.
దాడి విషయం ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియడంతో తహసీల్దార్వచ్చారు. ఆయన కూడా ఆక్రమణదారులకే వత్తాసు పలికారు. దీనిపై ఈవో రమాదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో 45 ఫిర్యాదులు ఇచ్చినా ఒక్క ఎఫ్‌ఐఆర్‌కూడా చేయలేదని అన్నారు. దేవుడి మాన్యాలను ఆక్రమిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రా సర్కారు ఇటీవల జీవో తెచ్చిందని, కానీ గ్రౌండ్లెవెల్లో దాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఉద్యోగులపై దాడి చేస్తే కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై లోకాయుక్త, మానవహక్కుల కమిషన్‌ను సంప్రదిస్తామన్నారు. సాయంత్రం కూడా ఆక్రమణదారులు దాడికి యత్నించడంతో ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యోగులు, అర్చకులు ధర్నాకు దిగారు. దీంతో ధర్నా చేస్తున్న టెంపుల్ ఈఓ, ఉద్యోగులను ఆక్రమణదారులు అడ్డుకున్నారు. కొద్దిసేపటికే ఎటపాక పోలీసులు వచ్చి ఆక్రమణదారులను బయటకు పంపించారు. తర్వాత టెంపుల్ ఉద్యోగులు బయటకు వస్తుండగా ఆక్రమణదారులు రాళ్లు విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పోలీసులు వారిని అక్కడినుంచి పంపించడంతో ఈవో, ఉద్యోగులు సురక్షితంగా భద్రాచలం చేరుకున్నారు.