విశ్లేషణ: యూపీలో జంపింగ్​లతో ఎవరికి ఫాయిదా!

ఉత్తరప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రాగానే పొలిటికల్​ జంపింగ్స్ మొదలయ్యాయి. అటు బీజేపీ నుంచి సమాజ్​వాదీ పార్టీలోకి.. ఇటు ఎస్పీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. కమలం పార్టీ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్​ బీజేపీలో చేరారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరుగుతున్న ఈ వలసల వల్ల ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 10 మంది నేతలు, ముగ్గురు మంత్రులు బీజేపీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రతి పోల్ సర్వే తిరిగి బీజేపీ పవర్​లోకి రాబోతున్నదని చెబుతున్న సమయంలో ఈ వలసలు ఎస్పీలో ఉత్సాహం కలిగిస్తున్నాయి. అయితే బీజేపీలో ఈ వలసలపై అంతగా టెన్షన్​ కనిపించడం లేదు. పైగా ములాయం సింగ్ యాదవ్​ చిన్న కోడలు అపర్ణా యాదవ్​ను బీజేపీలో చేర్చుకుని అఖిలేశ్​కు షాక్​ ఇచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలను ఈ వలసలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పలేం. 

ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలు

మరోవైపు, అప్నాదళ్‌, నిషద్‌ తదితర చిన్న పార్టీల సాయంతో 2017లో ఉత్తరప్రదేశ్​లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. వెనుకబడిన వర్గాలు లేదా యాదవేతర ఓబీసీలను ఆకట్టుకోవడానికే ఇప్పుడు రెండు పార్టీల మధ్య పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటంలో ఒక విధంగా అఖిలేశ్ ఒకడుగు ముందున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ మద్దతును ఓట్లుగా మార్చుకుని ఆయన మళ్లీ సీఎం కాగలరా అనేదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. మాయావతి  చతికిలపడటం, ప్రియాంకాగాంధీ ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనిపించకపోవడం ఆయనకు కలిసివచ్చే అంశాలు. అనుకున్నంత సులభంగా ఈ అంచనాలు వాస్తవ రూపం దాల్చగలవని ఇప్పుడే చెప్పలేం. ఉత్తరప్రదేశ్ లో 18 శాతం ముస్లిం, 10 శాతం యాదవ ఓట్లు ఉన్నాయి. ఎస్పీ యాదవుల ఓట్లలో అత్యధికం సొంతం చేసుకున్నా, ఇతర పార్టీలు కూడా కొంత శాతం ఓట్లు పొందేవి. వారి ఓట్ల చీలిక సహజంగానే గత ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు వర్గాలు ఎవరికి ఓటేస్తాయనేది కీలకంగా మారింది. 

గెలవలేమనే పార్టీ మార్పు

స్వామి ప్రసాద్ మౌర్య పదరూనా నుండి రెండుసార్లు బీఎస్పీ, ఒకసారి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కుల సమీకరణాలు తమకు వ్యతిరేకంగా ఉన్నందున ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలవలేమన్న భయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ స్థానంలో యాదవ్, ముస్లిం, ఇతర కులాల ఓటర్లు 27 శాతం ఉన్నారు. వీరిని ఎస్పీ సంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. పైగా, బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య 19 శాతం. వారంతా ఈయన పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అంటే, మౌర్యకు 46 శాతం మంది ఓటర్లు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందనే భయంతోనే బీజేపీని విడిచినట్లు చెబుతున్నారు. 2017 ఎన్నికల్లో కూడా ఆయనకు ఈ ముప్పు ఎదురైంది. అందుకే ఆయన బీఎస్పీని వీడి బీజేపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కుల సమీకరణం ఉంది కానీ మోడీ ఫ్యాక్టర్ కూడా పనిచేసి ఆయన గెలిచారు. ఇక దారాసింగ్‌ చౌహాన్‌ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మధుబన్​ స్థానంలో యాదవ ఓట్లు 60,000, ముస్లిం ఓట్లు 22,000. ఇవి కలిపితే 82 వేలు. దారా సింగ్ కు ఈ ఓట్లు రాకపోతే గెలవడం కష్టమే. ధరమ్ సింగ్ సైనీ ఎమ్మెల్యేగా ఉన్న నకుడ్ ముస్లిం ప్రాబల్యం ఉన్న సీటు. ఇక్కడ 1.30 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇందులో సగం ఓట్లు ఎస్పీ అభ్యర్థికి పడినా తన ఓటమి ఖాయమని భయపడి బీజేపీని వీడారు. 2017 ఎన్నికల్లో సైనీ 4,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి ఆయనకు సీటు ఇచ్చేది లేదని బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి.

బీజేపీ సర్దుబాటు చర్యలు

ఎన్నికల ముందు కీలక వ్యక్తులు, ముఖ్యంగా కీలకమైన ఓబీసీ వర్గాల నేతలు పార్టీని విడవడం బీజేపీకి కాస్త ఇబ్బంది పెట్టింది. అయితే అప్పుడే ఆ పార్టీ చతికిలపడిందని చెప్పలేం. ఇప్పటికే ఆ పార్టీ తేరుకుని సర్దుబాటు చర్యలకు దిగింది. బీజేపీ ఇప్పుడు చాలా పెద్ద పార్టీ కావడంతో ఇటువంటి ఒడిదుడుకులను అధిగమించడానికి సత్వరం కార్యాచరణలోకి దిగినట్లు కనిపిస్తున్నది. నేరుగా ములాయం కుటుంబంలోనే చిచ్చు రాజేసింది. ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్​ను పార్టీలో చేర్చుకుని అఖిలేశ్​ను కోలుకోలేని దెబ్బతీసింది. సొంత కుటుంబాన్ని కాపాడుకోలేని నాయకుడు.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడనే విధంగా అఖిలేశ్​ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అలాగే మరికొందరు కీలక ఎస్పీ నేతలను కూడా బీజేపీ చేర్చుకుని షాక్​ ఇచ్చింది. వీరికి తోడు కాంగ్రెస్, బీఎస్పీ నుంచి కూడా కీలక నేతలు బీజేపీలో చేరారు. అలాగే బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో 60 శాతం సీట్లను ఎస్సీ, ఓబీసీ వర్గాలకే కేటాయించారు. ఒక జనరల్ సీట్ ను దళిత్ కు ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదని, రాష్ట్రంలో అన్ని చోట్లా బీజేపీకి మంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ధీమా వ్యక్తం చేశారు. కొందరు నేతలు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ ఓడిపోతుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వలసలతో అఖిలేశ్​కు తలనొప్పులు

వలసల కారణంగా బీజేపీకి నష్టం కలుగుతుందో లేదోగానీ, ఎస్పీ అధినేత అఖిలేశ్​ కు మాత్రం సీట్ల పంపిణీలో తలనొప్పులు తప్పేలా లేవు. ఇప్పటికే సొంత పార్టీలో ప్రతి నియోజకవర్గంలోనూ పలువురు సీట్లు ఆశిస్తున్నారు. వారికి సర్దుబాటు చేయడమే కష్టంగా ఉండగా, కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం సమస్యగా మారే అవకాశం ఉంది. ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ఏడు పార్టీలు ముందుకొచ్చాయి. ఇందులో రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), మహాన్‌దళ్, జన్‌వాదీ పార్టీ(సోషలిస్టు), ఆప్నాదళ్, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ, గంద్వానా గణతంత్ర పార్టీ ఉన్నాయి. వారికి సీట్లు సర్దుబాటు చేయడమే సమస్యగా ఉండగా, ఇప్పుడు మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. స్వామి ప్రసాద్‌ మౌర్య ఫాజిల్‌నగర్‌ నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ టికెట్‌ను ఆమ్‌శీష్‌ రాయ్‌కు ఇస్తామని ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌదరీ హామీ ఇచ్చారు. దీంతో ఈ సీటు కేటాయింపు చిక్కుల్లో పడింది. మౌర్య కుమారుడు ఉత్క్రిష్ట్‌ మౌర్య 2017లో ఊంచహార్‌ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్థి మనోజ్‌ పాండే చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఈ సీటును మౌర్య పట్టుబడుతుండటంతో మనోజ్‌ను ఒప్పించడం అఖిలేశ్‌కు కష్టంగా మారింది. ఇక మహాన్​దళ్‌ నేత కేశవ్‌ మౌర్య కుమారుడు చంద్రప్రకాష్‌ మౌర్య ఇప్పటికే బిల్సీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్కేశర్మ కొద్ది రోజుల క్రితం ఎస్పీలో చేరడంతో అభ్యర్థి ఎంపిక ఇబ్బందుల్లో పడింది. దారాసింగ్‌ చౌహాన్‌ మధుబన్‌ తోపాటు నాలుగు స్థానాలు తన మద్దతుదారులకు కోరుతున్నారు. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీలో చేరిన కాంగ్రెస్‌ నేత ఇమ్రాన్‌ మసూద్‌ సైతం తన మద్దతుదారులకు 6 నుంచి 8 సీట్లు కోరుతున్నారు. బీజేపీ, బీఎస్పీ నుంచి ఎస్పీలో చేరిన బ్రాహ్మణ నేతలు తమకు టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సామాజిక బలాలను దృష్టిలో పెట్టుకొని, పొత్తులకు గౌరవమిస్తూ టికెట్లు కేటాయించడం, సీట్లు సర్దుబాటు చేయడం అఖిలేశ్‌ కు పెద్ద సవాల్ గా మారే అవకాశం ఉంది.

అప్పుడు.. ఇప్పుడు అవే కారణాలతో..

ఇప్పుడు బీజేపీని వదిలి వెళుతున్న వారంతా 2017 ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారే. ఐదేండ్లుగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవుల్లో ఉన్నవారే. అప్పుడు పార్టీలో చేరుతున్నప్పుడు ఏ కారణాలు చెప్పారో, ఇప్పుడు వదిలిపోవడానికి అలాంటి కారణాలే చెబుతున్నారు. మారిన సమీకరణాలతో తాము తిరిగి గెలుపొందడం కష్టమనో లేదా బీజేపీ తమకు తిరిగి సీట్ ఇవ్వదనో మాత్రమే వీరంతా పార్టీని వదిలి వెళ్లినట్లు కనిపిస్తున్నది. బీజేపీకి రాజీనామా చేసిన వారిలో ఏడుగురు ఓబీసీలు కాగా, ఒకరు దళిత్. కాబట్టి సామాజిక కోణాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తమ కులాలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. 2017లో బీజేపీలో చేరినప్పుడు కూడా పార్టీ మారడానికి వీరు ఇదే కారణం చెప్పారు. మళ్లీ ఎస్పీ నుంచి మారినా అదే కారణం చెప్పవచ్చు. రాజకీయాల్లో ఇలాంటి నాయకులను ‘వలస పక్షులు’ అంటారు. 

– చలసాని నరేంద్ర, పొలిటికల్ ఎనలిస్ట్