
- పునాదులు దాటని వంతెన నిర్మాణాలు
- ఈ ఏడాదీ కష్టాలు తప్పేలా లేవు
- వానకాలంలో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం
వానాకాలం వచ్చిందంటే చాలు ఎప్పుడు ఏ వాగు ఉప్పోంగుతుందో ఏ వరద ముంచెత్తుతుందోనని ఆదివాసీలు వణికిపోతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా కొన్నేళ్లుగా అడవి బిడ్డలు సతమతమవుతున్నారు.
ఆసిఫాబాద్, వెలుగు: ఆదివాసీల జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్లో రోడ్డు, రవాణా సౌలత్ లేక ప్రతి ఏటా వానాకాలంలో అనేక గిరిజన గ్రామాలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకుని బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నాయి. వాగులపై పదేండ్లకు పైగానే వంతెన నిర్మాణాలు కొనసాగుతున్న నేటికీ పూర్తి కాకపోవడం ఆఫీసర్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫలితంగా గర్బిణీలు, బాలింతలు, రోగులు దవాఖానకు వెళ్లాలన్నా.. పిల్లలు బడికి పోవాలన్నా.. వాగు దాటితేనే ఆదివాసీల బతుకు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.
జిల్లాలో వంతెన కష్టాలిలా..
ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం15 మండలాలు ఉన్నాయి. మండలాల్లో నిర్మించ తలపెట్టిన వంతెనలు పూర్తి కాకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ఆదివాసులు కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పనులు నత్తనడకన కొనసాగుతుండడం, అసంపూర్తిగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆసిఫాబాద్ మండలంలోని గుండి పెద్దవాగుపై వంతెన నిర్మాణం19 ఏండ్లుగా సాగుతోంది. ఇప్పటికీ పిల్లర్ల దశ పూర్తి కాలేదు. రూ.8.48లక్షలతో నిర్మిస్తున్నఈ వంతెన పనులు పూర్తి చేయడంలో ఆఫీసర్లు, లీడర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా గుండి గ్రామ ప్రజలు వాంకిడి మండలం మీదుగా 20 కి.మీ. దూరం ప్రయాణించి ఆసిఫాబాద్ కు చేరుకోవాల్సిన దుస్థితి.
బెజ్జూర్ మండలంలోని సుస్మీర్, సోమినీ వాగు మీద బ్రిడ్జిల నిర్మాణాలు జరగక వానాకాలంలో ప్రజలు జలదిగ్బంధంలో ఉంటున్నారు. ఉప్పొంగిన వాగులు దాటే వీలు లేక అవస్థ పడుతున్నారు.
చింతల మానేపల్లి మండలం ధిందా వాగులో లెవెల్ కాజ్ వే ఉంది. కొన్నేండ్లుగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం గ్రామస్తులు అనేక విధాలుగా పోరాటాలు చేశారు. అయితే, బ్రిడ్జి మంజూరు అయినా ఫారెస్ట్ క్లియరెన్స్ రాక ఇప్పటివరకు పనులు మొదలు కాలేదు. గ్రామం నుంచి కి.మీ. దూరంలో ప్రాణహిత నది ఉండగా, ఇటు వాగు ఉంది. చిన్నవాన పడినా ఈ రెండు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
చింతల మానేపల్లి మండలం రణవెల్లి వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు పదేండ్ల అవుతున్నా పూర్తి కావడం లేదు.
కెరమెరి మండలం అనార్ పల్లి పెద్ద వాగుపై వంతెన పనులు పదేండ్లుగా అసంపూర్తిగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది వర్షం కాలంలో వాగు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాన కాలంలో ఏటా గోస పడుతున్నం
వాన కాలంలో ప్రతి ఏటా వంతెన నిర్మాణ పనులు పూర్తి కాక గోస పడుతూనే ఉన్నం. ఏండ్ల సంది నిర్మాణం పనులు పూర్తి కావడం లేదు. నాలుగు నెలలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నరకం అనుభవిస్తున్నం. గర్భిణీలు, రోగులు హస్పిటల్ కు పోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వాగు దాటే దుస్థితి నెలకొంది. అధికారులు, లీడర్లు స్పందించి వంతెన నిర్మాణ పనులు కంప్లీట్ చేయాలి. - మాలోత్ రామ్ లాల్, లక్ష్మాపూర్, కెరమెరి