
- మహాశివరాత్రికి.. శైవ క్షేత్రాలు ముస్తాబు
- శివనామస్మరణతో మార్మోగనున్న ఆలయాలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి/ కాశీబుగ్గ/ ములుగు/ నల్లబెల్లి, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. బుధవారం ఉదయం నుంచే టెంపుల్స్ శివనామ స్మరణతో మార్మోగనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం, రామప్ప, కోటగుళ్లు, వేయిస్తంభాల గుడి, కురవి వీరభద్రేశ్వరాలయం, వరంగల్సిటీలోని భద్రకాళి, కాశీవిశ్వేశ్వర దేవాలయం, కోటి లింగాల గుడి, ఖిలావరంగల్శంభులింగేశ్వర దేవాలయం, నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ రాజరాజేశ్వర దేవాలయంతో పాటు పలు శివాలయాలలో మహాశివరాత్రి సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి అయిన భూపాలపల్లి జిల్లాలోని గణపురంలోని కోటగుళ్లు దేవాలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని గణపేశ్వరాలయంగా పిలుస్తారు. రామప్ప రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నట్లు వరంగల్ –2 డిపో మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. హనుమకొండ నుంచి ఉదయం 6.30 నుంచి ప్రతి గంటకు ఒక బస్సు నడిపించనున్నామన్నారు.
నేడు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కల్యాణం
కురవి: కురవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి జరగనుంది. మంగళవారం పలు ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన కలశ స్థాపనతో స్వామి వారి కల్యాణ వేడుకలు ఆరంభమైనట్లు ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, ఈవో సత్యనారాయణ తెలిపారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. వేడుకలు వచ్చేనెల 12న ముగుస్తాయని వివరించారు. ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా 200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్రామ్ నాథ్ తెలిపారు.
హనుమకొండలో ట్రాఫిక్ ఆంక్షలు
హనుమకొండసిటీ: వేయిస్తంభాల గుడిలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈనెల 26, 27 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు హనుమకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. గుడి వైపు వచ్చే వాహనదారులు అమృత థియేటర్ నుంచి యాదవనగర్ వైపు వెళ్లాలని, ములుగు రోడ్డు నుంచి వచ్చే వెహికల్స్ అలంకార్ జంక్షన్ వరకు వచ్చి కాపువాడ మీదుగా వెళ్లాలని కోరారు. ఆలయ పరిసరాల్లోని మెయిన్ రోడ్డుపై ఎలాంటి వాహనాలను నిలుపరాదని కోరారు.