ఈసారి బడ్జెట్​పై ఎన్నో అంచనాలు

ఈసారి బడ్జెట్​పై ఎన్నో అంచనాలు
  •      ఎకానమీ వృద్ధికి పలు నిర్ణయాలు ప్రకటించే అవకాశం
  •     మహిళలకు మరిన్ని సదుపాయాలు

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం బడ్జెట్ సెషన్ 2024 జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ఈ నెల 23న లోక్‌‌సభలో కేంద్ర బడ్జెట్‌‌ను సమర్పించనున్నారు.  దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌‌లో చేసిన ప్రసంగంలో పలు హామీలు ఇచ్చారు. బడ్జెట్​ సమావేశాలలో ప్రధాన ఆర్థిక,  సామాజిక నిర్ణయాలను ప్రకటిస్తామని  వెల్లడించారు. ఈ బడ్జెట్ ప్రభుత్వ సుదూర విధానాలను,  భవిష్యత్తుకు అవసరమైన మార్గాలను చూపుతుందని అన్నారు.  

ఎవరికి ఏంటి ?

 జీతం పొందే వ్యక్తులకు ప్రస్తుతానికి రూ.50వేల స్టాండర్డ్​ డిడక్షన్​ఉంది. కొత్త బడ్జెట్ ఈ  పరిమితిని రూ.లక్ష వరకు పెంచుతారని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) ప్రకారం హోంలోన్​ తీసుకున్న వారికి మరిన్ని పన్ను ప్రయోజనాలు రావొచ్చు.  మహిళల కోసం ఈసారి వంట గ్యాస్‌‌పై ప్రత్యక్ష ప్రయోజన బదిలీలతోపాటు నిత్యావసర వస్తువులపై సబ్సిడీల వంటివి ఇస్తారని భావిస్తున్నారు. అంతేగాక రాయితీతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలనూ ప్రకటించవచ్చు. పొదుపు ఖాతాల నుంచి వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.10వేల నుంచి రూ.25వేలకి పెంచే అవకాశం కూడా ఉంది. సీనియర్ సిటిజన్లకు, ఈ పరిమితి రూ.50 వేల వరకు ఉండొచ్చు. 

ఎకానమీ కోసం...

ఈసారి బడ్జెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి  రక్షణ, రైల్వేలు  పునరుత్పాదక ఇంధనంతో సహా ఇతర ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యతనిస్తుందని భావిస్తున్నారు. వ్యాపారాలు  కంపెనీల విషయానికి వస్తే, 100కి పైగా చట్ట నిబంధనలను నేరరహితం చేయడం, జరిమానాలను తగ్గించడం, ఫలితంగా కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించడం ద్వారా మనదేశంలో వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకునేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోర్టులపై కేసుల భారాన్ని మరింత తగ్గించడానికి,  వ్యాపారాలు చేయడం సులభతరం చేయడానికి మీడియేషన్​కౌన్సిల్​ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఏర్పాటు చేయనుందని చెబుతున్నారు. కొత్త బడ్జెట్ కార్మిక చట్టాలతోపాటు కొత్త కార్మిక  సంక్షేమ సూచికను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.

నిర్మలా సీతారామన్‌‌.. ఇది ఏడోసారి 

కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌‌తో సహా మొత్తం ఆరు బడ్జెట్‌‌లను సమర్పించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన రెండవ ఆర్థిక మంత్రి ఆమె. భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి అయిన సీతారామన్ జులై 2019 నుంచి ఐదు పూర్తి బడ్జెట్‌‌లను అందించారు.  మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం,  యశ్వంత్ సిన్హా వంటి మునుపటి ఆర్థిక మంత్రుల రికార్డులను ఆమె అధిగమించారు. వీరిలో ఒక్కొక్కరు ఐదు వరుస బడ్జెట్‌‌లను సమర్పించారు.