ఒక్క చాన్స్ ప్లీజ్ .. వరుస పరాజయాలు చూసినా పట్టువదలని నేతలు

  • అసెంబ్లీలో ఒక్కసారైనా అడుగుపెట్టేందుకు  ప్రయత్నాలు

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుస పరాజయాలు చూసినా పట్టువదలని విక్రమార్కుల్లా మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు పలువురు నేతలు.  ఈసారి ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో ‘ఒక్క చాన్స్ ప్లీజ్’  అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.  వీళ్లలో ఒకటి, రెండు సార్లు కాదు వరుసగా నాలుగుసార్లు స్వల్ప ఓట్లతో ఓడిపోయిన సుమారు 10 మంది నేతలు ఉన్నారు. అంతేగాక పాత ప్రత్యర్థులతోనే పోటీపడబోతున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొందరైతే తమకు ఇదే చివరి ఎన్నిక ఉంటూ ప్రజలను ప్రాథేయపడుతున్నారు. ఇలాంటివారిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. 

ఎమ్మెల్యేలుగా ఓడినవారిలో ప్రముఖలు వీరే.. 

  • ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లోనూ బీజేపీ హైకమాండ్​ కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్ నే ప్రకటించింది. దీంతో మూడోసారి బరిలోకి దిగబోతున్నారు. 
  • మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ 2‌‌‌‌018 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ నుంచి  హుస్నాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. హుస్నాబాద్ లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాననే ధీమాతో ఉన్నారు. 
  • కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు రాజకీయాలు కలిసిరావడం లేదు.  వేములవాడ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా నాలుగుసార్లు  ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి చెన్నమనేని రమేశ్​ బాబు చేతిలో ఓడిపోయారు.  2009లో జనరల్ ఎలక్షన్స్, 2010 బై ఎలక్షన్స్, 2014, 2018 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతో పోటీపడుతున్నారు. 
  • కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 2009లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ పై కేవలం 171 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2010 బై ఎలక్షన్స్ లో, 2‌‌‌‌018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కేటీఆర్ చేతిలోనే ఓటమిపాలయ్యారు. ఇంకా టికెట్ కన్ఫం కాకపోయినా మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. 
  • కాంగ్రెస్ సీనియర్ నేత అడ్లూరి లక్ష్మణ కుమార్ ఇప్పటికీ నాలుగుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓడిపోయారు. అయితే 2009లో 1484 ఓట్ల తేడాతో ఓడిపోగా, 2018లో కేవలం 441 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. 2018 ఎన్నికల కౌంటింగ్ లో  అక్రమాలు జరిగాయంటూ ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. నాలుగుసార్లు ఓడిపోయినా ఆయన ప్రజల్లో ఉంటున్నారనే పేరుంది. దీంతో మరోసారి కాంగ్రెస్ టికెట్ ఆయనకే కన్ఫమైంది. దీంతో లక్ష్మణ కుమార్ ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
  • బీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీనర్సింహారావు 2009, 2014లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2018లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలవాలన్న కల నెరవేరలేదు. దీంతో ఈసారి బీఆర్ఎస్ లో చేరి వేములవాడ అభ్యర్థిగా నిలిచారు. మూడోసారైనా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 
  • ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్న  పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టారు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీగా తనకు సంతృప్తి లేదని, ఎమ్మెల్యేగా గెలవాలన్నదే తన లక్ష్యమని పలుమార్లు ప్రకటించిన ఆయన ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 
  • కరీంనగర్​ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో మానకొండూరు నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  పొత్తులో భాగంగా మానకొండూరు సీటు కాంగ్రెస్ కు కేటాయించడంతో 2018లో పోటీ చేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి.. ఇప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.  
  • కాంగ్రెస్ నేత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  2014లో రామగుండం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్  నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  కాంగ్రెస్  టికెట్ కేటాయించడంతో మరోసారి బరిలో నిలవబోతున్నారు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి నర్సింగారావు కోరుట్ల నియోజకవర్గం నుంచి 2014లో ఇండిపెండెంట్ గా , 2018లో కాంగ్రెస్ నుంచి  పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతిలో  ఓడిపోయారు. కాంగ్రెస్ టికెట్  దక్కితే  మరోసారి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

ALS0 READ: ఇప్పటికే అసంతృప్తులు..కొత్తగా బీసీ నినాదం.. రసవత్తరంగా గజ్వేల్​ రాజకీయం