- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు
- భక్తుల సౌలతులకూ వేచి చూడాల్సిన పరిస్థితి
- ఎనిమిదేళ్లు గడుస్తున్నా కాటేజీని అప్పగించని టీటీడీ
భద్రాచలం, వెలుగు: తెలంగాణ సర్కారు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంపై శీతకన్ను వేస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టలేదు. దీంతో భద్రాచలం రామాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. అవినీతి, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. చివరిసారిగా 2012లో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. 2014 తర్వాత ఇక బోర్డు ఏర్పాటు ఊసెత్తడం లేదు. దీంతో తొమ్మిదేళ్లుగా ట్రస్టు బోర్డు లేకుండానే పాలన కొనసాగుతోంది.
1960 నుంచి ఎండోమెంట్ చేతుల్లోకి..
ఉమ్మడి ఏపీలో 1960లో ఎండోమెంట్ చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచి 13 ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేశారు. కల్లూరి చంద్రమౌళి, బండి శోభనాచలం, యతిరాజారావు, అల్లూరి మూర్తిరాజు రెండుసార్లు, ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, కోనేరు నాగేశ్వరరావు, బోర్ల వెంకటేశ్వరరరావు, కత్తుల శాంతయ్య, కొండబాల కోటేశ్వరరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, కురిచేటి పాండురంగారావు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా పని చేశారు. వార్షిక ఆదాయం రూ.60 కోట్ల వరకు ఉంటుంది. ఏటా అనేక అభివృద్ధి పనులు జరుగుతుండగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. లడ్డూల తయారీ కాంట్రాక్టు పదేళ్లుగా ఒక్కరే ఉన్నారు. అధికార పార్టీ నేతల రికమండేషన్‌తో ఆయన చెప్పిన పనులు జరుగుతున్నాయని అంటున్నారు. నిర్లక్ష్యం కారణంగానే ముక్కోటి ఏకాదశికి తయారు చేయించిన 30 వేల లడ్డూలు బూజు పట్టి పాడైపోయాయని తేలింది. ఎండోమెంట్ ఆఫీసర్లు పర్యవేక్షించక పోవడంతో ఆలయంలో అవినీతి జరుగుతోందనే ఆరోపణలున్నాయి.
ట్రస్టు బోర్డుతో లాభాలివే..
ట్రస్టు బోర్డు ఉండడంతో అనేక లాభాలున్నాయి. ప్రతి నెలా బోర్డు సమావేశమై భక్తులకు అవసరమైన సౌకర్యాల కోసం అభివృద్ధి పనులపై తీర్మానం చేస్తారు. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి అప్రూవల్ తీసుకొని వెంటనే పనులు చేయిస్తారు. ఇప్పుడు భక్తులకు అవసరమైన సౌకర్యాల కోసం ఈవో సిఫార్సు చేసినా కమిషనర్ నుంచి అనుమతి వచ్చేంత వరకు ఆగాల్సిందే. ట్రస్టు బోర్డు లేకపోవడం వల్ల ఈవో తీసుకునే నిర్ణయాలు సకాలంలో అమలు కావడం లేదు. 100 ఎకరాల్లో చేపట్టిన శ్రీగోకుల రామమ్ పనులు ఆక్రమణదారుల అడ్డగింతలతో ఆగిపోయాయి. కమిటీ ఉంటే దీనిపై సీరియస్ రియాక్షన్ ఉండేది. పూర్తిగా విరాళాలతో చేపట్టిన ఈ పనులకు చాలా మంది దాతలు ముందుకొచ్చేవారు. టీటీడీ భక్తుల కోసం నిర్మించిన కాటేజీని దేవస్థానానికి అప్పగించలేదు. రూ.6 కోట్లతో నిర్మించిన ఈ కాటేజీ ఏళ్లుగా ఖాళీగా ఉంటోంది. బోర్డు ఉంటే ఒత్తిడి తెచ్చి భక్తుల కోసం వినియోగించేవారు. ఆఫీసర్ల పర్యవేక్షణపై నిత్యం బోర్డు సమీక్షిస్తుంది. నిఘా ఉంటుంది. ఇప్పుడు అది లేదు. దీంతో పాలన పక్కదారి పడుతోందనే విమర్శలున్నాయి.
భూములన్నీ అన్యాక్రాంతం..
దేవస్థానానికి భక్తులు ఇచ్చిన భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏపీలో విలీనమైన పురుషోత్తపట్నంలో దేవస్థానం భూముల్లో అక్రమార్కులు పాగా వేశారు. గోశాల నిర్మాణాన్ని కూడా అడ్డుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1,350 ఎకరాల భూములు రాముడికి ఉన్నాయి. పురుషోత్తపట్నంలోని 70 ఎకరాల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోంది. 100 ఎకరాల్లో చేపట్టిన గోశాల పనులు కబ్జాదారుల కారణంగా ఆగిపోయాయి. ఏపీలోని రాజకీయ నేతల ఒత్తిళ్లతో దేవస్థానం భూముల్లో ఆక్రమణలకు దిగుతున్నారు. ఏపీలోని ఆఫీసర్లు దేవస్థానానికి సహకరించక పోవడంతో ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు.
అజమాయిషీ ఏదీ?
శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయక పోవడంతో ఆజమాయిషీ కొరవడింది. భక్తులకు సౌకర్యాలు కల్పించే వారు లేకుండా పోయారు. కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆఫీసర్లు కూడా పర్యవేక్షించడం లేదు. వెంటనే ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలి.
–బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, అధ్యక్షుడు