
- వేలాల జాతరకు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
- వీఐపీ వెహికల్స్‌కు నో ఎంట్రీ
- ప్రత్యేక ఉత్సవాలకు సిద్ధమైన పెద్ద బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం
జైపూర్/కోల్‌బెల్ట్/బెల్లంపల్లి/నిర్మల్, వెలుగు: మహా శివరాత్రిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని వేలాలలో జాతర ఏర్పాట్లు ముగిశాయి. ఈనెల 26, 27 తేదీల్లో శివరాత్రి వేడుకల్లో గట్టు మల్లన్న, మల్లికార్జున స్వామి దర్శనానికి దాదాపు 3లక్షలకు పైగా మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి చొరవచూపి జాతర ఏర్పాట్ల కోసం రూ.10.63 లక్షలు కేటాయించడంతో పనులు పూర్తయ్యాయి.
ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకోనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాకపోకలకు ప్రత్యేకంగా రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈసారి వీఐపీ వెహికల్స్‌ను అనుమతించకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు, నది ఒడ్డున షవర్లు, టెంపరరీ బాత్రూంలను ఏర్పాటు చేశారు.
ముస్తాబైన బెల్లంపల్లి రాజరాజేశ్వర స్వామి క్షేత్రం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలోని పెద్ద బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేడుకలకు సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తాండూర్, కాసిపేట, బెల్లంపల్లి మండలాల సరిహద్దుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో మూడు కొండల మధ్య 2 వేల ఏండ్ల క్రితం వెలసిన ఈ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో మూడ్రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలకు ప్రసిద్ధమైంది.
ఆలయ పరిసరాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఈ ఆలయంలో గంగాదేవికి నిరంతరం అభిషేకం చేయడం విశేషం. 26న ఉదయం 4.15 గంటలకు - సుప్రభాతం, శివ అష్టోత్తర శతనామ పూజతో వేడుకలు మొదలవుతాయి. అఖండ బిల్వ పత్రపూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, 11 గంటలకు రుద్రపారాయణం, సాయంత్రం 9.15 గంటలకు శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహోత్సవం, 27 ఉదయం 8 గంటల వరకు -భజనలు, మంగళహారతి సాయంత్రం తీర్థ ప్రసాదాల పంపిణీ చేయనున్నారు.
నిర్మల్‌లోని చారిత్రక ఆలయాల్లో ఏర్పాట్లు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని చారిత్రక కదిలె పాపహరేశ్వరాలయం శివరాత్రి పండుగకు ముస్తాబైంది. శివరాత్రిని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు ఆలయం వద్ద జాగరణ చేస్తారు. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. మామడ మండలంలోని బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయం, లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్ రాజరాజేశ్వరాలయం, కుంటాల మండలం సూర్యాపూర్లోని రాజేశ్వరాలయం, పవిత్ర బాసర పుణ్యక్షేత్రంలోని రాజరాజేశ్వరాలయం, ముథోల్‌లోని పశుపతి ఆలయం, లోకేశ్వరం మండలంలోని బ్రహ్మేశ్వర ఆలయం, నిర్మల్ పట్టణంలోని చారిత్రక ఓంకారేశ్వరాలయం, నగరేశ్వరాలయం, రథాల గుడి, శివకోటి మందిరం, మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలోని శివాలయం వద్ద శివరాత్రి పండుగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు.