
- మహిళల్లో శ్వాస అందకపోవడం.. మగవాళ్లలో గుండె నొప్పి హెచ్చరికలు
- అమెరికాలోని కెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ : అప్పటిదాకా మామూలుగా కొట్టుకుంటున్న గుండె ఉన్నట్టుండి ఆగిపోవడమే కార్డియాక్ అరెస్ట్.. సడెన్‌గా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల వెంటనే చికిత్స అందకుంటే బాధితులు చనిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రి బయట కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వాళ్లలో దాదాపు 90% మంది చనిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న కెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ నిపుణులు పరిశోధనలు నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయని వారు తెలిపారు. ఈ హెచ్చరికలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉన్నాయని చెప్పారు.
కార్డియాక్ అరెస్టుకు గురయ్యే 24 గంటల ముందు ఏదో ఒక సమయంలో స్త్రీలు శ్వాస అందక ఇబ్బంది పడగా.. పురుషులు గుండె నొప్పితో ఇబ్బంది పడ్డారని వివరించారు. ఈమేరకు ఎనిమిదేళ్ల పాటు 1672 మంది కార్డియాక్ అరెస్ట్ బాధితులపై జరిపిన పరిశోధన వివరాలను ఈ స్టడీకి నేతృత్వం వహించిన సుమీత్ ఛగ్ వెల్లడించారు. లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్ ఈ పరిశోధనా ఫలితాలను ప్రచురించింది.
50% మందిలో ఈ లక్షణాలే..
ఛాతి నొప్పి, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు (కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే 24 గంటల ముందు నుంచి).. కార్డియాక్ బాధితుల్లో దాదాపు 50% మంది ఇందులో ఏదో ఒక సమస్యను ఎదుర్కొన్నారని పరిశోధకులు తెలిపారు. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కామన్‌గా కనిపించిన లక్షణాలు.. గుండె అదరడం, మూర్ఛ వ్యాధి లక్షణాలు, ఫ్లూ లక్షణాలు కనిపించాయని వివరించారు.
కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు తేడా..
ఉన్నట్టుండి గుండె ఆగిపోవడమే కార్డియాక్ అరెస్ట్.. దీంతో కీలక అవయవాలకు రక్త సరఫరా నిలిచిపోయి శరీరం అచేతనంగా మారిపోతుంది. ఇక, రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల ఎదురయ్యే పరిస్థితే హార్ట్ ఎటాక్ లేదా గుండెపోటు. నరాల్లో రక్తం గడ్డం కట్టడం, కొవ్వు, కొలెస్ట్రాల్ కారణంగా రక్త నాళాలు కుచించుకు పోవడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది. గుండెపోటు బాధితులు కార్డియాక్ అరెస్టుకు గురికావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెంటనే చికిత్స అందకపోతే ఇది ప్రాణాంతకమే. ఇంట్లోనో, ఆఫీసులోనో, ప్రయాణాల్లోనో కార్డియాక్ అరెస్టుకు గురైన వారిలో.. టైముకు చికిత్స అందక 90 శాతం మంది చనిపోతున్నారు. దీనికి కారణాలు, సంకేతాలను గుర్తించగలిగితే ఈ మరణాలను తగ్గించవచ్చనే ఉద్దేశంతో ఈ స్టడీ చేపట్టినట్లు పరిశోధకులు తెలిపారు.