కరీంనగర్, వెలుగు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కి వ్యతిరేకంగా పలువురు సీనియర్లు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. సంజయ్ తీరుతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందంటూ బీజేపీ సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, పోలుసాని సుగుణాకర్ రావు, కాసిపేట లింగయ్య తదితరులు కార్యకర్తలతో కరీంనగర్ లోని జ్యోతినగర్ లో గురువారం మీటింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో పాల్గొన్న నేతలు.. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక సిద్ధాంతాలు పక్కకుపోయి వ్యక్తి పూజ పెరిగిందని, పార్టీ బలహీనపడిందని ఆరోపించినట్లు తెలిసింది. సీనియర్లను పట్టించుకోవడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నట్లు సమాచారం. అంతేగాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయారని, అందుకే పార్టీ కరీంనగర్ ఎంపీ టికెట్ ను ఆయనకు ఇవ్వొద్దని హైకమాండ్‌ను కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది.
అసమ్మతి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న బండి సంజయ్ కి వ్యతిరేకంగా కొందరు నేతలు సమావేశం పెట్టడాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అసమ్మతి పేరుతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహించేవారిపై కఠినంగా వ్యవహరించేందుకు రెడీ అయినట్లు సమాచారం. పూర్తి వివరాలతో నివేదిక పంపాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు తెలిసింది. కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేత ఒకరు సంజయ్ కి వ్యతిరేకంగా అసమ్మతి సమావేశం నిర్వహణకు తెరవెనుక సహకరిస్తున్నట్లు పార్టీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. సదరు నేత గతంలో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పటికీ అక్కడ పలువురు సీనియర్ నేతలు టికెట్లు ఆశించడంతో కరీంనగర్ పై దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతున్నది.