బల్దియా ఏం చేయలేదు.. వాటర్​ బాటిల్ కొనాల్సిందే!

బల్దియా ఏం చేయలేదు.. వాటర్​ బాటిల్ కొనాల్సిందే!
  •  హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తీస్కోలేని పరిస్థితి 

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫ్రీగా డ్రింకింగ్​ వాటర్ ఇవ్వక పోయినా జీహెచ్ఎంసీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ అంశానికి సంబంధించి బల్దియా యాక్ట్​లో ప్రొవిజన్ లేకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతోంది. అయితే ఈ నెల 10న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ లేదా వాటర్​బోర్డు సరఫరా చేసే నీటిని ఉచితంగా అందించేలా చూడాలని ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్.. బల్దియా కమిషనర్​ లోకేశ్​కుమార్​ను ఆదేశించారు. గ్రేటర్ ​పరిధిలో ఫ్రీ వాటర్​స్కీం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై18వ తేదీ లోపు రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉచితంగా తాగునీరు అందించాలని సుప్రీం కోర్టు 2011లోనే ఆదేశించింది. అయినప్పటికీ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీం ఆర్డర్ ​ప్రకారం జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేయాల్సి ఉంది. కానీ 12 ఏండ్లుగా ఆ విషయంపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా సిటీ జనం టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ ఇలా దేనికోసం వెళ్లినా ముందు వాటర్ ​బాటిల్ కొనుక్కొని తాగాల్సి వస్తోంది. పైగా సిటీలోని చాలా చోట్ల ఎంఆర్పీ ధరలకు వాటర్​ బాటిల్స్​ ఇవ్వడం లేదు. యాజమాన్యాలు సొంత బ్రాండ్ల పేరుతో ఇష్టమొచ్చిన రేట్లు పెట్టుకుని అమ్ముతున్నాయి. 750 ఎంఎల్ వాటర్  బాటిల్ రూ.50, లీటర్ బాటిల్​కి రూ.60 నుంచి రూ.100 వరకు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన బల్దియా అధికారులే సైలెంట్​గా ఉంటుండడంతో ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు.

ఆదేశాలు ఇచ్చారు.. కానీ

అర్వింద్ కుమార్ ఆదేశాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లలో తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని బల్దియా ఉన్నతాధికారులు ఫుడ్ ఇన్​స్పెక్టర్లకు చెప్పారు. ఉచితంగా తాగు నీరు అందించకపోతే కేసులు నమోదు చేస్తామని ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. అయితే ఫ్రీగా డ్రింకింగ్​వాటర్​ ప్రొవైడ్ చేయకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ యాక్ట్​లో సెక్షన్ లేదు. దీంతో ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు అవగాహన కల్పించడంతో పాటు వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్రీగా ఇవ్వకపోతే ఇతర సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేస్తామని ఓ అధికారి తెలిపారు. రెస్టారెంట్లు, హోటళ్లలో వాటర్ ​ఫ్రీగా ఇవ్వకపోతే 040–21111111 ద్వారా బల్దియా దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కేఫ్, మెస్​లలో మాత్రమే

సిటీలోని కేఫ్​లు, మెస్​లతో పాటు కొన్ని హోటళ్లలో మాత్రమే ఫ్రీ వాటర్ అందిస్తున్నారు. మిగిలిన అన్నిచోట్ల ఆర్డర్​ఇచ్చిన ఫుడ్​ కంటే ముందే వాటర్​ బాటిల్ తీసుకొచ్చి టేబుల్​పై పెడుతున్నారు. రానురాను జనం నీళ్లు కొనుక్కొని తాగడానికి అలవాటు పడిపోవడం హోటళ్ల నిర్వాహకులకు కలిసొస్తోంది. ఫ్రీగా వాటర్ అందించాలనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. నలుగురు కలిసి రెస్టారెంట్​కు వెళ్తే రూ.100 నుంచి రూ.150 వరకు వాటర్ ​బాటిల్స్ కే ఖర్చు చేయాల్సి వస్తోందని జనం చెబుతున్నారు.