వరంగల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్..రేసులో ముగ్గురు నేతలు

వరంగల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్..రేసులో ముగ్గురు నేతలు
  • కాంగ్రెస్  పార్టీలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురి పేర్లు 
  • రెడ్డి సామాజికవర్గం లేదంటే ఎస్టీ కోటాలో అవకాశం
  • ఎమ్మెల్యే నాయిని, ఎంపీ బలరాం నాయక్‍, బెల్లయ్య నాయక్‍
  • పార్టీలోనూ సముచిత గౌరవం దక్కనుందని ప్రచారం

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు జిల్లాకు అధికార కాంగ్రెస్‍ పార్టీ మరోసారి ప్రాధాన్యం ఉన్న పోస్టు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పోస్టు కోసం జిల్లాకు చెందిన పలువురు నేతలు ముందువరుసలో ఉన్నారు.  హస్తం పార్టీ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి నాలుగు వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ  నేపథ్యంలో రెడ్డి, ఎస్టీ కోటాలో ఓరుగల్లుకు చెందిన ముగ్గురు సీనియర్‍ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కనీసం ఒక్కరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కడం ఖాయమని అంటున్నారు.
 
కాంగ్రెస్‍ ప్రభుత్వంలో.. ఓరుగల్లు హవా

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా గతంలో ములుగు నియోజకవర్గం నుంచి ధనసరి సీతక్క తప్పితే.. మిగతా 11చోట్ల బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేలే ఉన్నారు. అప్పట్లో హస్తం పార్టీ నుంచి సీతక్కతో పాటు భూపాలపల్లి నుంచి గండ్ర వెంకట్రామణరెడ్డి గెలిచినా గులాబీ గూటికి చేరడంతో సీతక్క ఒక్కరే మిగిలారు.  2023 ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్‍ రివర్స్ అయి కాంగ్రెస్‍ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు  గెలవగా బీఆర్‍ఎస్‍ నుంచి జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్‍ ఘన్‍పూర్‍ నుంచి కడియం శ్రీహరి గెలిచారు. కడియం హస్తం గూటికి చేరారు. వరంగల్‍, మహబూబాబాద్‍ ఎంపీలుగా అప్పట్లో బీఆర్‍ఎస్‍ పార్టీకే చెందిన పసునూరి దయాకర్‍, మాలోతు కవిత ఉండగా.. గతేడాది పార్లమెంట్‍ ఎన్నికల్లో ఈ రెండుచోట్ల నుంచి కడియం కావ్య, బలరాం నాయక్‍ రూపంలో కాంగ్రెస్‍ పార్టీనుంచే ప్రాతినిధ్యం ఉంది. దీంతోపాటు గ్రేటర్‍ మేయర్‍, ఎమ్మెల్సీలు హస్తం వైపు వెళ్లడంతో ప్రభుత్వంలో ఓరుగల్లు నేతల ప్రాతినిధ్యం పెరిగింది. 

రెడ్డి కోటాలో ముందు వరుసలో.. నాయిని 

రాష్ట్ర కాంగ్రెస్‍ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి నలుగురిని వర్కింగ్‍ ప్రెసిడెంట్‍గా నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాయిని ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని 30 ఏండ్లకు పైగా పార్టీ అభివృద్ధి కోసం శ్రమించారు. పార్టీ ఉమ్మడి వరంగల్‍ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. ఓరుగల్లు ఆరు జిల్లాలుగా విడిపోయిన క్రమంలో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఉద్యమం సమయంలో..ఆపై ఓరుగల్లులో బీఆర్‍ఎస్‍ హవా నడిచిన సమయంలోనూ రాజేందర్‍రెడ్డి పార్టీని వీడలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‍ పార్టీ అధికారంలోకి వచ్చాక సైతం.. విపక్షాలు చేసే కామెంట్లకు అంతేస్థాయిలో తిప్పికొట్టే నేతగా రాష్ట్రస్థాయిలో నాయిని గుర్తింపు తెచ్చుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం  నాయినితో పాటు  భువనగిరి ఎంపీ చామల కిరణ్‍కుమార్‍ రెడ్డి, గ్రేటర్‍ హైదరాబాద్‍ నుంచి ఖైరతాబాద్‍ డీసీసీ ప్రెసిడెంట్‍ రోహిణ్‍రెడ్డి పోటీలో ఉన్నట్లు తెలుస్తుండగా.. వీరిలో నాయిని సీనియర్‍గా ఉన్నారు. 

ఎస్టీ కోటాలో..  బలరాం నాయక్‍, బెల్లయ్య నాయక్‍

ఎస్టీ కోటాలో వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పదవి కేటాయించే క్రమంలోనూ ఓరుగల్లు నుంచే ఇద్దరు సీనియర్‍ నేతలు ముందువరుసలో ఉన్నారు. ప్రస్తుత మహబూబాబాద్‍ ఎంపీ బలరాం నాయక్‍తో పాటు వరంగల్‍ జిల్లా ఖానాపూర్‍ మండలానికి చెందిన రాష్ట్ర గిరిజన డెవలప్‍మెంట్‍ ఫైనాన్స్‍ కార్పొరేషన్‍ చైర్మన్‍గా వ్యవహరిస్తున్న తేజావత్‍ బెల్లయ్య నాయక్‍ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఒక దశలో పీసీసీ పదవి బలరాం నాయక్ కు లభించవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే బీసీ కోటాలో మహేశ్‍ కుమార్‍ గౌడ్‍కు దక్కడంతో ఎస్టీ కోటాలో వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పోస్ట్‍ బలరాం నాయక్‍కు దక్కుతుందని ఆయన కేడర్‍ నమ్ముతోంది. పోటీ తప్పదనుకుంటే ఓరుగల్లుకే చెందిన లంబాడ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షునిగా, హస్తం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తన గళం వినిపించిన బెల్లయ్య నాయక్‍ లైన్‍లో ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్‍ పార్టీ కేటాయించబోయే నాలుగు వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పోస్టుల్లో ఓరుగల్లుకు ఒక్క పదవి పక్కాగా దక్కుతుందని పార్టీలో చర్చ నడుస్తోంది.