అడవుల జిల్లా ఆదిలాబాద్ లోని పలు జలపాతాలు అబ్బురపరుస్తున్నాయి. వర్షాలు జోరుగా పడుతుండడంతో పొంగిపొర్లుతున్నాయి. ఈ జలపాతాలను అందాలను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. - నేరడిగొండ, వెలుగు
రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం
రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందింది నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం. నేషనల్ హైవే నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్తే దట్టమైన అటవీ ప్రాంతంలో దర్శనమిస్తుంది. ఎత్తయిన రెండు కొండల మధ్య నుంచి జాలువారుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభుత్వం వసతులు కల్పిస్తే పర్యాటకులు ఎక్కువమంది వచ్చేందుకు ఆస్కారం ఉంది.
నేషనల్ హైవే వెంట కొరటికల్
నేరడిగొండ మండల కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే సమీపంలోనే కొరటికల్ జలపాతం దర్శనమిస్తుంది. తక్కువఎత్తులో ఉన్నప్పటికీ ఆ ప్రవాహ హోరు ప్రయాణికుల్ని ఆగి చూసేలా చేస్తోంది.
ప్రకృతి ఒడిలో పొచ్చెర
పొచ్చెర జలపాతానికి మంచి పిక్నిక్ స్పాట్‌గా పేరుంది. ఇక్కడ ఏర్పాటుచేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. నేరడిగొండ నుంచి బోథ్ మార్గంలో 4 కిలోమీటర్లు వెళ్తే ఎక్స్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి మరో 4 కి.మీ. దూరం వెళ్తే జలపాతానికి దారి కనిపిస్తుంది.
కనువిందుచేసే గాయత్రి
నేరడిగొండ మండలంలోని తర్ణం గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గాయత్రీ జలపాతం ఉంది. రెండు భారీ కొండల మధ్య దాదాపు 350 అడుగుల పైనుంచి జలపాతం ప్రవహిస్తుంది. జలపాతం కింది భాగంలో అప్పుడప్పులు ఇంద్రధనస్సు ఆవిష్కృతమై అబ్బురపరుస్తుంది. సూర్యుడి కాంతి ఎక్కువగా ఉన్నంతసేపు ఈ అద్భుతం అలాగే ఉంటుంది.
వారెవ్వా.. గుత్పాల
నేరడిగొండ మండలంలోని రోల్ మామడ నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తే గుత్పాల జలపాతం కనిపిస్తుంది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ధారలను చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు. అయితే జలపాతానికి వెళ్లేందుకు రోడ్డున్నా సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో జలపాతం ఉన్న విషయం కూడా తెలియడం లేదు.