సూర్యాపేట, వెలుగు : మిషన్ భగీరథతో ప్రతి రోజు, ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మిషన్ భగీరథ ట్యాంకులు సరిగా లేకపోవడం, పైప్‌లైన్లు కొన్ని చోట్ల పూర్తి కాకపోగా, మరికొన్ని చోట్ల రిపేర్లకు గురయ్యాయి. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయకపోవడంతో రిపేర్లు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ కారణంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో తాగునీటి కోసం జనాలు రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నారు.
రోడ్లు, డ్రైనేజీ వర్క్స్‌తో పగులుతున్న పైప్‌లైన్లు
సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే పనులు చేసే కాంట్రాక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలా చోట్ల మిషన్ భగీరథ పైప్‌లైన్లు పగులుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీలను పూర్తి చేసిన కాంట్రాక్టర్లు పగిలిన పైప్‌లైన్లను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆ బాధ్యత మిషన్ భగీరథ ఆఫీసర్లపై పడుతోంది. అయితే ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవడంతో ఆ రిపేర్లు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లాలోని చాలా గ్రామాల్లో 20 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదు. ప్రభుత్వం స్పందించి ఫండ్స్ విడుదల చేస్తేనే రిపేర్లు పూర్తి చేసే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు.
బోర్ల ద్వారానే నీటి సరఫరా
గరిడేపల్లి మండలానికి మఠంపల్లి, అవంతీపురం గ్రిడ్ల నుంచి వాటర్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే మండలంలోని ఏ గ్రామంలో కూడా మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు. దీంతో ప్రజలు గ్రామపంచాయతీ నుంచి వచ్చే నీళ్ల మీదే ఆధారపడుతున్నారు.నేరేడుచర్ల మండలం కల్లూరులో మిషన్ భగీరథ పైప్‌లైన్ వేసి, నల్లాలు ఏర్పాటు చేశారు. కానీ కలుషిత నీరు సరఫరా అవుతుండడంతో ఆ నీరు ప్రజలు తాగడం లేదు. గ్రామ పంచాయతీ నుంచి బోర్ ద్వారా సరఫరా చేసే నీటిని వాడుకుంటున్నారు.
హుజూర్‌నగర్ మండలం అమరవరంలో భగీరథ పనులు పూర్తి అయినా గ్రిడ్ కనెక్షన్‌ను ట్యాంకులకు ఇవ్వకపోవడంతో అసలు భగీరథ నీరే రావడం లేదు. దీంతో ప్రజలు కిలోమీటర్ దూరంలో ఉన్న బోరుబావి నుంచి మంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్ పంచాయతీలో పైప్ లైన్ లీకేజీ, మోటార్ల రిపేర్లు చేయకపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు దగ్గర్లోని బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
మూడేళ్లయినా పనులు పూర్తి చేయలే..
నేను సర్పంచ్‌గా ఎన్నికై మూడున్నరేళ్లు దాటింది. నా టర్మ్ పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ విషయంపై పలుమార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకుండా పోయింది. ఆఫీసర్లు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడాలి. - వీరంరెడ్డి లింగారెడ్డి, సర్పంచ్, కృష్ణానగర్, మునగాల మండలం
వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నీటి సరఫరా
కరెంట్ కోతల వల్ల మిర్యాలగూడ నుంచి ప్రెషర్ రాకపోవడంతో పూర్తి స్థాయిలో నీటిని అందించలేకపోతున్నాం. దీంతో పాటు 4 నెలలుగా పంపు ఆపరేటర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో వారం రోజుల పాటు సమ్మె చేశారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తాం.
- బండా శ్రీధర్, ఏఈఈ, హుజూర్‌నగర్