K Viswanath :కె. విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయరంగ ప్రముఖుల దిగ్ర్భాంతి

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస  విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది. కె. విశ్వనాథ్ మృతిపట్ల పలువురు సినీ నటులు, రాజకీయ నాయకలు సంతాపం తెలియజేస్తున్నారు. 

సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం : మోడీ 

దర్శకుడు కె. విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ‘కె. విశ్వనాథ్ సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకలంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

కె. విశ్వనాథ్‌ కీర్తి అజరామరం : సీఎం కేసీఆర్‌

ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే విశ్వనాథ్‌ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కె. విశ్వనాథ్‌ అని కొనియాడారు. గతంలో  కె.విశ్వనాథ్‌ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. భారతీయ సామాజిక సంస్కృతి సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. 

సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తంగా మానవ సబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా, దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె. విశ్వనాథ్‌ అని అన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికితురాయిగా నిలిచాయని చెప్పారు. 

తెలంగాణ మంత్రుల సంతాపం

దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వనాథ్‌ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం అందించాలని మంత్రులు ఆకాక్షించారు.

సినీ రంగానికి తీరని లోటు : వైఎస్ జగన్ 

కె.విశ్వనాథ్‌ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌ గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు’ అంటూ ట్వీట్ చేశారు. 

చిరంజీవి దిగ్బ్రాంతి

కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలిచి వేసింది. ఆయన కన్నుమూసిన వార్త విని షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు.. తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి అన్నారు. 

కె.విశ్వనాథ్ తో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం తీసుకుంటూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన 'శభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్. అద్భుతమైన సంగీతానికి,  ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్‌ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి.

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేశారు

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆయనకు సంతాపం ప్రకటించారు. ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని ఖండంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్‌ది ఉన్నతస్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూప చిత్రాలను అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనుకుంటున్నాను’’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు.

తెలుగు సినిమాపై చెరగని ముద్ర: కిషన్‌రెడ్డి

కె.విశ్వనాథ్‌ మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘అద్భుత కథనం, సృజనాత్మక దృష్టితో లెజండరీ డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ తెలుగు సినిమాపై చెరగని ముద్రవేశారు. భారత చిత్ర పరిశ్రమకు చేసిన ఆయన సేవలకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు గెలుచుకున్నారు. ఈ సమయంలో నా ప్రార్థనలు, ఆలోచనలు ఆయన కుటుంబంపైనే ఉన్నాయి’ అని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. 

తెలుగువారికి తీరని లోటు : వివేక్ వెంకటస్వామి 

కె. విశ్వనాథ్ మృతిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వాగ్గేయకార దర్శకులు, కళామతల్లి ముద్దుబిడ్డ కళా తపస్వి కె. విశ్వనాథ్ మరణం తెలుగువారికి తీరని లోటు అని అన్నారు. ‘కె. విశ్వనాథ్ ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుడుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ వివేక్ వెంకటస్వామి ట్వీట్ చేశారు. 

ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను : బ్రహ్మానందం

‘పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు. కానీ విశ్వనాథ్ గారి మరణం చాలా గొప్పది.- ఆయన సినిమాల్లో నేను నటించాను. ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన కుటుంబంతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. ఆయన లేడు అనేది చాలా బాధాకరం. భారతీయ చలన చిత్రాలలో విరబూసిన కమలం ఆయన’ అని బ్రహ్మానందం అన్నారు. 

తీవ్రమైన అలల మధ్య కూడా ప్రశాంతంగా ఉండే గొప్ప వ్యక్తి : రాధిక

‘కె.విశ్వనాథ్ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్న. తీవ్రమైన అలల మధ్య కూడా చాలా ప్రశాంతంగా ఉండే గొప్ప వ్యక్తి ఆయన. ఆయనతో పని చేసిన రోజుల్ని ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ సినీ నటి రాధక అన్నారు. 

ఆయన సినిమా పాటలే నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాయి : చంద్రబోస్ 

‘విశ్వనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన సినిమా పాటలే నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాయి. విశ్వనాథ్ ప్రతి సినిమా మనకు ఒక ఆదర్శం’ అని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు.