బీఆర్ఎస్​ జాబితాలో అనామకులే ఎక్కువ!

బీఆర్ఎస్​ జాబితాలో  అనామకులే ఎక్కువ!

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు చూస్తుంటే ఆ పార్టీ ప్రతిష్ఠ ఎంత పడిపోయిందో అర్థమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో  బీఆర్ఎస్​ను వదిలిపోయేందుకే నాయకులంతా సిద్ధపడుతున్న వేళ  దెబ్బ మీద దెబ్బలా వచ్చిన సాధారణ ఎన్నికలు ఆ పార్టీ బలహీనతని బయటపెడుతున్నాయి.  గత అసెంబ్లీ  ఎన్నికల్లో బీఆర్ఎస్​  గెలిచి ఉంటే  పార్లమెంట్ ఎన్నికల సీట్ల కోసం ఎంతో పోటీ ఉండేది. ఇప్పుడేమో సిట్టింగుల్లో కొందరు జారిపోగా ఉన్నవాళ్లు  కూడా  పోటీకి విముఖతచూపుతున్నారు.ఎన్నికల అనుభవం ఉన్నవారంతా  ఓటమి భయంతో  వెనుకంజ వేయగా జనంలో గుర్తింపు పొందేందుకు  కొత్త ముఖాలు కొన్ని ఇదో అవకాశం అన్నట్లుగా ముందుకొచ్చాయి. అసెంబ్లీ టికెట్ కోసం పడిగాపులు పడ్డా దొరకనివారికి ఇప్పుడు పిలిచి ఎంపీగా పోటీ చేసేందుకు చాన్సు ఇస్తున్నారు.  9 మందిలో  సిట్టింగుల్లో తమ పూర్వ స్థానాల్లో పోటీ చేస్తున్నవారు  ఇద్దరే.  వారు నామని నాగేశ్వరరావు,  మాలోతు కవిత.  బీఆర్ఎస్​కు చెందిన తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యుల్లో అయిదుగురు బయటకు వెళ్లిపోయారు. కొందరు భాజపాలోకి, మరి కొందరు కాంగ్రెస్​లో చేరి  ఆ పార్టీల తరఫున పార్లమెంట్ బరిలో నిలబడుతున్నారు. ధనబలంతో  బీఆర్ఎస్​లో  చేరినవారు ఇప్పుడు అదే ధైర్యంతో  మరో గుర్తుపై  పోటీకి దిగుతున్నారు. వారికి ఏ పార్టీ అయినా ఒకటే.  చివరకు బలమైన అభ్యర్థుల లేమి వల్ల  బీఆర్ఎస్​ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నిలబెట్టక తప్పడం లేదు.  

కొడిగడుతున్న కేసీఆర్ ప్రభ

అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి బీఆర్ఎస్​లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి,  కాసాని జ్ఞానేశ్వర్,  గాలి అనిల్ కుమార్ ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థులుగా అవతారమెత్తారు. గతంలో మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడంతో  పి. వెంకట్రామిరెడ్డికి  మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.  గతంలో సిద్దిపేట  కలె క్టర్​గా  పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. ఆ మర్నాడే ఆయనకు  కేసీఆర్  ఎమ్మెల్సీ జాబితాలో చోటు ఇచ్చారు. ఆయన రాజకీయ పదవుల పోటీల్లో కొత్త అనే  చెప్పుకోవాలి. చేవెళ్ల నుంచి బరిలోకి దిగుతున్న  కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ హయాంలో టీడీపీ తరఫున పదవులు చేపట్టారు. ఎంతో కాలంగా ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నాయనను బీసీ లీడర్​గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరదీసిన కేసీఆర్  ఇప్పుడు ఎంపీగా అవకాశమిచ్చారు.  ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి  నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్​ నుండి పోటీకి దిగుతున్నారు. రోజురోజుకు  కొడిగడుతున్న కేసీఆర్ ప్రభ వల్ల అప్పుడు ఓడినవారు ఇప్పుడు గెలుస్తారని చెప్పలేం. కడియం శ్రీహరి తన కూతురు  కావ్యను రాజకీయ అరంగేట్రం చేయించాలని ఎన్నో ఏండ్లుగా తండ్లాడుతున్నారు.  ప్రస్తుతం ఆమెకు ఓ అవకాశం దక్కి వరంగల్ నుంచి బీఆర్ఎస్​ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఆమెకు ఇవే తొలి ఎన్నికలు. 

బీఆర్ఎస్​కు దానం షాక్​

ఖైరతాబాద్ నుంచి కారు గుర్తుపై ఎమ్మెల్యేగా  గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్​లో  చేరి ఏకంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం బీఆర్ఎస్​కు మరో షాక్.  దానం జంట నగరాల్లో బలమున్న నేత. నిజానికి ఆయన కాంగ్రెస్ మనిషే.  అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 2018లోను బీఆర్ఎస్​ తరఫున గెలిచినా మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరాశతో ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్యేగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని తనకు తానే కాంగ్రెస్​కు  కండిషన్ పెట్టి ముందడుగేశారు.  ఇక మాజీ మంత్రి,  ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉంది.  పార్టీ ఆదేశిస్తే  తానే  మల్కాజ్​గిరి స్థానానికి  పోటీ చేస్తానన్న ఆయన గమ్మున కూచున్నారు.  తన కొడుకు  భద్రారెడ్డిని పార్లమెంట్​కు పంపాలని కలలు కన్నారు.  ఇప్పుడు ఆ ఊసే లేదు. ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఆయన నేను పార్ట్ టైం  పొలిటిషియన్ని,  ఫుల్ టైం బిజినెస్ మెన్​ని అని క్లారిటీ ఇచ్చారు. చివరకు రాగిడి లక్ష్మారెడ్డికి ఆ టికెట్ దక్కింది. 

లోక్​సభ ఎన్నికలకు కేసీఆర్​ ఫ్యామిలీ దూరం

సికింద్రాబాద్ సెగ్మెంట్​లోని 7 ఎమ్మెల్యే స్థానాల్లో 6,  అలాగే మల్కాజ్​గిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్​ గెలిచినందున వారికి ఓట్లు బాగానే పడే అవకాశం ఉంది. అయితే మైనస్ పాయింట్ ఏమిటంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ ఆ రెండు చోట్ల  పార్లమెంట్ సీట్లు గెలవలేదు. నాగర్​కర్నూల్ నుంచి బీఆర్ఎస్​ టికెట్​పై పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.  సిర్పూర్​లో ఓడిపోయినా కొంత సానుభూతి సంపాదించుకున్న ఆయన  కేసీఆర్​తో చేతులు కలిపి విమర్శల పాలయ్యారు. ఆయన వల్లించిన నీతులు ఆయనే  మరిచాడని సోషల్ మీడియా కూస్తోంది.  హైదరాబాద్ స్థానానికి బీఆర్ఎస్​ నుంచి  పోటీకి దిగుతున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్  ఎన్నికల రాజకీయాలకు కొత్తవారే.  గత అసెంబ్లీ ఎన్నికల్లో  గోషామహల్ బీఆర్ఎస్​ అభ్యర్థిని  గెలిపించి ఆ విజయాన్ని వెండి పళ్లెంలో పెట్టి  అధినేతకు  ఇస్తామని ఆయన పళ్లెం సిద్ధం చేసినట్లు వార్తల్లో వచ్చింది. ఆ వెండి పళ్లెం ఇప్పుడైనా పనికొస్తుందో  లేదో.  మరో విశేషమేమిటంటే కేసీఆర్ కుటుంబం నుంచి పార్లమెంట్​కు పోటీ చేయకపోవడం కూడా ఇదే ఫస్ట్ టైం.  గతంలో ఓడిపోయిన నిజామాబాద్​లో చాలెంజ్​గా మళ్ళీ కవితను నిలబెట్టే దమ్ము ఆ పార్టీకి లేకుండా పోయింది. టీఆర్ఎస్​ జాతీయస్థాయి పార్టీగా బీఆర్ఎస్​గా మారిన రోజుల్లో  మహారాష్ట్ర,  ఏపీలో  నాయకుల ఎంపిక జరిగింది.  కేసీఆర్  వెళ్లి  మహారాష్ట్ర  ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.  ఇప్పుడు ఆ మాటే లేదు. ఈ  ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కార్యాచరణ ఏమిటో,  విధానసభలో ప్రతిపక్షంగా ఎలా నిలబడుతుందో అనే అంశాలపై దాని భవిత ఆధారపడి ఉంది.

- బి. నర్సన్, సీనియర్​ జర్నలిస్ట్