వికారాబాద్ జిల్లాలో కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత

వికారాబాద్ జిల్లాలో కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత

వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లాలో కలుషిత నీరు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధితులు జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. అస్వస్థతకు గురైన వారికి డాక్టర్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాలాల మండలం జుంటుపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో ఈ ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది చిన్నపిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న కొంతమందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. 

జుంటుపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో వైద్యాధికారులు ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కలుషిత నీరు సరఫరా అయ్యిందని, ఆ నీరే తాగడంతో చాలామంది తీవ్ర అస్వస్థతకు గురై విరేచనాలు, వాంతులు చేసుకుంటున్నారని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు గంట గంటకు బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఏమవుతుందోనని చాలామంది ఆందోళనకు గురవుతున్నారు.