సిద్దిపేట జిల్లాలో జాతరలకు వేళాయె .. వేలాదిగా తరలి రానున్న భక్తులు

సిద్దిపేట జిల్లాలో జాతరలకు వేళాయె .. వేలాదిగా తరలి రానున్న భక్తులు
  • మాఘ అమావాస్య సందర్భంగా ఆలయాల ముస్తాబు
  • సిద్దిపేట జిల్లాలో నాలుగు చోట్ల ముఖ్య జాతరలు
  • మెదక్​జిల్లాలోని ఏడుపాయలలో పవిత్ర స్నానాలు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలు జాతరలకు సిద్ధమయ్యాయి. ఈ నెల 29న మాఘ అమావాస్యను పురస్కరించుకొని రెండు చోట్ల జాతర జరుగుతుండగా  మరో రెండు క్షేత్రాల్లో నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. సిద్దిపేట మండలం పుల్లూరు బండపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామికి కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పేరుంది. ఏటా మాఘ అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. 

ఈసారి జనవరి 29 నుంచి 31 వరకు జరిగే జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. మొదటి రోజు భక్తులు పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. రెండోరోజు గోపాల కాల్వలు, మూడో రోజు స్వామి వారి కల్యాణ క్రతువు, తర్వాత చక్రతీర్థం నిర్వహించి జాతరను ముగిస్తారు. ఇక్కడ ఎప్పటికి ఎండిపోని నీటి గుండం ఉంది. ఈ గుండంలోని నీటిని తీసుకెళ్లి పంటపొలాల్లో చల్లితే దిగుబడి బాగా వస్తుందని భక్తులు నమ్ముతారు.  

సింగరాయ గుట్ట జాతర

కోహెడ మండలం కూరెల్ల గ్రామ పరిధిలోని గుట్టపై సింగరాయ జాతర జరుగుతుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. ఇక్కడ శాఖాహార పద్ధతిలో భోజనాలు చేయడం  ప్రత్యేకత.  గుట్ట  పక్కనే ఉన్న మోయ తుమ్మెద వాగులో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. మాఘ అమావాస్య ఒక్క రోజే జాతర జరగడంతో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు మూడు కిలో మీటర్లు నడిచి వస్తారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు హాజరవుతారు. ఇదిలా ఉంటే జాతర నిర్వహణపై కూరెళ్ల, తంగళ్లపల్లి గ్రామాల మధ్య వివాదం కొనసాగుతుండడంతో ఈసారి అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది.  

కూడవెల్లి జాతర 

దుబ్బాక మండలం రామేశ్వరంపల్లిలో కూడవెల్లి జాతర జరుగుతుంది. ఈ గ్రామ పరిధిలో కూడవెల్లి వాగు, పక్కనే ఆలయం ఉండడంతో కూడవెల్లి జాతరగా ప్రసిద్ధి చెందింది. జనవరి 29  నుంచి 31వరకు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ రామలింగేశ్వరస్వామి స్వయంభూగా వెలిసినట్లు ప్రతీతి. ఈ జాతరకు ఐదు రోజుల్లో దాదాపు యాభై వేల పైచిలుకు మంది భక్తులు వస్తారు. కూడవెల్లి వాగులో పుణ్య స్నానాలు ఆచరించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. మొదటి రోజు రామేశ్వరంపల్లిలో స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, మిగతా నాలుగు రోజులు విశేష అర్చనలు, రుద్రాభిషేకం నిర్వహిస్తారు. బుధవారం తెల్లవారు నుంచి మాఘ పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయి.
  
గుబ్బటి గుట్ట జాతర

నంగునూరు మండలం పాలమాకుల గ్రామ పంచాయతీ పరిధిలోని గుబ్బటి గుట్టపై వెలిసిన దత్తాత్రేయ స్వామిని మాఘ అమావాస్య రోజున దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ రోజున భక్తులు అధిక సంఖ్య లో తరలివస్తారు. భక్తులు గుట్టపై ఉన్న పవిత్ర కోనేరులో స్నానాలు చేసి ప్రత్యేక పూజలు  నిర్వహిస్తారు. సాయంత్రం దత్తాత్రేయ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆలయాన్ని మూసి వేసి తిరిగి మాఘ అమావాస్య రోజు తెరవడం ఇక్కడి ప్రత్యేకత.

ALSO READ | మహా కుంభమేళాలో తొక్కిసలాట....అమృత స్నానాలు నిలిపివేత