
- రావిర్యాలలో దోపిడీ చేసిన అరగంటకే.. మధుబన్‌కాలనీలో మరో చోరీకి యత్నం
- ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసే యత్నం
- షార్ట్ సర్క్యూట్తో మంటలు రావడంతో పరార్
- ఏటీఎంలో రూ.7.6 లక్షలు సేఫ్
శంషాబాద్, వెలుగు: రావిర్యాలలోని ఆదివారం అర్ధరాత్రి ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 30 లక్షలు ఎత్తుకుపోయిన ఘటన మరువకముందే మరో చోరీ విషయం బయటపడింది. డబ్బులు ఎత్తుకు పోతూ మార్గమధ్యలో మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోని మధుబన్ కాలనీలో ఉన్న మరో ఏటీఎంలోనూ ఆ ముఠా దోపిడీకి యత్నించింది. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేసేందుకు ట్రై చేసింది. గ్యాస్ కట్టర్ 1111తో కట్ చేస్తుండగా మెషీన్లోని వైర్లకు తగిలి షార్ట్సర్క్యూట్జరిగింది. దీంతో మెషీన్‌కు మంటలంటుకున్నాయి.
అరగంటలోనే మరో అటెంప్ట్
షార్ట్ సర్క్యూట్తో ఏటీఎంలో మంటలు వ్యాపించగా దొంగలు పారిపాయారు. ఈ ఘటనలో మెషీన్ దాదాపు కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ సిబ్బందికి చెప్పగా వారు ఏటీఎంను పరిశీలించారు. అయితే, మెషీన్లోని రూ.7.6 లక్షలకు ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌బీఐ సిబ్బంది ఫిర్యాదుతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూర్ హైవే, ఓఆర్‌ఆర్ రూట్లలో సెర్చింగ్
ఏటీఎంలోని సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో దోపిడీకి యత్నించిన వారిని గుర్తించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రావిర్యాలలో దోపిడీ చేసిన తర్వాత చాంద్రాయణగుట్ట మీదుగా మైలార్‌దేవ్‌పల్లికి వచ్చినట్లు గుర్తించారు. మధుబన్ కాలనీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్, బెంగళూర్ హైవే, ఓఆర్‌ఆర్ టోల్‌గేట్లపై సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ తీసుకుంటున్నారు.