అశ్వాపురం, వెలుగు: మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మణుగూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్కోర్టు జడ్జి ఎం. వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. కాలేజీ పరిసరాలను పరిశీలించారు. కాలేజీలో నెలకొన్న అనేక సమస్యలను గుర్తించారు. కాలేజీలో అటెండర్, స్లీపర్, స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉండడంపై ఆశ్చర్య వ్యక్తం చేశారు. 250 మంది విద్యార్థులున్న కాలేజీలో కనీసం తాగునీరు లేకపోవడంపై జడ్జి అసహనం చెందారు.
కాలేజీలో కంప్యూటర్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్, ఎంసెట్ వంటివి ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను బోధిస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ నల్లగట్ల సత్య ప్రకాశ్ ను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఇక్కడి కాలేజీలో చదువుతూ తల్లి లేదా తండ్రి లేదా ఇరువురు లేని విద్యార్థులకు గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా రూ.5వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. తల్లిదండ్రులు లేనివారు ఈ కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.