ఏడేండ్ల మోడీ పాలన.. ఎన్నెన్నో విజయాలు

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 30 మే 2021 నాటికి ఏడేండ్లు పూర్తవుతోంది. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతోంది. ఈ ఏడేండ్లలో అనేక సంస్కరణలతో మోడీ ప్రభుత్వం టీమిండియా స్ఫూర్తితో ‘సబ్ కా సాత్,- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ నినాదంతో ముందుకెళ్తోంది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను సమానదృష్టితో చూస్తూ ఎనలేని సేవలు అందిస్తోంది. రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని భావించి ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యల పరిష్కారానికి చోరవ చూపుతున్న ప్రధాని మోడీ.. తన పాలనతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. సుపరిపాలన అందిస్తూ సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

నరేంద్రమోడీ అధికారంలోకి రాకముందు అవినీతి, అస్తవ్యస్తంగా మారిన దేశ పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు, తన పట్టులోకి తీసుకువచ్చేందుకు ఆయనకు ఎక్కువ కాలం పట్టలేదు. ప్రణాళికా సంఘం వంటి జడత్వం నిండిన యంత్రాంగాన్ని రద్దు చేసి దేశానికి దిశా నిర్దేశం చేసే విధానాల రూపకల్పనకు నీతీ ఆయోగ్ వంటి సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ఆర్థిక రంగంలో నిశ్శబ్ద విప్లవం సాధించిన అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడి, 5 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ కోట్లాది మంది భారతీయులు మోడీపై పూర్తి విశ్వాసాన్ని చూపుతున్నారు.

రామ మందిర నిర్మాణం
శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్య చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామజన్మభూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది. ధృడమైన ఆత్మవిశ్వాసం, పటిష్టమైన వ్యూహరచన, తగిన సన్నద్ధత, వ్యూహాలను అమలు చేసే చాణక్యం ఉంటే ఎంతటి విషమ పరిస్థితులనైనా అవలీలగా అధిగమించవచ్చని మోడీ ప్రభుత్వం రుజువు చేసింది.

ఆర్టికల్ 370
జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ కు 70 ఏండ్లలో సాధ్యం కానిది, 70 రోజుల్లో సాధ్యం చేసి చూపించింది మోడీ ప్రభుత్వం. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ను మనదేశం నుంచి వేరుపరించేందుకు జరిగిన కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడుతూ ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే ఈ నిర్ణయం.. జాతీయ సమగ్రతను బలపరిచి, అఖండ భారత్ గా నిలిచేలా చేసింది.

తక్షణ తలాక్
దేశంలోని మహిళలకు సామాజిక ప్రతిష్టను, గౌరవ మర్యాదలను అందించేందుకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేసి ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఒక చారిత్రాత్మకమైన తప్పిదాన్ని సవరిస్తూ ముస్లిం మహిళల గౌరవాన్ని, ప్రతిష్టలను పెంపొందించి స్త్రీల పట్ల వివక్షతను చెరిపివేసింది.

పౌరసత్వ సవరణ చట్టం
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శిలు, క్రైస్తవులు మన దేశానికి శరణార్థులుగా వస్తే వారికి మన పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. పౌరసత్వ సవరణ చట్టంపై భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చొరబాట్లను నియంత్రించి, దేశ ప్రజలకు భద్రతను కల్పించేందుకే కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.

సీడీఎస్
నవ భారత ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒకే దేశం ఒకే ముఖ్య దళాధిపతి మార్పు దిశగా మరిన్ని అడుగులేసి తీరతామంటూ గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోడీ రక్షణ రంగానికి సంబంధించిన త్రివిధ దళాల అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)ను నియమించారు. దేశ రక్షణ దళాలను ప్రపంచంలోనే అత్యుత్తమ దళాల్లో ఒకటిగా నిలిపే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే కీలకమైన సంస్కరణ.

ఎన్ఎంసీ బిల్లు
ఇన్ స్పెక్టర్ రాజ్ శకానికి చరమగీతం పాడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థానంలో వైద్య రంగంలో ప్రధాని మోడీ నాయకత్వంలో తీసుకువచ్చిన ఎన్ఎంసీ బిల్లు వైద్య, ఆరోగ్యరంగ ప్రక్షాళనలో అతి పెద్ద సంస్కరణ. దీంతో ప్రభుత్వ సీట్లతో పాటు 50 శాతం ప్రైవేట్ సీట్లు కూడా ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.

ఈడబ్యూఎస్
ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) బిల్లు తీసుకువచ్చి ఈ చట్టం ద్వారా విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

అగ్రికల్చర్ బిల్లులు
వ్యవసాయ రంగంలో కీలక సమస్యలను పరిష్కరించడమే వ్యవసాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసమే రైతు ఉత్పత్తుల వాణిజ్య - వర్తక(ప్రోత్సాహం -వెసులుబాటు) బిల్లు-2020, రైతు ధరల-వ్యవసాయం సేవల భరోసా(సాధికారత -రక్షణ) బిల్లు-2020, నిత్యావసరాల (సవరణ) బిల్లు-2020 రూపుదిద్దుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వ పథకాలు
పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్చ భారత్, నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దనోట్లను రద్దు, ఒకే దేశం, ఒకే పన్ను విధానం లక్ష్యంగా జీఎస్టీ అమలు, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే స్కిల్ ఇండియా, వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ముద్రా యోజన, దేశీయ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి, అంకుర సంస్థల్ని ప్రారంభించేలా చేయడం కోసం స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, భారతీయ ఉత్పత్తులు ప్రపంచంలో పోటీపడగలిగేలా తయారు చేయడానికి మేకిన్ ఇండియా వంటి చాలా పథకాలను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఆత్మ నిర్భర భారత్ అభియాన్
కరోనా కష్టకాలంలో దేశ స్వావలంబన, స్వయం సంమృద్ధి లక్ష్యంగా 2020 మే 12న రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రకటించి ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోడీ ఉత్తేజాన్ని ఇచ్చారు. దీంతో సమాజంలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరడమే కాకుండా దేశ స్వయం సంమృద్ధి, ఆర్థిక నిర్మాణానికి 
ఎంతో ఉపయోగపడింది.

డిసెంబర్ నాటికి అందరికీ టీకా
దేశ ప్రజల అవసరాల దృష్యా ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్ టన్నులకు పైగా మెడికల్ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ను అత్యంత త్వరగా అందించేందుకు మిలిటరీ యుద్ధ విమానాలు పంపించి కేంద్రం ఆదుకుంటూనే ఉంది. రాష్ట్రాలకు వెంటిలేటర్స్, రెమ్డిసివిర్ ఇంజక్షన్లను, బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఆంపోటెరిసన్ ఇంజక్షన్లను పంపిణీ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు దేశ ప్రజలను కరోనా నుండి కాపాడటానికి 22 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను కేంద్రం పంపిణీ చేసింది. కరోనాను తుద ముట్టించడానికి ప్రధాని మోడీ తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా డిసెంబర్ 2021 వరకు దేశ ప్రజలందరికీ టీకా ఇవ్వాలని నిర్దేశించుకుని మోడీ ప్రభుత్వం ముందుకెళుతోంది.

బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్​కు రాజ్యాంగ హోదా
నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాస్ కమిషన్​కు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని రాజ్యాంగ హోదా కల్పించింది. దేశవ్యాప్తంగా 4వేల పైచిలుకు ఓబీసీ కులాల్లో కొంత మందికే 27 శాతం రిజర్వేషన్లు దక్కుతున్నాయి. అందుకే ఓబీసీల్లో కూడా వర్గీకరణ తీసుకురావాలని జస్టిస్ రోహిణీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోడీకే దక్కుతుంది. 75 సంవత్సరాల దేశ స్వాతంత్ర్యంలో మొదటిసారిగా అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావడం బీజేపీ వల్లనే సాధ్యమైంది.

సర్జికల్ దాడులు
ఇండియా తొలిసారి 2016లో సర్జికల్ దాడులు చేసింది. సెప్టెంబర్ 18, 2016న యూరీ ప్రాంతంలో టెర్రరిస్టులు భారత బలగాలపై దాడి చేశారు. సెప్టెంబర్ 29, 2016న యూరీ దాడికి ప్రతిగా పాకిస్తాన్​లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియా సర్జికల్ దాడులు నిర్వహించింది. పుల్వామా ఆత్మహుతి దాడికి ప్రతీకార చర్యగా మరోసారి ఫిబ్రవరి 26, 2019న బాలాకోట్ పై సర్జికల్ దాడులు చేసింది. భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను చిన్నాభిన్నం చేశాయి.

- డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా