తెలంగాణ ఎన్నికల బరిలో మస్తు పార్టీలు

తెలంగాణ ఎన్నికల బరిలో మస్తు పార్టీలు

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ మొన్నటి ఖమ్మం చంద్రబాబు సభతో టీడీపీ హఠాత్తుగా యాక్టివ్ గా మారగా, కేజ్రీవాల్​ ఆమ్​ఆద్మీ పార్టీ, రిటైర్డ్​ ఐపీఎస్​ నేతృత్వంలోని బీఎస్పీ, షర్మిల వైఎస్సార్టీపీ, లెఫ్ట్​పార్టీలు.. ఇలా అనేక పార్టీలో ప్రజా క్షేత్రంలో కదులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. భారతదేశంలో చిన్న పార్టీలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి కూడా. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, కేరళ, తమిళనాడుల్లో చిన్న పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగంగా ఉన్నాయి. కేరళ, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ & అస్సాం రాష్ట్రాల్లో డజన్ల కొద్ది క్రియాశీల చిన్న పార్టీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న చిన్న రాష్ట్రం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 60 మంది ఎమ్మెల్యేలు కావాలి. కాబట్టి ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకున్న చిన్న పార్టీ అయినా ఒక్కోసారి కింగ్ మేకర్ అవుతుంది. తెలంగాణలో ఒవైసీ ఎంఐఎంకు ఉన్నది 7 మంది ఎమ్మెల్యేలే. కానీ ప్రభుత్వం ఏది వచ్చినా దానిది మాత్రం అసమాన శక్తే. తెలంగాణలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీలు, ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చినవారు కూడా ఇక్కడ ఉన్నారు. సాఫ్ట్‌‌వేర్ రంగం, ఇతర పారిశ్రామిక, నిర్మాణ రంగాల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్​అయిన ప్రజలు ఉన్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ, రాజధాని హైదరాబాద్ దేశంలోనే చాలా పెద్ద ఆర్థిక శక్తి. అయితే హైదరాబాద్ పెరుగుతున్న కొద్దీ రాజకీయంగా సంప్రదాయ పార్టీలు ప్రజలపై పట్టు కోల్పోతున్నాయి. నాయకులు ప్రజలపై ఆధిపత్యం చెలాయించేది గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో మాత్రమే. చిన్న రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ల్లో పొలిటికల్‌‌ స్పేస్‌‌ లేకపోవడంతో బీజేపీ కొంత వేగంగానే అభివృద్ధి చెందింది. తమ ప్రాతినిధ్యం లేని ఆయా వర్గాల ప్రజలు రాజకీయ పాత్రను కోరుకుంటున్న సందర్భంలో కొత్త పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి.  హైదరాబాద్‌‌ చుట్టూ ఉన్న భూములు కోట్లకు పడగలెత్తడంతో రాష్ట్రంలో చాలా మంది ధనవంతులయ్యారు. వారికి సామాజిక హోదా,  రాజకీయ పదవులు పొందడం కావాలి. అటువంటి కొత్త సంపన్నులు పోటీ చేయడానికి చిన్న పార్టీల వైపు చూస్తున్నారు. 

మనుగడ సాగిస్తాయా?

తెలంగాణలో చిన్న పార్టీలు మనుగడ సాధించేది లేనది.. వాటి పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. చిన్న పార్టీలకు తొలి ఎన్నికలు అత్యంత కీలకం. అందులో ఘోరంగా విఫలమైతే, ప్రజా, రాజకీయ క్షేత్రం నుంచి వాటికి వీడ్కోలు తప్పదు. కేజ్రీవాల్ కొత్త రాజకీయ పార్టీ తన మొదటి ఎన్నికల్లో ఢిల్లీని గెలిపించింది. తెలుగుదేశం పార్టీకి పెద్ద పేరు ఉన్నప్పటికీ తెలంగాణలో ఎన్నికల కోసం మిత్రపక్షాలను వెతక్క తప్పదు.10 % ఓట్లు, సున్నా సీట్లు వచ్చినా ప్రయోజనం లేదు. అందుకే, చంద్రబాబు నాయుడు తన సత్తా చూపాలంటే మిత్రపక్షాలు కావాలి. మరోవైపు షర్మిల, ప్రవీణ్​కుమార్​కూడా మిత్రపక్షాలను వెతుక్కొని మంచి ఫలితం రాబట్టడంపై కసరత్తు చేయాలి. లేదంటే మనుగడ సాధించడం కష్టమవుతుంది. సాధారణంగా కేజ్రీవాల్​ఆప్​,  ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తీవ్రంగా పోటీ చేయదు. కాబట్టి ఆ పార్టీకి తెలంగగాణలో పోటీ బాగా ఉంటుంది. పవన్​కల్యాణ్ ​ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది. ఆయన ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, ఓట్లను బదిలీ చేయవచ్చు.1994లో బీఎస్పీకి చెందిన కాన్షీరామ్ 30 మంది యూపీ మంత్రులతో హైదరాబాద్ వచ్చి పెద్ద సంచలనం సృష్టించారు. వెంటనే ఎన్టీఆర్ తనకు 50 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేశారు. కానీ కాన్షీరామ్ ఎన్టీఆర్ ను తిరస్కరించారు. అయితే బీఎస్పీ1994లో ఆంధ్ర ఎన్నికల్లో కోలుకోలేని స్థాయిలో తుడిచిపెట్టుకుపోయింది. చిన్న పార్టీలు జిత్తులమారిగా ఉండాలి, అత్యాశతో ఉండకూడదు. 

చిన్న పార్టీలకు మంచి అవకాశం

టీడీపీతో సహా చిన్న పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఓడిపోతే.. అదే వాటి అంతం. అందుకే ఏదో ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకున్నా ఓడిపోతే, అవసరమైతే వాటి భాగస్వామిని నిందించవచ్చు. గెలిస్తే విజయం తమదేనని చెప్పుకోవడానికీ ఉంటుంది. స్థానాన్ని పదిలం చేసుకున్న నాయకులు పెద్ద పార్టీలను వదిలి తమతో చేరరని చిన్న పార్టీలు గమనించాలి. రెడ్డి, ఖమ్మం, వెలమ లేదా దళితులు పెద్ద పార్టీల్లో సౌకర్యవంతమైన కుర్చీలు కలిగి ఉన్నప్పుడు చిన్న పార్టీల్లో ఎలా చేరతారు? కానీ పొత్తులు పెట్టుకుంటే, అంతా కలిసి దూసుకువెళ్లొచ్చు. ఉత్తరప్రదేశ్‌‌లో చంద్రశేఖర్ రావణ్​ని మీడియా చాలా హైప్​చేసింది. ఆయన తదుపరి కాన్షీరామ్ అంటూ కొనియాడింది. అయితే గత యూపీ ఎన్నికల సమయంలో ఆయనతో ఎవరూ పొత్తు పెట్టుకోకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి 2% ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు రావణ్‌‌ని ఎవరూ సీరియస్‌‌గా తీసుకోవడం లేదు. గొప్ప రాజకీయ నాయకుడు అయిన కామరాజ్ నాడార్ ఎప్పుడూ ‘పర్కలం’ అంటుండే వారు, దాని అర్థం వేచి చూద్దాం అని.

పెద్ద పార్టీలపై ప్రభావం ఎంత?

తెలంగాణలో కేసీఆర్​అధికార బీఆర్​ఎస్ పార్టీ సహా కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలపై  చిన్న పార్టీలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి.  కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ, ఆయన హైపర్ పాలిటిక్స్ వల్ల ఎక్కువ ఎక్స్‌‌పోజర్ తో ప్రజలు విసిగిపోయారు. కాబట్టి తెలుగుదేశం, ఇతర చిన్న పార్టీలు కేసీఆర్ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంది. కేసీఆర్‌‌కు ఇది ప్రతికూల అంశం కాబట్టి ఆయన.. ఓట్ల బదిలీ సామర్థ్యం ఉన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించవచ్చు. కొత్త పార్టీలు అధికార పార్టీపై దాడి చేయడంతో కేసీఆర్ వారితో పొత్తు పెట్టుకుని దోస్తీ కట్టే చాన్స్​ఉన్నది. ‘నేను శత్రువులను మిత్రులుగా చేసుకోవడం ద్వారా వారిని నాశనం చేస్తాను’ అని అబ్రహం లింకన్ అన్నట్లుగా కేసీఆర్ చేయగలరా? కేసీఆర్‌‌పై సహజంగానే కాంగ్రెస్‌‌కు వ్యతిరేకత ఏర్పడింది. కానీ ప్రజలకు దగ్గర కావడం లేదు. గాంధీల పేర్లకు ఓట్లు పడటం లేదు. అందుకే కాంగ్రెస్ దూకుడుగా ఉన్న చిన్న పార్టీలను మిత్రపక్షాలుగా చూసుకోవాలి. తెలంగాణ 2 పార్టీల రాష్ట్రంగా మిగిలిపోతే, కాంగ్రెస్‌‌కు ఆందోళన లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయ కేసీఆర్ పార్టీ ఆధిపత్యంలో బహుళ పార్టీల రాష్ట్రం. సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ కు మిత్రపక్షాల కోసం వేట తప్పదు. 2018 నుంచి తెలంగాణలో బీజేపీ బాగా పెరిగింది. కొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకే లాభం. చిన్న పార్టీలకు నిర్దిష్ట కుల, -ప్రాంత, బలం ఉంటుంది. సందర్భాలను బట్టి అవి కూడా మంచి ప్రభావం చూపుతాయి. పొత్తులు బీజేపీ ప్రతిష్టను మెరుగుపరుస్తాయి.

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్​