నాగార్జున సాగర్‌‌పై  బడా బాబుల ఫోకస్!

  • ఎమ్మెల్యే నోముల భగత్‌కు చెక్‌ పెట్టేందుకేనని టాక్
  •   బరిలో అల్లు అర్జున్​ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, 
  •  బుసిరెడ్డి ఫౌండేషన్​ చైర్మన్​ పాండురంగారెడ్డి 
  •  బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మనవడు రంజిత్

నల్గొండ, వెలుగు : నాగార్జునసాగర్​ నియోజకవర్గంపై బడా బాబులు ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్​ మామ డాక్టర్​ కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి, బుసిరెడ్డి ఫౌండేషన్​చైర్మన్​ పాండురంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్‌‌ మనవడు రంజిత్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  

కాగా, ఎమ్మెల్యే నోముల భగత్‌‌కు చెక్‌‌ పెట్టేందుకే వీరిని తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఇప్పటికే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం తమకే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా వ్యాపార, విద్యావేత్తలు దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. 

సర్వేలను అనుకులంగా మల్చుకుంటున్నరు

బీఆర్‌‌‌‌ఎస్‌‌ హైకమాండ్ సిట్టింగ్‌‌లకు టికెట్లు ఇస్తామని చెప్పినా... ఫీల్ట్‌‌ లెవల్‌‌ పరిస్థితులపై సర్వేలు చేయిస్తోంది. సిట్టింగ్​లనే నమ్ముకుంటే నిండా మునిగిపోతామనే భయంతో పార్టీలో బలమైన నాయకులు ఎవరున్నారనే దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది.  ఇప్పటిదాకా జరిగిన సర్వేల్లో పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉందని తేలినా.. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనే మిశ్రమ స్పందన వ్యక్తమైనట్లు తెలిసింది.  

దీన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు స్థానిక ఆశవాహులేగాక, బయటి ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రముఖ వ్యాపార వేత్తలు, విద్యావేత్తలు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

విస్తృతంగా సేవా కార్యక్రమాలు...

2014 ఎన్నికల నుంచి బీఆర్ఎస్ హైకమాండ్​ నాగార్జునసాగర్​ టికెట్‌‌ను బీసీ సామాజిక వర్గానికే కేటాయిస్తోంది. 2018లో గెలిచిన సిట్టింగ్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించాక ఆ స్థానాన్ని ఆయన కొడుకు భగత్‌‌తో భర్తీ చేశారు.  కానీ,  ప్రస్తుతం బలమైన నాయకులు రంగంలోకి దిగేందుకు సిద్ధపడటం పార్టీలో కాక పుట్టిస్తోంది.  సాగర్‌‌‌‌ సీటుపై కన్నేసిన పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన కంచర్ల చంద్రశే ఖర్​ రెడ్డి  ‘కంచర్ల’ పౌండేషన్​ పేరుతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.  ప్రభుత్వ స్కూల్స్‌‌లో 9,10 తరగతి విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు.  

పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఫంక్షన్​ హాల్​తోపాటు, పార్టీ వ్యవహారాలు నడిపించేందుకు పెద్ద బిల్డింగ్​ నిర్మిస్తున్నారు. 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్​ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన చంద్రశేఖర్​రెడ్డి అక్కడి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సాగర్‌‌‌‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఛాన్స్ లభించకపోతే నల్గొండ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ నుంచి మిర్యాలగూడలో పోటీ చేయాలని భావించారు.  జిల్లా నేతలతో మంచి సంబంధాలు ఉన్న ఆయన ఎంపీగా పోటీ చేయాలని కూడా అనుకున్నారు. అవన్నీ సాధ్యపడకపోవడంతో సొంత సెగ్మెంట్‌‌పై ఫోకస్​పెట్టారు. 

ఓవైపు రంజిత్​ యాదవ్​ మరోవైపు బుసిరెడ్డి...

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్​ మనవడు మన్నెం రంజిత్​ కుమార్​ యాదవ్(ఎన్​ఆర్​ఐ) నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. యూత్​ను ఆకట్టుకునే క్రమంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతు న్నారు. సాగర్​ బైపోల్​ టైంలోనే రంజిత్ పేరు తెరపైకి వచ్చింది.  తన వ్యాపారాలన్నీ పక్కన పెట్టి సాగర్‌‌‌‌లోనే మకాం పెట్టారు.  మరోవైపు క్రె డాయ్​ రాష్ట్ర వైస్​ ప్రెసిడెంట్‌‌, తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.  

ఇప్పటికే బుసిరెడ్డి ఫౌండేషన్ పేరుతో స్కూల్‌‌ పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఆయన  ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు, జూట్ బ్యా గులు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి సన్నిహితుడు కావడం బుసిరెడ్డికి కలిసొచ్చే అంశమని కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. 

భగత్‌ను దెబ్బతీస్తే యత్నం

సాగర్​బీఆర్‌‌ఎస్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న ఆ పార్టీ సీనియర్లు..  భగత్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే రోజుకో పేరు తెరపైకి తెస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు.  పార్టీ హైకమాండ్ భగత్​పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ.. కొందరు స్థానిక నేతలు ఆయనకు సహకరించడం లేదు. ఇందులోభాగంగానే  రాజకీయంగా ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి.  భగత్‌ స్థానికేతరుడు అన్న అంశాన్ని తెరపైకి తేవడం ఇందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది.