కాంగ్రెస్ నేత దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరితే.. రివర్స్‌లో ఆయనపైనే బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేయడం దారుణమని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 65 సెంటీమీటర్ల వర్షం పడిందని, అదే వర్షం హైదరాబాద్‌లో పడి ఉంటే సముద్రంలా మారేదన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సిటీలో చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయన్నారు.
2014కు ముందు చెరువుల పరిస్థితి.. ఇప్పటి పరిస్థితిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రం వచ్చాక చెరువులు కబ్జాకు గురైన విషయాన్నే రేవంత్ ప్రస్తావించారని అన్నారు. మూసీ నదిలో గడ్డి తొలగింపు పేరిట రూ.కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. దాసోజు శ్రవణ్ పార్టీలు మారినట్టుగా చెరువుల ఆక్రమణలకు సంబంధించిన లెక్కలు మారవని ఎద్దేవా చేశారు. చెరువుల కబ్జా కారణంగానే గచ్చిబౌలిలో భారీ వరదలు వచ్చి కార్లు నీటిలో తేలాయన్నారు.