డ్రగ్స్ ఇచ్చి.. రేప్​ చేస్తరు

డ్రగ్స్ ఇచ్చి.. రేప్​ చేస్తరు

ముంబై డ్రగ్‌ కల్చర్‌‌లో అమ్మాయిలపై అఘాయిత్యాలు
పెడ్లర్ల ఆస్తులను జప్తు చేస్తం: సీపీ సీవీ ఆనంద్
కింగ్​ పిన్​ను గుర్తించినం.. త్వరలోనే అరెస్ట్​ చేస్తమని వెల్లడి
ముంబై డ్రగ్ నెట్​వర్క్​లో హైదరాబాద్​ సాఫ్ట్​వేర్​ యువతి
ఆమెతో సహా ఏడుగురి అరెస్ట్.. 204 గ్రాముల ఎండీఎంఏ సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు : ముంబై డ్రగ్స్‌‌ కల్చర్‌‌‌‌లో ఎన్నో ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని, అమ్మాయిలకు డ్రగ్స్​ ఇచ్చి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్​ సిటీ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్​లో డ్రగ్స్​ను అరికట్టేందుకు పక్కా ప్లాన్​తో ముందుకు వెళుతున్నామని, డ్రగ్స్​ సరఫరాకు సహకరించే పెడ్లర్ల ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్ ట్రాన్స్​పోర్ట్ అవుతోందని, మిథైలెనెడియోక్సి- మెథాంఫేటమిన్(ఎండీఎంఏ) సప్లయ్​ చేస్తున్న కింగ్​పిన్​ను గుర్తించామని చెప్పారు. త్వరలోనే మహారాష్ట్ర పోలీసులతో కలిసి అతడిని అరెస్ట్​ చేస్తామన్నారు. ముంబై నుంచి సిటీకి డ్రగ్స్​ సప్లయ్​ చేస్తున్న గ్యాంగ్​ను, వైజాగ్​నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను, ఓల్డ్​ సిటీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌‌ నార్కోటిక్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ వింగ్‌‌(హెచ్‌‌న్యూ), ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సీపీ సీవీ ఆనంద్‌‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

డ్రగ్స్​కు బానిసై పెడ్లర్​గా..

డ్రగ్స్​కు బానిసై డబ్బు కోసం పెడ్లర్​గా మారిన ఓ మహిళా టెకీ సహా ఏడుగురిని హెచ్‌‌న్యూ వింగ్ అరెస్ట్​ చేసింది. 204 గ్రాముల మిథైలెనెడియోక్సి- మెథాంఫేటమిన్(ఎండీఎంఏ), కారు, సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకుంది. కొండాపూర్‌‌కు చెందిన సనాఖాన్‌‌(22) ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నది. ఫ్రెండ్స్‌‌తో కలిసి పలుమార్లు ముంబై వెళ్లి అక్కడ జరిగిన పార్టీల్లో లిక్కర్‌‌, డ్రగ్స్‌‌కు అలవాటుపడింది. ఎక్కువ మత్తు ఇచ్చే ఎండీఎంఏ సింథటిక్‌‌ డ్రగ్‌‌ కొనుగోలు చేసేది. డ్రగ్స్‌‌ కొనేందుకు కావ ల్సిన డబ్బు కోసం పెడ్లర్‌‌‌‌గా మారింది. కొండాపూర్‌‌‌‌లోని ఓ రెస్టారెంట్‌‌ నిర్వాహకుడు హర్షమహాజన్‌‌ అలియాస్‌‌ రాజ్‌‌వీర్‌‌‌‌(44)తో కలిసి ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్‌‌ ‌‌జతిన్‌‌బాల్‌‌చంద్ర భలే రావు(36) వద్ద ఎండీఎంఏ కొనుగోలు చేసేవారు. రూ.2 వేలకు గ్రాము ఎండీఎంఏ కొనుగోలు చేసి ఐటీ సెక్టార్‌‌‌‌తోపాటు రెస్టారెంట్స్, పబ్స్‌‌లో చైన్ సిస్టమ్‌‌ ద్వారా రూ.7 వేల నుంచి రూ.10 వేలకు సేల్‌‌ చేసేవారు. ఇలా సనాఖాన్‌‌ 50 మంది రెగ్యులర్ కస్టమర్లకు ఎండీఎంఏ సప్లయ్ చేస్తున్నది.

నెట్​వర్క్​లో 172 మంది కస్టమర్లు

ముంబైకి చెందిన డ్రగ్స్ పెడ్లర్స్ వికాస్ మోహన్ కొడ్మూర్‌‌‌‌ అలియాస్ విక్కీ(33), దినేష్‌‌ మోహన్ కొడ్మూర్‌‌ వద్ద జతిన్‌‌బాల్‌‌చంద్ర భలేరావు, ముంబైకే చెందిన జావెద్‌‌ షమ్షేర్‌‌ అలీ‌‌సిద్దికి(34) డ్రగ్స్​ కొనుగోలు చేసేవారు. కిలో ఎండీఎంఏను రూ.6 లక్షలకు కొనేవారు. ముంబైకే చెందిన జునైద్‌‌ షేక్ శంషుద్దీన్‌‌(28)తో డ్రగ్స్ ట్రాన్స్‌‌పోర్ట్ చేయించేవారు. ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్​ సప్లయ్ అవుతున్నట్టు గుర్తించిన హెచ్‌‌న్యూ పోలీసులు.. రెండు నెలల పాటు ముంబైలో నిఘా పెట్టారు. ఈ క్రమంలో భలేరావు నెట్‌‌వర్క్‌‌కు చెందిన నైజీరియన్ ఒజెంగ్వా ఇమాన్యుయల్‌‌ కొకైన్‌‌తో హైదరాబాద్‌‌ వస్తున్నట్టు గుర్తించి గత నెల 25న అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో వికాస్ మోహన్‌‌, దినేష్‌‌ మోహన్‌‌ ను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారంతో జతిన్‌‌, జావెద్‌‌ లను గత వారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం గోపాలపురం పీఎస్‌‌ లిమిట్స్‌‌లో సనాఖాన్‌‌, హర్షమహాజన్‌‌ను అరెస్ట్ చేశారు. హర్షమహాజన్‌‌ వద్ద 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. వీరి నెట్‌‌వర్క్‌‌లో మొత్తం 172 మంది కస్టమర్లను పోలీసులు గుర్తించారు.

మరో కేసులో 40 గ్రాములు

మరో కేసులో ఓల్డ్‌‌సిటీలో డ్రగ్స్‌‌ అమ్మేందుకు ప్రయత్నించిన ముంబై అంథేరీ వెస్ట్‌‌కు చెందిన మెహరాజ్‌‌ ఖాజీ(34)ని పోలీసులు అరెస్ట్​ చేశారు. సోమవారం చార్మినార్‌‌‌‌ వద్ద కస్టమర్లకు డ్రగ్స్​ అందించేందుకు ఖాజీ ప్లాన్ చేశాడు. సమాచారం అందుకున్న హెచ్‌‌న్యూ టీమ్‌‌ ఖాజీని అరెస్ట్ చేసి.. 40 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌‌ స్వాధీనం చేసుకుంది.

110 కిలోల గంజాయి సీజ్

వైజాగ్‌ నుంచి గంజాయి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న ముంబై గ్యాంగ్‌ను సిటీ ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రూ.36 లక్షల విలువ చేసే 110 కిలోల గంజాయి, రూ.1.5 లక్షల క్యాష్‌, ఇన్నోవా కారు‌, 4 సెల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర థానేకు చెందిన​అలీ అస్గర్‌‌(34), అతడి భార్య మహ్మద్‌ సులేమాన్ షేక్‌(30)ముంబైకి చెందిన రకీబ్‌తో కలిసి గంజాయి దందా చేస్తున్నారు. జహీరాబాద్‌కు చెందిన ముర్తుజా షేక్‌తో కలిసి వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు ప్లాన్ చేశారు. ముంబైకి చెందిన కారు డ్రైవర్‌‌ అబ్దుల్, అతని భార్య హసీనాలను గంజాయి ట్రాన్స్​పోర్ట్ చేస్తే రూ.20 వేలు ఇస్తామని చెప్పి వైజాగ్ తీసుకెళ్లారు. ఏపీలోని అరకుకు చెందిన శ్రీనివాస్‌ వద్ద 110 కిలోల గంజాయిని కొని కారు వెనుక సీట్‌ కింది భాగంలో ప్యాక్ చేశారు. హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి ట్రాన్స్‌పోర్ట్‌ విషయం తెలుసుకున్న హెచ్‌న్యూ పోలీసులు నిఘా పెట్టి.. అలీ అస్గర్, సులేమాన్‌, ముర్తుజాను అరెస్ట్ చేశారు. అబ్దుల్, హసీనా పరారయ్యారు.