- విస్తరణ దిశగా సింగరేణి అడుగులు
- ఈ ఏడాది కొత్త గనుల తవ్వకాలపై ఫోకస్
- కేంద్ర అటవీ, పర్యావరణ పర్మిషన్లు రాగానే తవ్వకాలు
- ఏటా 21.90 మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తికి చాన్స్
- 100 మిలియన్ టన్నుల టార్గెట్ సాధ్యమంటున్న ఆఫీసర్లు
కోల్ బెల్ట్,వెలుగు : కొత్త ఏడాదిలో సింగరేణి కొత్త గనులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. త్వరగా పర్మిషన్లు సాధించుకుంటే విస్తరణ దిశగా కూడా అడుగులు వేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇక సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే అవకాశాలపై సంస్థ ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తోంది. రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో 38,594 మంది ఉద్యోగులు, 2,255 మంది ఆఫీసర్లు, 23,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నా రు. 22 అండర్ గ్రౌండ్ మైన్లు, 18 ఓసీపీ మైన్ల ద్వారా ఏటా 72 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. థర్మల్ పవర్కేంద్రాలతో పాటు సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తూ..ఇతర ఆవిష్కరణల తోనూ కీలకంగా మారింది.
పర్మిషన్ల కోసం ఎదురుచూపు
కొత్త గనుల ఏర్పాటులో భాగంగా కేంద్ర పర్యావరణ, అటవీ అనుమతుల జాప్యం కారణంగా సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో నడిచిన గనుల్లో మూసిన బొగ్గు నిక్షేపాలను తిరిగి వెలికితీసేందుకు విస్తరణ పేరుతో ఓసీపీల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఏడు కొత్త గనుల తవ్వకాలకు సన్నాహాలు చేస్తోంది. జనవరిలో ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది.
గని నుంచి సాలీనా10 లక్షల టన్నుల బొగ్గును వెలికితీయనుంది. మరోవైపు కొత్తగా ఏడు గనులైన గోలేటీ ఓసీ, వీకే ఓసీ, జీడీకే10 ఓసీ, రొంపేడు(జేకేఓసీ)ఓసీ, ఎంవీకే ఓసీ, పీవీఎన్ఆర్ ఓసీపీ(వెంకటాపూర్), కేటీకే ఓసీపీ 2 అండర్ గ్రౌండ్ సెక్షన్ స్టేజ్–1 పర్మిషన్లు రాగా, ఇంకోవైపు స్టేజ్–2 పర్మిషన్ల కోసం సింగరేణి ఎదురుచూస్తోంది. గతంలో ఒకటి రెండేండ్లలోనే పర్మిషన్లు రాగా, కఠిన నిబంధనలతో ఒక్కో ప్రాజెక్టుకు కనీసం నాలుగైదేండ్లు టైమ్ పడుతోంది.
వంద మిలియన్ టన్నులు టార్గెట్
కొత్త గనులకు పర్మిషన్లు రాగానే బొగ్గు వెలికితీతకు ఇప్పటికే సింగరేణి ప్లాన్ రెడీ చేసింది. గత మూడేండ్లలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదల తీరుపై ఇటీవల కేంద్ర బొగ్గు గనుల శాఖ పార్లమెంటుకు నివేదికను అందజేసింది. దీని ప్రకారం మూడేండ్లుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెద్దగా పెరగలేదని వివరించింది. 2021–22లో 67.23 మిలియన్ టన్నులు, 2023–24లో 72.52 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. 7.86 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒడిశాలో ఇదే సమయంలో 29.41శాతం వృద్ధి శాతం నమోదైందని నివేదికలో స్పష్టం చేసింది.
బొగ్గు ఉత్పత్తిలో తెలంగాణ తొలి 5 స్థానాల్లో నిలిచిందని పేర్కొంది. ఉత్పత్తి లేకపోవడానికి పలు కారణాలు ఉండగా.. పదేండ్లుగా నేరుగా కొత్త బొగ్గు గనులను కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోకపోవడం లేదు. అండర్ గ్రౌండ్ మైన్లలో కార్మికులు, మెషీన్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం, 22 అండర్ గ్రౌండ్ గనులు పాతవి కావడంతో బొగ్గు నిల్వలు అడుగంటిపోగా.. ఇందులో 15 మూసివేతకు దగ్గర పడటం కూడా కారణాలుగా ఉన్నాయి.
ఈ ఏడాదిలో కొత్త గనుల్లో తవ్వకాలు మొదలైతే ఏటా 21.90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమని సింగరేణి భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గనులకు అవసరమైన పర్మిషన్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల నుంచి పొంది బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి ఎదురుచూస్తోంది.