- పట్టించుకొని ఆఫీసర్లు
కోల్బెల్ట్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో కబ్జాదారులు సింగరేణి ల్యాండ్ ను ఆక్రమించి దర్జాగా బిల్డింగులు కడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడంలేదు. కంప్లైంట్ రాగానే హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సీసీసీ నస్పూర్ ప్రెస్ క్లబ్ వెనకాల సింగరేణి భూమిలో ఇల్లు నిర్మిస్తున్నారని గత ఫిబ్రవరిలో ఆఫీసర్లు హడావుడి చేసి కొలతలు పెట్టి అక్కడ ఫెన్సింగ్ వేసి వదిలేశారు. ప్రస్తుతం అక్కడ ఫెన్సింగ్లేదు. ఇంటి పనులు సాగుతున్నాయి.
సంగమల్లయ్య పల్లెలో ఒక బిల్డింగ్, కృష్ణకాలనీలో ఓ ఇంటి నిర్మాణం కూడా యథేచ్ఛగా నడుస్తోంది. కార్మికులకు కేటాయించిన క్వార్టర్ల ముందు చిన్న ప్రహరీలు నిర్మిస్తే వెంటనే తొలగించే ఆఫీసర్లు.. ఈ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కబ్జాదారుల వద్ద మామూళ్లు తీసుకోని అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విలువైన సింగరేణి భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.