సీఎంను చేస్తాం పార్టీలోకి రమ్మన్నరు

సీఎంను చేస్తాం పార్టీలోకి రమ్మన్నరు
  • పొలిటికల్ ఆఫర్లన్నీ తిరస్కరించా: సోనూసూద్

న్యూఢిల్లీ: " మీరు మా పార్టీలోకి వస్తే సీఎంను చేస్తాం" అని కొన్ని పార్టీలు తనకు ఆఫర్ ఇచ్చినట్లు నటుడు సోనూసూద్ వెల్లడించారు. కానీ, ఆ ఆఫర్లన్నింటినీ తాను తిరస్కరించినట్లు తెలిపారు. అందుకు గల కారణాలను ఇటీవల ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ వివరించారు. " మంచి పేరున్న నేతలు కొందరు నాకు సీఎం పదవిని ఆఫర్ చేశారు. దాన్ని నేను తిరస్కరించాను. 

ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని, రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేశారు.  మీరు ఎన్నికల్లో ఓట్ల కోసం పోరాడాల్సిన అవసరం లేదు. కేవలం మా పార్టీలో చేరండి అని అడిగారు. కానీ ఆ పొలిటికల్ ఆఫర్లన్నింటినీ నిరాకరించాను. దేశంలోనే శక్తివంతమైన వ్యక్తులు కొందరు.. మా పార్టీలో చేరండని.. ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి తమను ప్రోత్సహించాలని కోరడం నన్ను  ఎంతో ఉత్తేజ పరిచే విషయమే. కానీ, నా స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం చాలా మంది రాజకీయాల్లో చేరతారు. 

వాటిలో దేనిపైనా నాకు ఆసక్తి లేదు. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలంటరా? ప్రస్తుతం నేను అదే పని చేస్తున్నాను. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటే ఇప్పుడు నేను ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడిగా సాయం చేయాల్సి వస్తే నేను మరొకరికి జవాబుదారీగా ఉండాలి. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇతరులకు సహాయం చేసే స్వేచ్ఛను నేను ఇష్టపడతాను. ప్రజాదరణ పొందుతున్న వారు జీవితంలో ఎదగడం ప్రారంభిస్తారు. నిజానికి ఎత్తయిన ప్రదేశాల్లో ఆక్సిజన్ ఉండదు. మనం ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. కానీ, అక్కడ ఎంతకాలం ఉంటామనేదే చాలా ముఖ్యం" అని సోనూసూద్  పేర్కొన్నారు.