టికెట్​ కోసం ఢిల్లీ బాట.. బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్​ కసరత్తు

టికెట్​ కోసం ఢిల్లీ బాట.. బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్​ కసరత్తు
  • ఛాన్స్​కోసం ముమ్మర ప్రయత్నాలు
  • టఫ్​ఫైట్​ ఇచ్చేవారిని బరిలో దింపాలని యోచిస్తున్న అధిష్టానం

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ టికెట్​ఆశిస్తున్న జిల్లాకు చెందిన పలువురు నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఛాన్స్​కోసం ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సారి అధికారంలోకి వస్తామని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్, అధికార పార్టీకి టఫ్​ఫైట్​ఇచ్చే నేతలను బరిలో దింపాలనే ఆలోచనతో ఉంది. ఆశావహుల బలాబలాలు, స్థానికంగా ప్రజల్లో వారికున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుంటుంది. 

కామారెడ్డి లో పోటీ చేసే అభ్యర్థి విషయంలో ఇప్పటికే స్పష్టత రాగా, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​ నియోజకవర్గాల్లో పోటీ చేసేది ఎవరనేది ఇంకా తేలలేదు. పార్టీ శ్రేణులు కూడా ఎవరికి టికెట్ వస్తుందోననే ఉత్కంఠతో ఉన్నారు. ఆశావహులు ఎవరికి వారే టికెట్​పై ధీమాతో ఉన్నారు. తమ నేతకే టికెట్​వస్తుందంటూ వారి అనుచరులు స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో  కాంగ్రెస్ ​పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న షబ్బీర్​అలీ నాలుగు రోజుల కింద ఢిల్లీకి వెళ్లారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ​నియోజకవర్గాల అభ్యర్థిత్వాల ఖరారు విషయమై ఆయన ముఖ్యనేతలతో సంప్రదింపులు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఎల్లారెడ్డిలో పట్టువీడని నేతలు

ఎల్లారెడ్డి టికెట్ కోసం మదన్​మోహన్​రావు, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి పట్టు వీడడం లేదు. అభ్యర్థిత్వం ఖరారు కోసం ఇక్కడ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. సుభాష్​రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి, జిల్లా ముఖ్య నేత షబ్బీర్​అలీని నమ్ముకోగా, కె.మదన్​మోహన్​రావు ఢిల్లీ పెద్దలపై భరోసా ఉంచారు. వీరిద్దరు కూడా ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. నియోజకవర్గంలో తమ బలబలాలను ముఖ్య నేతలకు వివరించారు. ఒకరిని పార్లమెంట్​కు లేదా పక్క నియోజకవర్గానికి వెళ్లాలనే ప్రతిపాదన వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇద్దరు కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తామని స్పష్టం చేసినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. 

బాన్సువాడలో బలమైన అభ్యర్థి కోసం 

బాన్సువాడ లో బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది.అధికార బీఆర్ఎస్​పార్టీ నుంచి స్పీకర్​ పోచారం బరిలో నిలవనున్నారు. ఇక్కడ కాంగ్రెస్​పార్టీ నుంచి టికెట్​ఆశిస్తూ 16 మంది అప్లికేషన్లు​పెట్టుకున్నారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని బలమైన క్యాండెట్​ను బరిలో దింపాలనే వ్యూహంతో ముఖ్య నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 

జుక్కల్​లో ముగ్గురు.. 

జుక్కల్​లో ముగ్గురు కాంగ్రెస్​ టికెట్​ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, ఎన్ఆర్ఐ లక్ష్మీకాంత్​రావు, మరో నేత గడుగు గంగాధర్​టికెట్​రేసులో ఉన్నారు. ఢిల్లీ, స్టేట్​ నేతల ద్వారా ఎన్ఆర్ఐ తన అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు తనకే టికెట్ఇవ్వాలని గంగారం గట్టిగా పట్టుబడుతున్నారు.