- ఐదు నెలలైనా చైర్మన్ పోస్ట్ భర్తీ చేయని సర్కారు
- ఆగస్ట్ 18తో ముగిసిన పాలకవర్గం గడువు
- మార్కెట్లో రైతుల గోస పట్టించుకునేవారు కరువు
- పలుమార్లు కాంటాలు, కొనుగోళ్లు ఆపిన వ్యాపారులు
- స్టాఫ్ జీతాలకూ.. ఆరు నెలలుగా అప్పే..
వరంగల్, వెలుగు: వరంగల్ ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పోస్ట్ నెలల తరబడి ఖాళీగా ఉంటోంది. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‍లో అయిన ఏనుమాములకు.. మన రాష్ట్రంతోపాటు చత్తీస్ గఢ్, మహారాష్ట్ర రైతులు కూడా వస్తుంటారు. పత్తి, మిరప సీజన్లు మొదలయ్యాయంటే వేలాది మంది రైతులతో ఈ మార్కెట్ జాతరను తలపిస్తుంటుంది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు దళారులతో కలిసి రైతులను ముంచే ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిని అరికట్టి, మార్కెట్ నిర్వహణను చూసుకోవాల్సిన పాలకవర్గం ఐదు నెలలుగా లేదు. పాత కమిటీ గడువు ముగిసినా.. ప్రభుత్వ పెద్దలు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
దిడ్డి భాగ్యలక్ష్మికి రెన్యూవల్ ఇయ్యలే
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చరిత్రలో మొదటిసారిగా 2021లో ఓ మహిళకు చైర్‍పర్సన్‍గా అవకాశమిచ్చారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆప్తుడిగా చెప్పుకునే 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి భార్య దిడ్డి భాగ్యలక్ష్మికి చైర్మన్‍గిరి కట్టబెట్టారు. 2022 ఆగస్ట్ 18న మార్కెట్ పాలకవర్గం గడువు ముగిసింది. అయితే గతంలో మాదిరి రాష్ట్ర సర్కారు వీరి కమిటీని మరో ఏడాది రెన్యూవల్ చేయలేదు. దీంతో అప్పటి నుంచి చైర్మన్ పీఠం ఖాళీగానే ఉంటోంది.
వ్యాపారుల తీరుతో.. రైతులు పరేషాన్
ఏనుమాముల మార్కెట్లో మొన్నటివరకు పత్తి సీజన్ నడవగా.. ఇప్పుడు మిర్చి విక్రయాలు మొదలయ్యాయి. కాటన్ సీజన్‍లో పత్తి రంగు మారిందని.. తేమ శాతం ఎక్కువగా ఉందనే పేరుతో వ్యాపారులు తమకు నచ్చినట్లు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి పంట వస్తుండగా గన్నీ సంచుల లొల్లి సాగుతోంది. మరోవైపు 1100 గ్రాముల తరుగు తీస్తామంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే విషయమై రైతులు ప్రశ్నిస్తే వ్యాపారులు కాంటాలు, కొనుగోళ్లు ఆపి మార్కెట్ బంద్ చేస్తున్నారు. లారీల విషయంలోనూ కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైతన్నలు, ఇతర సిబ్బంది మార్కెట్లో తమ గోడు చెప్పుకోడానికి పాలకవర్గం లేకపోవడంతో ఇక్కట్లకు గురవుతున్నారు.
జీతాల కోసం తప్పని అప్పులు..
ఏనుమాముల మార్కెట్ అకౌంట్లో కోట్లాది రూపాయల ఫండ్స్ ఉన్నా..సిబ్బంది జీతాల కోసం ఆరు నెలలుగా తనకంటే చిన్న మార్కెట్లను అప్పు అడుగాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెట్‍కు కోట్లాది రూపాయల వనరులుండగా.. గత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.38 కోట్ల ఆదాయం వచ్చింది. దీని పరిధిలో దాదాపు 300 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి జీతాలు, పెన్షన్ల కోసం ప్రతినెలా రూ.కోటి 25 లక్షలు ఖర్చు అవుతోంది.కాగా, అకౌంట్ నుంచి నిధుల విడుదల కోసం అవసరమయ్యే చెక్కులపై జాయింట్ సిగ్నేచర్ అవసరం పడుతుంది. మార్కెట్ సెక్రటరీతో పాటు పాలకవర్గం చైర్మన్ సైతం సంతకం చేస్తేనే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. గతేడాది ఆగస్ట్ లో దిడ్డి భాగ్యలక్ష్మి పదవీకాలం ముగియడంతో కమిటీ చేతిలో పవర్ లేదు. దీంతో ఒకటో తారీఖు వస్తుందనగా.. వారం ముందునుంచే మార్కెట్ అధికారులు అప్పు కోసం ఇతర మార్కెట్లకు పరుగులు పెడుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో నర్సంపేట, ఆదిలాబాద్, ఖమ్మం వంటి చిన్న మార్కెట్ల నుంచి జీతాల కోసం అప్పులు తెస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.