- క్షేత్రస్థాయిలో లీకేజీల పై దృష్టి పెట్టని అధికారులు
- మాటలకే పరిమితమవుతున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో ఎండాకాలం తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పేలా లేవు. నగరంలో చాలాచోట్లా లీకేజీల వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిని అరికట్టడంపై అధికారులు పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ఫలితంగా నగరంలో చాలాచోట్లా లీకేజీల కారణంగా గ్రేటర్ కాలనీలు, విలీన గ్రామాల్లో తాగునీళ్లన్నీ రోడ్లపై పారుతున్నాయి. ఎండాకాలం దృష్ట్యా నగరంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా గ్రేటర్ అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నా.. పకడ్బందీ యాక్షన్ లేక అది కేవలం లీడర్లు, అధికారుల రివ్యూలకే పరిమితం అవుతోందనే ఆరోపణలున్నాయి.
66 డివిజన్లు.. వందల్లో లీకేజీలు
వరంగల్ నగర పరిధిలో 66 డివిజన్లు ఉండగా.. దాదాపు 2.25 లక్షల ఇండ్లున్నాయి. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిన తరువాత గ్రేటర్ వరంగల్ అమృత్ స్కీం కింద కన్వర్జన్స్ ఫండ్స్ తో నగరంలో రూ.630 కోట్లతో తాగునీటి సరఫరాకు సంబంధించిన వివిధ పనులు చేపట్టారు. నగరంలో 2017–18 ముందు వరకు 92 వాటర్ ట్యాంకులు, 27 కిలోమీటర్ల రా వాటర్ మెయిన్స్, 59.3 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్స్, దాదాపు 1,400 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు ఉండగా.. ఆ తరువాత అమృత్, మిషన్ భగీరథ స్కీం కింద కొత్తగా 33 వాటర్ ట్యాంకులు, 158 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్స్, 1,380 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేశారు.
పాత వాటితో కలిపి మొత్తంగా 2.15 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా గ్రేటర్ వరంగల్ లోని చాలా డివిజన్లలో లీకేజీల సమస్యలు వేధిస్తున్నాయి. నగరంలో ప్రతి డివిజన్ కు కనీసం పది లీకేజీలైనా వేధిస్తున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్న ప్రకారం నగరంలో 600 కు పైగా లీకేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. లీకేజీల కారణంగా రోజుల తరబడి నీళ్లు వృథాగా పోతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా లీకేజీల కారణంగా తాగునీరు కలుషితమవుతున్నా లైట్ తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఏండ్ల తరబడి ఇదే సమస్య
వరంగల్ నగరవ్యాప్తంగా రెండేండ్ల కిందట 5,952 లీకేజీలు గుర్తించి, జీడబ్ల్యూఎంసీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో 5,376 లీకేజీలను ఆఫీసర్లు అరికట్టారు. ఇంకొన్ని లీకేజీలు అలాగే ఉండగా.. పాత పైపులైన్ కారణంగా కొత్త లీకేజీలు కూడా ఏర్పడుతున్నాయి. వాస్తవానికి లీకేజీలను ఎప్పటికప్పుడు అరికట్టి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు, ఆ విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి.
జీడబ్ల్యూఎంసీని తాగునీటి పైపులైన్ల లీకేజీల సమస్య ఎంతోకాలం వేధిస్తుండగా.. గతేడాది కూడా ఇలాగే లీకేజీలు ఏర్పడటం, క్షేత్రస్థాయిలో చాలాచోట్లా పైపులైన్లు పగిలిపోవడం, ధర్మసాగర్, వడ్డేపల్లి, దేశాయిపేట ఫిల్టర్ బెడ్ లలో కూడా సాంకేతిక సమస్యల కారణంగా వేసవికి ముందే తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో జనాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడగా.. విషయం అప్పటి మున్సిపల్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు రిటైర్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్ రవికుమార్ ను అప్పటికప్పుడు వరంగల్ పంపించి, వారం రోజుల పాటు స్టడీ చేయించారు. ఈ మేరకు ఆయన ఆఫీషియల్ గా రిపోర్ట్ తయారు చేసి, ప్రభుత్వ పెద్దలకు అందించారు. కానీ ఆ తరువాత అక్కడక్కడ లీకేజీలు అరికట్టడం తప్ప పెద్దగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. పనులు కూడా చేపట్టింది లేదు. దీంతో వరంగల్ లో లీకేజీల సమస్య అక్కడే ఉండిపోయింది.
మేల్కొకపోతే ముప్పే
నగరంలో లీకేజీల సమస్యతో పాటు వాల్వ్ ల రిపేర్లు, ఫిల్టర్ బెడ్ ల మెయింటెనెన్స్ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో తరచూ కాలనీలకు నీటి సరఫరా నిలిపేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య వరంగల్ అండర్ రైల్వే జోన్ కు తరచూ ఎదురవుతోంది. ఫలితంగా వరంగల్ నగరంలో డైలీ వాటర్ సప్లై సిస్టం మాటలకే పరిమితం అవుతోంది. అంతేగాకుండా ఏటా సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరున హడావుడి చేస్తున్న అధికారులు ఆ తరువాత సమస్యను లైట్ తీసుకుంటున్నారు.
దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తీరడం లేదు. గతేడాది కూడా ఇదే జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే ఇంకొద్దిరోజుల్లోనే ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండగా.. పైపు లైన్ లీకేజీలు, వాల్వ్‌ల రిపేర్లు, ఇతర సమస్యలను పరిష్కరించకపోతే జనాలకు తాగునీటి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. ఇకనైనా గ్రేటర్ ఉన్నతాధికారులు నగరంలో తాగునీటి సరఫరాకు సమ్మర్ యాక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.