హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో జనారోగ్యంతో చెలగాటమాడుతున్న పలు హోటల్స్ బండారం బయటపడింది. కస్టమర్లకు రుచి కరమైన ఆహారం అందిస్తామని చెప్పుకునే పలు హోటల్స్ హానికర కెమికల్స్, బూజు పట్టిన చికెన్, కృత్రిమ రంగులతో వండి పెడుతున్నట్టు తేలింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పలు హోటల్స్‌లో తనిఖీలు చేశారు.
అరణ్య హోటల్లో తుప్పు పట్టిన పాత్రల్లో వంట అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్లో తనిఖీ చేయగా..రిఫ్రిజిరేటర్లో సరైన టెంపరేచర్ మెయింటెయిన్చేయడం లేదని, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా చికెన్నిల్వ చేసినట్లు గుర్తించారు. హానికర రంగులను కలిపిన పన్నీర్, వంటలు చేయడానికి తుప్పు పట్టిన పాత్రలను ఉపయోగించడమే కాకుండా బూజు పట్టిన కూరగాయలను గుర్తించి యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బూజు పట్టిన 26 కిలోల చికెన్‌ను పడేసి నోటీసులు ఇచ్చారు.
అశోక హోటల్లో వాడిన నూనే మళ్లీ మళ్లీ
హనుమకొండ చౌరస్తాలోని అశోక హోటల్ ను తనిఖీ చేయగా హానికరమైన రంగులు కలిపిన ఆహార పదార్థాలతో పాటు భారీగా రంగు డబ్బాలు, 10 లీటర్ల రీ యూజ్డ్ ఆయిల్, కాలం చెల్లిన చికెన్ మసాలాలు, సాస్ బాటిల్స్ గుర్తించారు. బ్యాచ్ నెంబర్, తయారు చేసిన తేదీ లేకుండా స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన రూ.5,500 విలువైన 17 నూడుల్స్, 28 సోంపు ప్యాకెట్లను సీజ్ చేసి, శాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. అలాగే, ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ నుంచి వచ్చిన శాంపిల్స్ రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. హోటల్ యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసుతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో హనుమకొండ, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పి.వేణుగోపాల్, సీహెచ్.కృష్ణమూర్తి, పి.మనోజ్ కుమార్, పి.స్వాతి పాల్గొన్నారు.
శ్రేయ హోటల్లో ప్రిపేర్డ్ ఫిష్ టిక్కా...
బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు హానికరమైన రంగులు కలిపిన చికెన్ కబాబ్స్, ఇతర చికెన్ ఐటమ్స్ గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతున్నట్టు తెలుసుకుని యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. సుమారు 11 కిలోల బూజు పట్టిన చికెన్, ప్రిపేర్డ్ ఫిష్ టిక్కా, బొద్దింకలతో ఉన్న ఇడ్లి పిండి, బెల్లం పారబోశారు.