మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి

  • న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు: జస్టిస్ హిమా కోహ్లీ

  • అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిన్రు?

  • చైల్డ్, ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జీలే నిర్వహించాలా?

  • బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష హేయమైన చర్య

  • కేసులు చూసి తీర్పు ఇవ్వాలి.. ముఖాలు చూసి కాదు..

  • జడ్జీలు కూడా మనుషులే.. తప్పులు చేయడం సహజమని వ్యాఖ్య


న్యూఢిల్లీ: జ్యుడీషియరీ సిస్టమ్​లోనూ మహిళా జడ్జీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. ఇక నుంచి మహిళా న్యాయమూర్తులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1980 కాలంలో జడ్జీలు అయ్యేందుకు మహిళలు చాలా కష్టపడేవారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు హిస్టరీలో తొమ్మిదో మహిళా న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ హిమా కోహ్లీ.. ఇటీవల పదవీ విరమణ పొందారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో మొదటి మహిళా జడ్జిగానూ ఆమె సేవలందించారు. న్యాయ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమా కోహ్లీ సంచలన కామెంట్లు చేశారు. ‘‘జ్యుడీషియరీ సిస్టమ్​లో నేను చాలా ఏండ్ల పాటు సేవలందించాను. సాటి మహిళా జడ్జీల మాదిరి నేను కూడా ఇబ్బందులు పడ్డాను. వాళ్ల హక్కులపై గళం వినిపించాను. ఎన్నో చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామురాలయ్యాను. అయినప్పటికీ, మహిళా న్యాయమూర్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా.. కుటుంబం, పిల్లలను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి’’ అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. 

క్రిమినల్ కేసుల విచారణలో ఇబ్బంది పడ్తున్నరు

ఫ్యామిలీ, చైల్డ్ వెల్ఫేర్ కోర్టులను మహిళా జడ్జీలే ఎందుకు నడిపించాలని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘‘మహిళా న్యాయమూర్తుల సేవల ఇతర రంగాల్లో ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అధికార పరిధిని ఎందుకు పెంచట్లేదు? బెంచ్ ఏర్పాటులోనూ మహిళలపై వివక్ష కొనసాగుతోంది. జ్యుడీషియరీ సిస్టమ్​లో లింగవివక్ష అనేది హేయమైంది. తొలితరం జడ్జీలకు ఆఫీసులు, సరైన సౌలత్​లు లేక ఎన్నో ఇబ్బందులను పడ్డారు. అతికొద్దిమంది మహిళలే న్యాయవాద వృత్తిని ఎంచుకుంటారు. జ్యుడీషియల్ అధికారులు.. బెంచ్​లోకి వెళ్లడం సులభమే.. కానీ, మహిళా అడ్వకేట్లు మాత్రం బార్ నుంచి బెంచ్​కు వెళ్లడం చాలా కష్టం. జడ్జీగా పని చేసినప్పుడు కొలిగ్స్ నుంచి నాకు ఎలాంటి సమస్యలు రాలేదు. సీనియర్ల నుంచి మద్దతు లభించింది’’ అని హిమా కోహ్లీ చెప్పారు. జడ్జీలు మనస్సాక్షిని మాత్రమే వింటారని, ప్రజలు సుప్రీం కోర్టుపై నమ్మకం ఉంచాలని తెలిపారు. 

కోర్టులో మాత్రం గీత దాటొద్దు

జడ్జీలు కూడా మనషులే అని, కొన్నిసార్లు తప్పులు చేయడం సహజమని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హియరిం గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కేసులు వినడంతో న్యాయం నేరుగా సామాన్యులకి చేరుతుందన్నారు. ‘‘అందరూ సమానమే అనే ఆలోచన ప్రతి జడ్జిలోనూ ఉండాలి. బయట ఎవరితో ఎలాంటి సంబంధాలున్నా కోర్టులో గీత దాటొద్దు. మ్యూచువల్ రిలేషన్స్ అనేవి పనికి అడ్డు రాకూడదు. జడ్జీలంతా కేసు మెరిట్​నే చూడాలి.. ఫేసులను చూడొద్దు. ప్రపంచంలో ఏంజరుగుతుందో ప్రతీ జడ్జి తెలుసుకుంటూ ఉండాలి. ప్రపంచంతో డిస్ కనెక్ట్ అయి ఉండొద్దు. సాధారణ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. జడ్జీలు సోషల్ మీడియాల్లో లేనప్పటికీ.. ఏం జరుగుతుందో ఆన్​లైన్​లో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం’’ అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. యంగ్ లాయర్లంతా ఫ్రీ టైమ్​లో క్యాంటీన్లలో కూర్చోకుండా.. కోర్టులు, లైబ్రరీల్లో టైమ్ స్పెండ్ చేయాలన్నారు.