కష్టజీవులపై ఎండదెబ్బ .. వడదెబ్బతో ఆదిలాబాద్ జిల్లాలో పలువురు మృతి

కష్టజీవులపై ఎండదెబ్బ .. వడదెబ్బతో ఆదిలాబాద్ జిల్లాలో పలువురు మృతి
  • తాజాగా ఇద్దరు డప్పు కళాకారులు 
  • ప్రతిరోజు 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు
  • మే నెలను తలుచుకుంటూ బేంబేలు

నిర్మల్, వెలుగు: ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలి జనం బెంబేలెత్తిపోతున్నారు. కొందరు మృత్యువాత పడుతున్నారు. ఎండదెబ్బతో నిర్మల్​జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు చనిపోగా ఆదివారం రాత్రి ఒకరు, సోమవారం ఉదయం మరొకరు చనిపోయారు. నిర్మల్ పట్టణంలోని కురన్నపేట వీధికి చెందిన డప్పు కళాకారులు నిగులపు శంకర్ (45), నిగులపు రాజు(40) ఆదివారం తమ వీధిలో పోచమ్మల పూజల కోసం డప్పులు వాయించి వడదెబ్బకు గురయ్యారు. ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​తీసుకుంటూ శంకర్ రాత్రి చనిపోగా రాజ సోమవారం ఉదయం మృతిచెందాడు. నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన చవాన్ కేశవ్ (60) సైతం సోమవారం వడదెబ్బతో చనిపోయాడు.

ఒకే నెలలో ఐదుగురు మృతి

ఈ నెల మొదటి వారంలో ముథోల్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి వీధికి చెందిన ఠాగూర్ పూజ(36) అనే మహిళ వడదెబ్బతో చనిపోయింది. పొలం పనులకు వెళ్లిన పూజ తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు నిజామాబాద్ హాస్పిటల్​కు తర లించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించింది. ఇటీవలే భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన కత్తిగమూళ్ల శంకర్ (52) అనే రైతు కూలీ  చనిపోయాడు. మొక్కజొన్న పంటకు నీరందిస్తూ ఎండదెబ్బకు పంట చేలోనే కుప్పకూలిపోయాడు. తాజాగా మరో ముగ్గురు 
మృత్యువాత పడ్డారు.

నర్సాపూర్ జి లో 43.9 డిగ్రీలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా ఎండలు తీవ్రతంగా ఉన్నాయి. ఉదయం 11 దాటితే సూర్యుడు మండిపోతున్నాడు. ఫలితంగా 41 నుంచి 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో సోమవారం ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. నర్సాపూర్ జి మండలంలో ఏకంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెంబి మండలంలో 43.8, కడెం పెద్దూరు మండలంలోని లింగాపూర్​లో 43.7, భైంసాలో 43.5, కుభీర్ మండలంలో 43.5, మామడలోని తాండ్రలో, తానూర్ మండలంలో 43.4, నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్​లో 43.3, దస్తురాబాద్ లో 43.2, మండలంలోని బుట్టాపూర్ లో 43.2, బాసర, ఖానాపూర్​లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు ఏప్రిల్​లోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకెంత త్రీవంగా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు.

12 గంటల్లోపే ఇండ్లకు చేరుకోవాలి 

ఎండ నుంచి రక్షించుకునేందుకు 12 గంటల్లోపే పనులు పూర్తిచేసుకొని ఇండ్లకు చేరుకోవాలి. అవసరమైతే మధ్యాహ్నం 3 తర్వాతే బయటకు వెళ్లాలి. పండ్ల రసాలు, ఓఆర్ఎస్, నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో వెళ్తే గొడుగు లేదా తలపై ఏదైనా కప్పుకోవాలి. చెమటలు పట్టడం, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలి.

డాక్టర్ ప్రత్యూష, మెడికల్ ఆఫీసర్, పీహెచ్ సీ