కరోనా మహమ్మారితో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఈ టైమ్లో టీఆర్ఎస్ సర్కార్ ఉద్యమనేత, కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించి రాజకీయాలు చేయడం ద్వారా కరోనా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసినట్లైంది. కేసీఆర్ తన సొంత రాజకీయ ప్రయోజనాలకిచ్చిన ప్రాధాన్యతను ప్రజా సమస్యలకు ఇవ్వడంలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి కష్టకాలంలో కేసీఆర్ ధోరణి తెలంగాణ సమాజానికి చేసిన ద్రోహంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలియక తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతునిచ్చామని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా బ్రహ్మరథం పట్టి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారు. ఎన్నో త్యాగాలు, బలిదానాలు, ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల బతుకులు సమైక్య పాలనలోకన్నా అధ్వాన్నమైనయ్. అందుకే తెలంగాణలో "యుద్ధం మిగిలే ఉంది".
మా నీళ్లు మాకే, మా భూములు మాకే మా ఉద్యోగాలు మాకే.. మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మాకు మీకు కలవదంటే కలవదని తెగించి కొట్లాడి ఏపీ నుంచి విడిపడ్డాం. సీమాంధ్ర పాలకుల వల్లనే తెలంగాణ అభివృద్ధికి నోచుకోవడంలేదని మనం కట్టే పన్నులతో, మన వనరులతో ఆంధ్రలో అభివృద్ధి చేసుకుంటున్నారని ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. ఈ పోరాటంలో 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. తుది దశ ఉద్యమం కన్నా ముందునుంచే తెలంగాణలో భూస్వాములు, దొరలు, జాగీదార్లకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. రాష్ట్ర సాధనలో వీరి త్యాగాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. అలా ఎందరో త్యాగాలు చేస్తే ఏర్పడ్డ రాష్ట్రంలో పాలన ఫామ్ హౌస్ కు పరిమితమై ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు.
ప్రశ్నించే గొంతు నొక్కేసిండు
మనకు ఎన్నో ఆశలు కల్పించిన పాలకులు, గద్దెనెక్కింది మొదలు నేటి వరకు దోపిడీ రాజకీయాల్లో మునిగి, అంతులేనంత సంపద పోగు చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా పాలన సాగిస్తున్నారు. ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ఉండకూడదని ఉద్యమాలను అణచివేశారు. ప్రశ్నించే ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కేశారు. ప్రలోభ పెట్టే పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అవన్నీ మర్చిపోయింది. ఉద్యమ పార్టీ ఫక్తు కుటిల రాజకీయ పార్టీగా మారింది. ప్రజల యోగ క్షేమాలు, విద్య, వైద్యం, ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు మరిచి, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి వాటితో అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఎన్టీఆర్ చేసిన తప్పు, సోనియా చేసిన తప్పు నేను చేయనని మాట్లాడిన కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తూ తన కొడుకుని సీఎం చేయడం కోసం తపన పడుతున్నాడు. అవినీతిపరులకు, బడా వ్యాపారులకు, భూ కబ్జాదారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వారిని తన గుప్పిట్లో ఉంచుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. అంతేకాక ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను సైతం పశువుల్ని కొన్నట్టు కొని పార్టీలో చేర్చుకొని తను ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నాడు. ప్రజల యోగ క్షేమాలు అసలే పట్టని ఈ దుర్మార్గ పాలనను అంతం చేయడం కోసం మనకు "యుద్ధం మిగిలే ఉంది".
ఈటలకు అంతా అండగా నిలిచారు
ప్రజలంతా నియంత పాలన నుంచి విముక్తి ఎట్లనా అని తీవ్రంగా ఆలోచిస్తున్న తరుణంలో ఈటల ఉదంతం జరిగింది. కేసీఆర్ పాలనలో మోసపోయిన పీడిత ప్రజలంతా ఈటల వైపు ఆశగా చూసారు. వందల సంఘాలు సంఘీభావం పలికాయి. కేసీఆర్ ను ఎదిరిస్తే తోడుంటామని ప్రకటించారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా వేల వాట్సాప్ గ్రూపులు పెట్టి లక్షల మంది "మేము సైతం" అంటూ ఈటలకు మద్దతుతో పాటు కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలనను దునుమాడారు. తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేయడాన్ని తప్పుబట్టారు. అదే సమయంలో ప్రజలు ఈటలకు మద్దతు పలకడం వెనుక ఆయనపై నమ్మకం, అభిమానమే మాత్రమే కాదు కేసీఆర్ పైనున్న తీవ్ర వ్యతిరేకత కూడా తోడైనాయి. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ను ఎదుర్కోవాలంటే అంతకన్నా పెద్ద అండ కావాలని ఈటల రాజేందర్ ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నాడు. ఈ స్థితిలో కూడా నిరుత్సాహానికి గురికాకుండా పీడిత ప్రజలకు విముక్తి జరిగే వరకు పోరాటం చేయాలి. అందుకే తెలంగాణ ప్రజలకు "యుద్ధం మిగిలే ఉంది".
దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం కొట్లాడాలె
నోటిఫికేషన్లు రాకుండానే నిరుద్యోగుల వయసు అయిపోయింది. రైతులు, చేనేతల ఆత్మహత్యలు ఆగలేదు. స్వయం పాలన కేసీఆర్ కుటుంబానికే పరిమితమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆత్మగౌరవం లేకుండా పోయింది. మొదటినుంచి ఉద్యమంలో పనిచేసిన వారికి అసలే గౌరవం లేకుండా పోయింది. సామాన్యులకు వైద్యం అందక కుప్పలు తెప్పలుగా చచ్చిపోతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ ప్రణాళికలు సున్నా. ఏ ఎన్నికల్లో ఎట్ల గెలవాలి, గెలిచిన ఇతర పార్టీల నాయకులను ఎట్ల కొనాలనే ధ్యాసలోనే పాలకులు మునిగితేలుతున్నారు. అందుకే తెలంగాణ ప్రజల బతుకులు మారడానికి, దోపిడీ పాలకుల నుంచి విముక్తి జరగడానికి మరో పోరాటం చేయక తప్పదు.
ఎన్నో చిక్కులను ఛేదించి తెలంగాణ సాధించుకున్న ప్రజలకు నేడు కేసీఆర్ను గద్దె దించడం పెద్ద విషయం ఏమీ కాదు. నిజాంను దించిన ప్రజలకు ఈ దొరను దించడం సులభమే. వందలాది మంది మేధావులు, ప్రగతిశీల అభ్యుదయవాదులు ఈటలకు మద్దతు పలికి ప్రజాస్వామిక తెలంగాణ స్థాపనలో భాగమవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ, శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారికి వారసులుగా తెలంగాణ ప్రజలు బరిగీసి కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవడానికి యుద్ధానికి సిద్ధమవ్వాలి. ప్రజల పట్ల సేవా దృక్పథం ఉన్నోళ్లు, నిజాయితిగల ఉద్యమకారులు, యువకులు, విద్యావంతులు, బుద్ధి జీవులు, రాజనీతిజ్ఞులు అంతా కలిసి కొట్లాటకు సిద్ధం కావాల్సిన చారిత్రక సందర్భం ఇది.
-సాయిని నరేందర్, సోషల్ ఎనలిస్ట్