యాదాద్రి, వెలుగు తెలిసీతెలియని వయస్సులో ప్రేమ పేరుతో చాలా మంది మైనర్లు ఆగమవుతున్నారు. పెద్దలతో గొడవలు పడుతున్నారు. ఇంట్లో నుంచి పారిపోతున్నారు. అబార్షన్లు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందరో పిల్లలు అనాథలు అవుతున్నారు. దీనికి కారణం సరిగాలేని కొంతమంది పెద్దల ప్రవర్తన చూసి పిల్లలూ పాటించడం, అలాగే సోషల్ మీడియా ఎఫెక్ట్తోపాటు వారికి అవగాహన కల్పించేవారు లేకపోవడమేనని తెలుస్తోంది. ఫలితంగా యాదాద్రి జిల్లాలో ఎన్నో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ప్రతినెలా మూడు నుంచి ఐదు జంటల చొప్పున ఏడాదికి దాదాపు 50 మైనర్ జంటలు ప్రేమ పేరుతో పారిపోతున్నాయి.
మిస్సింగ్, ఆత్మహత్యల కేసుల్లో వివాహేతర సంబంధాలు, మైనర్ ప్రేమ వ్యవహారాలే ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 2020లో మొత్తంగా 292 మంది మిస్సింగ్ అయ్యారు. వీరిలో 286 మందిని పోలీసులు పట్టుకోగలిగారు. 2021లో 286 మంది మిస్సింగ్ అయితే వీరిలో 283 మంది జాడ కనుగొన్నారు. 2022లో 363 మంది మిస్సింగ్ కాగా వీరిలో 340 మందిని పోలీసులు ట్రేస్ చేయగలిగారు. మరో 23 మంది అడ్రస్ దొరకలేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 వరకు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 2015 నుంచి ఇప్పటివరకు దాదాపు 1300 మంది వివిధ కారణాలతో సూసైడ్ చేసుకుంటే.. అందులో ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న మైనర్లు కూడా ఉన్నారు. అయితే మైనర్ల ఆత్మహత్యలను ఎక్కువ మంది కుటుంబ సభ్యులు పరువు పోతుందన్న కారణంతో ఇతర కారణాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం..
చాలా మందిపై సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితి కరోనా సమయం నుంచి ఇంకా ఎక్కువైంది. ఆకర్షణనే ప్రేమగా భావించుకొని, తామే నిజమైన ప్రేమికులమని దేనికైనా సిద్ధమంటూ తెగిస్తున్నారు. కొందరు బాలికలను ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతులను చేసి వదిలేస్తున్నారు. ఆ తర్వాత అబర్షన్లు చేయించుకుంటున్నారు. సాధ్యం కాకుంటే పుట్టిన పిల్లలను రోడ్డు పక్కన వదిలేసిపోతున్నారు. దీంతో ఆ చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. మరికొందరు పెండ్లి పేరుతో తల్లిదండ్రులను వదిలి పారిపోతున్నారు.. ఇంకొందరు పెద్దలకు చెప్పలేక, ప్రేమికుల చేతులో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.
పెద్దోళ్ల వ్యవహార శైలి సరిగా లేక..
కొంతమంది ఇంట్లోని పెద్దవాళ్లు, పక్కింటివారి వ్యవహార శైలి సరిగా లేక కూడా పిల్లలు పక్కదారిపడుతున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, పిల్లల ముందే తిట్టుకోవడం, కొట్టుకోవడం చేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపడం లాంటివి చేస్తున్నారు. పిల్లల ముందే ఫోన్లల్లో ఇతర వ్యక్తులతో ముచ్చట్లు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలు గొడవలకు దారితీస్తున్నాయి. ఇలాంటివన్నీ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపి వారు పక్కాదారి పట్టేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
పిల్లలను గమనించండి
సోషల్ మీడియా అకౌంట్లలోని వ్యక్తుల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటోంది. అపరిచిత వ్యక్తులు పిల్లలపై ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. అదంతా నిజమైన ప్రేమ అనే భ్రమలో పిల్లలు పడిపోతుంటారు. ఎక్కడ చేయి దాటిపోతారో... అనే భయంతో చిన్నతనంలో పెండ్లిళ్లు చేయొద్దు. ఎన్ని పనులు ఉన్నా పిల్లలను, వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. వారికి మంచి చెడులపై అవగాహన కల్పించాలి.
పీ.సైదులు, డీసీపీవో
పరువు పేరుతో మైనర్లకు పెండ్లిళ్లు
పిల్లల ప్రేమ వ్యవహారాన్ని గమనించిన కొంతమంది పెద్దలు, పరువు పోతుందన్న భయంతో మైనర్లకు పెండ్లి చేయడానికి సిద్ధమవుతున్నారు. పెండ్లిని కొందరు మైనర్లు వ్యతిరేకిస్తే.. మరికొందరు మౌనంగా ఉండిపోతున్నారు. గడిచిన నాలుగేండ్లలో గుట్టుచప్పుడు కాకుండా వందల మంది మైనర్లకు పెండ్లిళ్లు జరిగాయి. 2019 నుంచి ఇప్పటివరకూ 95 మంది మైనర్ల పెండ్లిండ్లను చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఆపగలిగింది.